
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ తర్వాత అతిపెద్ద నోటిఫికేషన్ గ్రూప్–4. సాధారణ డిగ్రీ అర్హతతో 9186 పోస్టులకు ఈ నెల ఆఖరులో అప్లికేషన్ ప్రాసెస్ మొదలు కానుంది. ఏప్రిల్/ మే నెలలో పరీక్ష జరగనుంది. మొదటి పేపర్‌తో పోలిస్తే రెండో పేపర్ స్కోరింగ్ కావడంతో ఇందులో సాధించే మార్కులే అభ్యర్థి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. టీఎస్పీఎస్సీ సిలబస్ ప్రకారం పేపర్–2 సెక్రటేరియల్ ఎబిలిటీలో ఐదు అంశాలు ఉన్నాయి. అవి.. మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్‌వెర్బల్), లాజికల్ రీజనింగ్, కాంప్రహెన్షన్, రీ–అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టూ ఇంప్రూవింగ్ అనాలసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్, న్యూమరికల్– అర్థమెటికల్ ఎబిలిటీస్. ఇందులో రెండు విభాగాలు రీజనింగ్, రెండు విభాగాలు ఇంగ్లిష్, ఒక విభాగం అర్థమెటిక్‌కు సంబంధించినవి ఉన్నాయి. గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే అత్యధికంగా రీజనింగ్ నుంచి వచ్చాయి. ఆ తర్వాత అర్థమెటిక్ నుంచి ప్రశ్నలను ఇచ్చారు. కాంప్రహెన్షన్, రీ–అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఏ వ్యూ టూ ఇంప్రూవింగ్ అనాలసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి.
రీజనింగ్
మెంటల్ ఎబిలిటీలో వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలుంటాయి. వెల్బర్ రీజనింగ్‌లో కేలండర్, గడియారాలు, టైమ్ సీక్వెన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్, డెరైక్షన్ టెస్ట్, నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్– డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఫజిల్ టెస్ట్, సీటింగ్ ఆరేంజ్మెంట్స్, అర్థమెటికల్ రీజనింగ్, అనాలజీ, భిన్నమైంది గుర్తించడం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
నాన్ వెర్బల్ రీజనింగ్‌లో క్యూబ్స్ అండ్ డైస్, సిరీస్, అనాలజీ, భిన్నమైన దాన్ని గుర్తించడం, మిర్రర్ ఇమేజేస్, వాటర్ ఇమేజేస్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, కౌంటింగ్ ఫిగర్స్ ముఖ్యమైనవి.
లాజికల్ రీజనింగ్‌లో లాజికల్ వెన్ డయాగ్రమ్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్, అసర్షన్ అండ్ రీజన్, సిల్లోజియమ్ (తీర్మానాలు), డేటా సఫిషియెన్సీ, డేటా ఇంటర్ ప్రిటేషన్స్ ముఖ్యమైనవి. ఈ టాపిక్‌ను వీలైనంత వరకు ఇంగ్లిష్‌లో నేర్చుకోవడం వల్ల కన్ఫ్యూజన్ ఉండదు. ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది.
టేబుల్స్ ముఖ్యం
అర్థమెటిక్ విభాగంలో సరాసరి, సంఖ్యలు, గసాబా–కసాగు, దశాంశ భిన్నాలు, వర్గమూలాలు–ఘనమూలాలు, సూక్ష్మీకరణాలు, వయస్సులపై ప్రశ్నలు, సంఖ్యపై ప్రశ్నలు, నిష్పత్తి–అనుపాతం, భాగస్వామ్యం, శాతాలు, లాభనష్టాలు, సరళ వడ్డీ, చక్ర వడ్డీ, మిశ్రమాలు, కాలం–పని, పంపులు– ట్యాంకులు, పనులు–వేతనాలు, కాలం–దూరం, రైళ్లు, పడవలు– ప్రవాహాలు, ఆటలు–పందేలు, వైశాల్యములు, ఘణ పరిమాణాలు ముఖ్యమైనవి. ఈ విభాగంలో మంచి మార్కులు రావాలంటే టేబుల్స్, స్క్వర్స్, క్యూబ్స్‌పై పట్టు సాధించాలి. +, -, X, ÷ గుర్తులను త్వరగా సాధన చేయడం రావాలి. అన్నింటి కంటే ముఖ్యంగా లెక్క చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
వెయిటేజీ గుర్తించాలి
గ్రూప్–4 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు ఏ మాత్రం సమయం వృథా చేయకుండా పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ముందుగా నోటిఫికేషన్లో పేర్కొన్న సిలబస్‌ను విశ్లేషించుకోవాలి. ఏయే అంశాలకు వెయిటేజీ ఉందో గుర్తించాలి. అంశాల వారీగా సిలబస్‌ను విభజించుకోవాలి. రివిజన్ చేసుకోవడానికి వీలుగా నోట్స్‌ను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే చదివిన అంశాలు క్రమం తప్పకుండా రివిజన్ చేసుకోవడానికి వీలవుతుంది. గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి పశ్నల స్థాయిపై అవగాహన ఏర్పరుచుకోవాలి. కాన్సెప్ట్‌తో కూడిన షార్ట్‌కట్స్ సాధన చేయాలి. జతపరచండి తరహా ప్రశ్నల విషయంలో గందరగోళానికి గురికాకుండా కచ్చితమైన సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ప్రశ్నలకు సమాధానాలు రాసేలా మరొకటి సమాధానాలు ఇచ్చి ప్రశ్నలు గుర్తించేలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో జరిగిన ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్–1 స్థాయిలోనే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మాక్‌టెస్టులు/ గ్రాండ్ టెస్టులు రాసి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తప్పులను సరిదిద్దుకుంటూ ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకోవాలి.
రివిజన్ ముఖ్యం
అభ్యర్థులు చదివిన అంశాలను ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలి. వారంలో ఒకసారి, నెలలో రెండోసారి రివిజన్ కోసం సమయం కేటాయించాలి. అలాగే పరీక్షకు ముందు నేర్చుకున్న అంశాలను తప్పనిసరిగా రివిజన్ చేయాలి. అర్థమెటిక్, రీజనింగ్‌కు ప్రాధాన్యమున్న పరీక్షలో విజయం సాధించాలంటే ప్రాక్టీస్ అత్యంత కీలకం. సాధన ద్వారానే విజయం వర్తిస్తుందనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ప్రశ్నల సరళిని అనుసరించి 70శాతం వరకు మార్కులు తెచ్చుకోగలిగితే తప్పకుండా విజయం వరిస్తుంది.
కాంప్రహెన్షన్ ప్యాసేజ్
పేపర్–2లో ఇంగ్లిష్ విభాగంలో రెండు భాగాలు ఉన్నాయి. అవి.. రీడింగ్ కాంప్రహెన్షన్, సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఒక ప్యాసేజ్ ఇచ్చి దానికి దిగువన ప్రశ్నలను ఇస్తారు. ప్యాసేజ్ను అర్థం చేసుకుని ప్రశ్నలను గుర్తించాల్సి ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్‌లో భాగంగా వాక్యాలను క్రమపద్ధతిలో అమర్చడంలో ఒక ప్యాసేజ్ విశ్లేషణను మెరుగుపరిచే ఉద్దేశంతో వాక్యాలను సరైన క్రమంలో అమర్చాల్సి ఉంటుంది. ఇందులో గ్రామర్, వొకాబిలరీ ఉండదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి ఎస్సీఈఆర్టీకి సంబంధించిన 8, 9, 10వ తరగతి ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకాలతోపాటు ప్రతిరోజు ఏదైనా ఒక ప్రముఖ ఇంగ్లిష్ పేపర్ చదవడం ద్వారా ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మోడల్ ప్యాసేజ్ను ప్రాక్టీస్ చేయాలి.
ఎవరైనా విజయం సాధించొచ్చు
గ్రూప్–4లో రెండో పేపర్ సెక్రటేరియల్ ఎబిలిటీస్.. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కష్టమనే అపోహ కొంత మంది అభ్యర్థుల్లో ఉంది. ఇది ఎంత మాత్రం నిజం కాదు. సిలబస్ లో రీజనింగ్‌కు పెద్ద పీట వేసిన విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. 2018లో జరిగిన గ్రూప్–4 పరీక్షలో రీజనింగ్ నుంచే 70 ప్రశ్నలు వచ్చాయి. మ్యాథ్స్, నాన్ మ్యాథ్స్‌తో సంబంధం లేకుండా ఎవరైనా రీజనింగ్ ప్రశ్నల ను సాల్వ్ చేయవచ్చు. అలాగే కాంప్రహెన్షన్, గ్రంథంలోని ఒక భాగం విశ్లేషణ సామర్థ్యం కోసం వాక్యాలు తిరిగి ఏర్పాటు చేయడం నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.