కోదాడ, వెలుగు: కోదాడ డివిజన్ లో కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి, సౌకర్యాలు కల్పించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం జరిగిన రైతు సంఘాల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ జాగాల్లో ఏర్పాటు చేయాలని, రైతులకు అవసరమైన బస్తాలను కల్లాల వద్ద అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ధాన్యం రవాణా కు లారీలు అందుబాటులో లేకపోతే రైతులు తమ వాహనాలలో ధాన్యాన్ని రవాణా చేసేందుకు వే బ్రిడ్జి, కాటా సౌకర్యాలు కల్పించాలని, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంకు కాటాతో సంబంధం లేకుండా తార్ఫలిన్ వెంటనే ఇవాలని కోరా రు. ఈ సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు కణజాల నారాయణ, వంగ వీటి రామారావు, ఆవుదొద్ది ధన మూర్తి పాల్గొన్నారు.
అపరిచితులతో మైనర్లు అప్రమత్తంగా ఉండాలె
హుజూర్ నగర్, వెలుగు: అపరిచితులతో పరిచయాల పట్ల మైనర్లు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హుజూర్ నగర్ మైనారిటీ గురుకుల కాలేజీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. దీనికి శ్యాం కుమార్ ముఖ్య అతిథిగా వచ్చారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల, బాలికలను నేరాలకు వారధులుగా వాడుకోవడం కఠిన శిక్షార్హమైవన్నారు. గంజాయిని వాడటం, రవాణా చేయడం, అమ్మడం, చట్ట ప్రకారం నేరమని రవాణా చేసే నేపథ్యంలో పోలీసుల కంటపడకుండా, చిన్నారులను, స్టూడెంట్ లను కొరియర్లుగా ఏర్పాటు చేసుకొని రవాణా చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయని చెప్పారు.
వీటి నుంచి మైనర్లను రక్షించడానికి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి కొత్త వారెవరైనా బాల బాలికలతో పరిచయాలు పెంచుకోవడానికి, చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రెహనా బేగం, న్యాయ వాదులు కాల్వ శ్రీనివాసరావు, చల్లా కృష్ణయ్య, కుక్కడపు సైదులు, ఎం.ఎస్. రాఘవరావు, మీసాల అంజయ్య, పచ్చిపాల గురుమూర్తి పాల్గొన్నారు.
చెకుముకి పరీక్షతో విద్యార్థుల్లో సృజనాత్మకత
సూర్యాపేట, వెలుగు: శాస్త్రీయ ఆలోచనలతో సృజనాత్మక పెరుగుతుందని, దానికి చెకుముకి పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయుల సంఘం
జిల్లా అధ్యక్షులు జెల్లా ప్రసాద్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వాల్ పోస్టర్ ను మంగళవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈనెల 18న జరిగే పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, చెకుముకి కన్వీనర్ ఇటుకుల సైదులు, వివిధ ఉన్నత ప్రధానోపాధ్యాయులు వనమాల వెంకటేశ్వర్లు, అంకతి వెంకన్న, అశోక్ పాల్గొన్నారు.
క్రీడాకారుల అభివృద్ధికి కబడ్డీ అసోసియేషన్ కృషి
సూర్యాపేట, వెలుగు: జిల్లాలో కబడ్డీ క్రీడాకారుల అభివృద్ధికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ కృషి చేస్తుందని కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రెండు కబడ్డీ అసోసియేషన్లు ఉండడంతో క్రీడాకారులు అయోమయంలో ఉన్నందున వాటిని విలీనం చేశామన్నారు. కలిసికట్టుగా ఉంటూ కబడ్డీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్య క్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రాంచందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు లాల్ మదర్, వెంకటేశ్వర్లు, ఇమామ్, శివనాథ్ రెడ్డి, టి.రాములు, బాగ్దాద్, గడ్డం వెంకటేశ్వర్లు, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.