- సర్కార్‌కు గ్రూప్ 1 అధికారుల వినతి
- 2015లో టాస్‌పై స్టడీకి ఐఏఎస్‌లతో కమిటీ ఏర్పాటు
- ఇప్పటి వరకు నివేదిక ఇవ్వని ప్యానెల్
- రాష్ట్రంలో తీవ్ర ఐఏఎస్‌ల కొరత
- 210 మంది ఉండాల్సింది.. 160 మందే ఉన్నరు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని గ్రూప్ 1 అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో ఐఏఎస్ ల కొరత ఉన్న నేపథ్యంలో టాస్ ఏర్పాటు చేస్తే కొన్ని పోస్టుల్లో గ్రూప్ 1 అధికారులను నియమించే చాన్స్ ఉంటదని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 208 ఐఏఎస్ పోస్టులు సాంక్షన్ చేస్తే.. ప్రస్తుతం 160 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం రేవంత్ రెడ్డి కలిసిన పలు సందర్భాల్లో ఐఏఎస్ లు కేటాయించాలని కోరుతున్నారు. ఐఏఎస్‌ల కొరత కారణంగా ఒక్కో అధికారి 3, 4 బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టాస్ ఏర్పాటు చేస్తే కార్పొరేషన్లతో పాటు మరి కొన్ని డైరెక్టర్ పోస్టుల్లో గ్రూప్ 1 అధికారులను నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటదని అంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లో సక్సెస్
కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను ఏర్పాటు చేసుకున్నాయి. అన్ని చోట్ల సక్సెస్ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో అధ్యయనం చేసేందుకు వెళ్లిన టైమ్‌లో అక్కడి అధికారులు చెప్పారని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్లు చెప్తున్నారు. అన్ని శాఖల్లోని పోస్టులను అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లోకి తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులకు మాత్రమే ఐఏఎస్ పదోన్నతులు కల్పిస్తున్నారు. దీంతో అన్ని శాఖల్లో ఉన్న గ్రూప్ 1 అధికారులకు న్యాయం దక్కుతున్నది.
2015లో కమిటీ ఏర్పాటు
టాస్ ఏర్పాటు చేయాలని గత 10 ఏండ్ల నుంచి గ్రూప్ 1 అధికారులు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారులు విన్నవించగా.. మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ గా పంచాయతీరాజ్, జీఏడీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ లతో 2015, మార్చిలో అప్పటి సీఎస్ రాజీవ్ శర్మ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జీవో 777ను జారీ చేశారు.
టాస్ ఏర్పాటు ఆవశ్యకత, ఇతర రాష్ట్రాల్లో స్టేట్ సర్వీస్ ఉందా? అనే అంశాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఇప్పటి దాకా ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదని గ్రూప్ 1 అధికారులు చెప్తున్నారు. తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున గ్రూప్ 1 అధికారులు కూడా కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో పర్యటించారు. ఆయా రాష్ట్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సేవలపై అధ్యయనం చేసి ఐఏఎస్ అధికారుల కమిటీకి 2016, ఆగస్ట్ లో రిపోర్టు అందజేశారు.
నాన్ రెవెన్యూ అధికారులకు అన్యాయం
ఉదాహరణకు 100 ఐఏఎస్ పోస్టులు ఉంటే ఇందులో 66 శాతం యూపీఎస్సీ కింద డెరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మిగతా 34 శాతం సీనియర్ గ్రూప్ 1 ఆఫీసర్లకు కన్ ఫర్డ్ ఐఏఎస్ లుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన వారికి ఇంటర్వ్యూ చేపట్టి యూపీఎస్సీ ఎంపిక చేస్తున్నది. ఇందులో కూడా రెవెన్యూ అధికారులకే ఎక్కువ పోస్టులు దక్కుతున్నాయి. ప్రతిభావంతులైన నాన్ రెవెన్యూ గ్రూప్ 1 ఆఫీసర్లకు అన్యాయం జరుగుతున్నదనే వాదన కొన్నేండ్లుగా ఉన్నది.
రిపోర్ట్‌ను ప్రభుత్వానికి ఇవ్వాలి
టాస్ ఏర్పాటుపై మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ గా ఏర్పాటైన ఐఏఎస్ అధికారుల కమిటీ.. తమ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేయాలి. ఆ రిపోర్ట్ సిఫార్సులకు అనుగుణంగా టాస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. టాస్ ఏర్పాటుతో ఐఏఎస్ ల భారం తగ్గించొచ్చు. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీని త్వరలో కలిసి టాస్ గురించి వివరిస్తాం. ఇతర రాష్ట్రాల్లో సక్సెస్ అయిన విషయాన్ని తెలియజేస్తాం. టాస్ ఏర్పాటు చేస్తేనే గ్రూప్ 1 అధికారులకు న్యాయం జరుగుతుందని తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.