నకిరేకల్​లో ముఖ్యనేతల గ్రూప్​ పాలిటిక్స్​

ఎమ్మెల్యే చిరుమర్తికి మద్దతుగా గుత్తా వర్గం
తాజాగా ఎమ్మెల్యేతో కలిసి సమ్మేళనంలో పాల్గొన్న గుత్తా కొడుకు అమిత్​రెడ్డి
మాజీ ఎమ్మెల్యే వేములకు నల్గొండ ఎమ్మెల్యే అన్న, నేతి అండ 

నల్గొండ, వెలుగు: నకిరేకల్ ​నియోజకవర్గంలో బీఆర్​ఎస్ లీడర్లు తలోదారి పట్టినట్లు తెలుస్తోంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయినప్పటికీ దీనిపైన పెత్తనం చలాయించేందుకు అగ్రనేతలు గ్రూపులుగా విడిపోయి తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి మధ్య రాజకీయ వైరాన్ని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు కొందరు బీఆర్ఎస్​ అగ్రనేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు అందుకు వేదికగా నిలుస్తున్నాయి. మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ ​రెడ్డి కొడుకు అమిత్​రె డ్డి  మంగళవారం చిట్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి పాల్గొనడం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న అమిత్​రెడ్డి ఎమ్మెల్యే చిరుమర్తితో కలిసి చిట్యాలలో పర్యటించడం చర్చనీయాంశమైంది. 

రెండు వర్గాలుగా చీలిన అగ్రనేతలు
చిట్యాలలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అమి త్​ రెడ్డి పాల్గొనడంతో గుత్తా వర్గం ఎమ్మెల్యే చిరుమర్తికి అండగా నిలిచినట్లు పార్టీ నేతలకు సంకేతాలు పంపినట్లైంది. అయితే గతంతో ఎమ్మెల్యేతో కలిసి గుత్తా సుఖేందర్​ రెడ్డి సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ ఆత్మీయ సమ్మేళనంలో ప్రత్యేకంగా అమిత్​ రెడ్డి కనిపించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఓవైపు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి అన్న కృష్ణారెడ్డి, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్​ నేతి విద్యాసాగర్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి అండగా నిలబడి రాజకీయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఉగాది పండగ ముందు నేతి విద్యాసాగర్ నకిరేకల్ మండలం ఆరెగూడెం తోట లో దేవుడి పండగ చేశారు. దీనికి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీరేశానికి ఆహ్వానం పంపడంతో వారు హాజరయ్యారు. ఈ ఫంక్షన్​కు కట్టంగూరు, నకిరేకల్​ మండలంలోని నేతి వర్గీయులు హాజరుకావడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇప్పుడు ఎమ్మెల్యే చిరుమర్తికి సపోర్ట్​గా గుత్తా కొడుకు అమిత్​ రెడ్డి, ఆయనవర్గం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం నకిరేకల్​ బీఆర్​ఎస్​లో వేడిపుట్టిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు రెండు గ్రూపులుగా విడి పోయారు. ఇందులో పరోక్షంగా కొందరు, ప్రత్య క్షంగా మరికొంత మంది వీరేశానికి సపోర్ట్​ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం తలోదారి పట్టడం ఆసక్తికరంగా మారింది. ఇదే నియోజకవర్గంలోని కేతేపల్లి మండలానికి చెందిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​ సైతం తన వర్గాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎ న్నికల్లో పార్టీ టికెట్​ ఎవరికి ఇస్తే వాళ్లకు తమ మద్ధతు ఇస్తామని చెబుతున్నారు. కానీ పార్టీ హైకమాండ్ ​వద్ద ఏవర్గం నేతల మాట చెల్లుబాటు అవుతుందనేది వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే ఎమ్మెల్యే చిరుమర్తికి జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి, కేటీఆర్​ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. వీరేశం సైతం మంత్రి హారీశ్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ వర్గ పోరులో నకిరేకల్​ సీటు ఎవరికి దక్కుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.