ఆదిలాబాద్ టీఆర్ఎస్ లో గ్రూపుల గొడవ

అధికార పార్టీనేతల తలోదారి

హైకమాండ్​ వద్దకు నేతల పంచాయితీ

పోటాపోటీగా వెళ్తున్న నాయకులు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలు

ఆదిలాబాద్,వెలుగు: ఉమ్మడి జిల్లా గులాబీలో గ్రూప్ ల లొల్లి మళ్లీ మొదలైంది. లీడర్లు ఎవరికి వారు మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. కొందరు నాయకులు తమదంటే తమదే పెత్తనమంటున్నారు. అంతేకాదు పలువురు వేర్వేరుగా మంత్రులను కలవడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. డీసీసీబీ ఎన్నికల సమయంలో ఏర్పడ్డ మనస్పర్థాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్​ లోకల్​ఎమ్మెల్యే జోగు రామన్నను విస్మరించి మరోవర్గం దూసుకుపోతోంది. నూతన రెవెన్యూ చట్టాన్ని ఆహ్వానిస్తూ సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీకి టీఆర్ఎస్​లీడర్లు కొందరు డుమ్మాకొట్టారు. ఇటీవల జరిగిన కోవిడ్ రివ్యూ మీటింగ్​కూడా ఎమ్మెల్యేకు తెలియకుండా మాజీ ఎంపీ నగేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వరుస ఘటనలతో సీరియస్​గా ఉన్న జోగురామన్న అసంతృప్తి లీడర్లను కూర్చొబెట్టి మాట్లాడినట్లు తెలిసింది. ఇటీవల బోథ్ నియోజకవర్గానికి చెందిన నాయకులతో మంత్రి కేటీఆర్ ను కలిశారు. స్థానిక పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సోషల్​ మీడియాలో హల్​చల్​..

ఆదిపత్య పోరు సాగుతున్న క్రమంలో వేర్వేరుగా మంత్రులను కలిసిన ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో స్థానికంగా టీఆర్​ఎస్​లో కొనసాగుతున్న దూరం మళ్లీ చర్చనీయాంశమైంది. దీంతో నేతల మధ్య తలెత్తిన వివాదాలు చినికిచినికి గాలివానలా మారే అవకాశాలున్నాయి.