గ్రూప్–4 అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి :  కలెక్టర్ గరిమా అగర్వాల్

  • గ్రూప్–4 అభ్యర్థులు సకాలంలో సెంటర్ కు చేరుకోవాలి
  • ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్

కరీంనగర్ టౌన్, వెలుగు: జులై 1న జరిగే గ్రూప్–4 పరీక్ష  రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని,15నిమిషాల ముందే గేట్లు క్లోజ్​ చేస్తామని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్‌పై ఫొటో రానివారు మూడు పాస్ ఫొటోలతో గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్​ చేయించుకొని పరీక్షకు హాజరుకావాలన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్  జయంతి సందర్భంగా జాతీయ గణాంక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో  ట్రైనీ ​కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో,  ముఖ్య ప్రణాళిక అధికారి డి. కొమురయ్య, గణాంక అధికారి వి.రాందత్తరెడ్డి 
తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్,వెలుగు: జులై 1న నిర్వహించే గ్రూప్ –4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పరీక్షకు హాజరయ్యే 21,937మంది అభ్యర్థులకు 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టైం దాటిన తర్వాత పరీక్షకు అనుమతించరని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అభ్యర్థులు తమవెంట ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు తీసుకురావద్దని అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకురావాలని, మహిళలు నగలు ధరించి రావద్దని సూచించారు. 

సెంటర్ల వద్ద 144 సెక్షన్​ 

కరీంనగర్‌క్రైం, వెలుగు :   గ్రూప్ –4 పరీక్ష సందర్భంగా సెంటర్ల వద్ద 144 సెక్షన్​ విధించినట్లు కరీంనగర్​సీపీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు.  జిల్లావ్యాప్తంగా 154 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.