
రాష్ట్ర స్థాయిలో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడే పరీక్ష గ్రూప్4. అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా సర్కార్ కొలువు సొంతం చేసుకోవాలనే ఆశతో సివిల్స్, గ్రూప్-1, 2, 3 పరీక్షలకు సిద్ధమయ్యే వారు సైతం ఈ పరీక్షకు సన్నద్ధం అవుతుంటారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ విడుదల చేసిన 9,168 గ్రూప్4 పోస్ట్‌ల భర్తీకి డిసెంబర్ 23 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ మొదలుకానుంది. ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ప్రిపరేషన్ విధానం గురించి తెలుసుకుందాం..
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ హోదాల్లో మొత్తం 9,168 పోస్ట్‌ల భర్తీకి టీఎస్పీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పరీక్షకు పోటీ పడే వారి సంఖ్య దాదాపు పది లక్షల వరకు ఉండొచ్చు. అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు రెండు పేపర్లకు సంబంధించి సిలబస్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీంతో చదవాల్సిన టాపిక్స్‌పై అవగాహన రావడంతో పాటు ఆయా అంశాలకు లభించే వెయిటేజీపైనా ప్రాథమిక అంచనా వస్తుంది. –
ఎగ్జామ్ ప్యాటర్న్: రెండు పేపర్లతో 300 మార్కులకు టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించనుంది. ఇందులో పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ 150 మార్కులకు, అలాగే పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా.. జోనల్, డిస్ట్రిక్ట్, కేటగిరీ వారీ మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు చేపడుతారు.
సొంతంగా నోట్స్ ప్రిపరేషన్ : ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. దీంతో రివిజన్ టైమ్‌లో ఈజీగా ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నా అభ్యర్థులు విశ్లేషణాత్మక అధ్యయనం చేయాలి. ఇన్‌డైరెక్ట్ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువ ఉండడంతో డిస్క్రిప్టివ్ మెథడ్‌లో ప్రిపరేషన్ కొనసాగించాలి. ప్రతి అంశం గురించి బేసిక్స్ మొదలు సమకాలీన అంశాల వరకు పూర్తి స్థాయి అవగాహన పెంపొందించుకోవాలి.
లోకల్ టూ ఇంటర్నేషనల్ ఈవెంట్స్: కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ విభాగాల నుంచి 20 ప్రశ్నలు వస్తాయని అంచనా వేయొచ్చు. న్యూస్ పేపర్స్ చదివి పరీక్ష కోణంలో ప్రశ్నలు అడిగే అంశాలను గుర్తించడం కీలకం. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతదేశ ప్రమేయం, భారత్‌పై ప్రభావం చూపే అవకాశమున్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జీ20, క్వాడ్, బిమ్స్టెక్, సార్క్, బ్రిక్స్ లాంటి సంస్థలపై అవగాహన పెంచుకోవాలి.
హిస్టరీ, పాలిటీ, ఎకానమీ : హిస్టరీలో కీలక సంఘటనలు, అవి జరిగిన సంవత్సరాలను గుర్తుంచుకోవాలి. పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ పీఠిక, ముఖ్యమైన ఆర్టికల్స్, ప్రకరణలు, సవరణలతో పాటు కరెంట్ పాలిటీపై ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎకానమీలో ప్రాథమిక అంశాలతోపాటు ఇటీవల కాలంలో ఆర్థిక విధానాలు, అభివృద్ధి కారక పథకాలు, సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు, పథకాల లక్ష్యం వంటి అంశాలను చదువుకోవాలి.
జనరల్ సైన్స్, జాగ్రఫీ : జనరల్ సైన్స్‌కి సంబంధించి బేసిక్ సైన్స్ అంశాలతోపాటు నిజ జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ఇటీవల కాలంలో ఈ రంగంలో తాజా పరిణామాలు, వ్యాధులు, వ్యాక్సిన్స్, లాంటి అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీలో భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రాంతాలు, ఖనిజ వనరులు, సహజ వనరులు, నదీ తీర ప్రాంతాలు, అడవులు-రకాలు, పంటలు- అవి ఎక్కువగా పండే ప్రాంతాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. పర్యావరణ సమస్యలలో ముఖ్యంగా అంతర్జాతీయ పరంగా చేసుకున్న చట్టాలు వాటికి భారతదేశంతో ఉన్న సంబంధాలు, పర్యావరణ ఒప్పందాలు, ఉల్లంఘనలు, సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మొదలైన వాటిపై ఫోకస్ చేయాలి.
అర్థమెటిక్: ఈ విభాగం నుంచి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, శాతాలు, త్రికోణమితి, ఆల్జీబ్రా, జామెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ అంశాలపై పట్టు సాధించాలి.
మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్: రీజనింగ్‌లో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సిరీస్(నంబర్/ ఆల్ఫా న్యుమరిక్), అనాలజీస్, ఆడ్‌మన్ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, నాన్ వెర్బల్ (వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్), కోడింగ్ డీకోడింగ్ మొదలైన టాపిక్స్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి.
ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ : ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ కోసం బేసిక్ గ్రామర్ అంశాలుగా భావించే సినానిమ్స్, యాంటానిమ్స్, ఇడియమ్స్/ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విభాగాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వొకాబ్యులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్, గ్రామర్‌లపై పట్టు సాధించాలి. ఈ విభాగం నుంచి ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
వాక్యలు సరైన క్రమంలో అమర్చడం సాధారణంగా అత్యధిక స్కోర్ చేసే టాపిక్. సమయం కూడా ఎక్కువ కిల్ చేస్తుంది. ఇంగ్లిష్ భాషపై పట్టున్న వారికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సరిగ్గా ఫోకస్ చేస్తే ఇందులో 15 మార్కులు సాధించవచ్చు.
సిలబస్ సమన్వయంతో గ్రూప్స్ జాబ్
గ్రూప్-4 రాసే అభ్యర్థులు గ్రూప్-2, 3 సర్వీసులకు పోటీ పడతారు. గ్రూప్ 2, 3, 4ల్లో ఉమ్మడి సిలబస్‌ను, ఆయా పరీక్షలకు ప్రత్యేకంగా పేర్కొన్న టాపిక్స్‌తో జాబితా సిద్ధం చేసుకోవాలి. దీనికి అనుగుణంగా ఉమ్మడి అంశాలకు, వేర్వేరుగా ఉన్న టాపిక్స్‌కు ప్రత్యేక సమయం కేటాయించుకునేలా ప్లాన్ చేయాలి. ఆయా అంశాలకు లభించే వెయిటేజీ అంచనా మొదలు తుది దశలో రివిజన్ వరకూ ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే గ్రూప్స్ జాబ్ కొట్టడం సులువు.
పేపర్ 2 వెయిటేజీ
రెండో పేపర్‌లో 150 మార్కులకు 5 అంశాల (మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, వాక్యలను సరైన క్రమంలో అమర్చడం, న్యూమెరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటి) నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ పేపర్ పూర్తిగా ప్రాక్టీస్, స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్కులు, లాజికల్ రీజనింగ్ నుంచి దాదాపు 25 నుంచి 30 మార్కులు, కాంప్రహెన్షన్ నుంచి సుమారు 20 మార్కులు, సరైన క్రమంలో వాఖ్యలు అమర్చడం టాపిక్ నుంచి 15 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అర్థమెటిక్ నుంచి 20 నుంచి 30 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
తెలంగాణ అంశాలపై ఫోకస్
జనరల్ నాలెడ్జ్ పేపర్‌లో పదకొండు విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 150 మార్కులకు నిర్వహించే పరీక్షలో ఒక్కో విభాగం నుంచి 12 నుంచి 13 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, తెలంగాణ ప్రాంత ప్రాధాన్యత అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే వీలుంది. కాబట్టి అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం, తెలంగాణ రాష్ట్ర విధానాల గురించి ఎక్కువ అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఉద్దేశాలు తెలుసుకోవాలి.
- పృథీవ్ కుమార్ చౌహాన్, పృథ్వీస్ IAS స్డడీ సర్కిల్