ముషీరాబాద్, వెలుగు: గ్రూప్1 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్చేస్తూ మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులు శుక్రవారం ర్యాలీ చేపట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం గాంధీనగర్ ఆంధ్ర కేఫ్ నుంచి ధర్నా చౌక్ వరకు 150 మంది అభ్యర్థులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాస్కులు ధరించి ర్యాలీగా బయలుదేరారు. అశోక్ నగర్ చౌరస్తా వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగిన అభ్యర్థులను చెదరగొట్టారు. ప్రభుత్వానికి తమ సమస్య అర్థంకావాలని నిరసనలు తెలియజేస్తుంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జ్ చేస్తున్నారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రూప్1 పై కోర్టులో ఉన్న కేసులు క్లియర్ చేసిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇప్పుడు మెయిన్స్ పరీక్షలు నిర్వహించినా కూడా మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని.. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుందని అభ్యర్థులు అన్నారు. తర్వాత సాయంత్రం బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో గ్రూప్ 1 అభ్యర్థులు గాంధీనగర్ ఎస్బీఐ బ్యాంకు వద్దకు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వారు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని గాంధీనగర్ లో కలిసిన అభ్యర్థులు గ్రూప్1 మెయిన్స్ వాయిదా వేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రిలిమ్స్ పరీక్షలో రిజర్వేషన్లు అమలు చేయలేదని అభ్యర్థులు వివరించారు. తమ పార్టీ తరఫున పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తానని కిషన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు.