- చైనాకు బదులు ఇండియా, వియత్నాం వైపు
- చూస్తున్న యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ (మార్కెట్ క్యాప్ పరంగా) యాపిల్ చైనాకు బదులు ఇండియాలో తమ ప్రొడక్ట్‌ల తయారీని విస్తరించాలని చూస్తోంది. కొన్ని నెలల కిందట లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 13 సిరీస్‌ను కూడా ఇండియాలో తయారు చేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచే ఎగుమతులు పెంచుతోంది. యాపిల్ ప్రొడక్ట్‌లు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ల ద్వారా తయారవుతాయి. తమ ప్రొడక్షన్ కెపాసిటీని ఇండియాలోనూ, సౌత్ ఈస్ట్ ఏసియా దేశాల్లో పెంచాలని కాంట్రాక్ట్ మాన్యుఫాక్చర్లను యాపిల్ అడిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత నుంచి యాపిల్ ఎగ్జిక్యూటివ్‌లు చైనాకు వెళ్లి రావడం బాగా కష్టమవుతోంది. చైనా అమలు చేస్తున్న జీరో కొవిడ్ పాలసీతో కంపెనీ సేల్స్, ప్రొడక్షన్ బాగా తగ్గింది. ప్రస్తుత క్వార్టర్‌లో 8 బిలియన్ డాలర్ల విలువైన సేల్స్ తగ్గుతాయని యాపిల్ కిందటి నెలలో ప్రకటించడం గమనించాలి. పవర్ కొరత వలన కిందటేడాది కూడా యాపిల్ ప్రొడక్షన్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో రష్యాకు చైనా మద్ధతిస్తోందనే ఆరోపణలు కూడా వెస్ట్రన్ కంపెనీలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకోసమే తమ ప్రొడక్షన్ కెపాసిటీని చైనాకు వెలుపల ఇండియా, వియత్నాం వంటి దేశాలకు విస్తరించాలని యాపిల్ చూస్తోంది.
ఇప్పటికే మొదలు..
కిందటేడాది గ్లోబల్‌గా సేల్ అయిన ఐఫోన్లలో 3.1 శాతం ఇండియాలోనే తయారయ్యాయి. ఈ వాటాను ఈ ఏడాది 6–7 శాతానికి పెంచుకోవాలని యాపిల్ చూస్తోంది. ఇప్పటికే యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లయిన ఫాక్స్‌కాన్, విస్ట్రన్ కార్పొరేషన్లు ఇండియాలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. వీటిని విస్తరిస్తున్నాయి. యాపిల్ ప్రొడక్ట్‌లను తయారు చేసే చైనీస్ కంపెనీలు కూడా చైనాకు వెలుపల తమ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి. ఇందుకోసం వియత్నాంను పరిశీలిస్తున్నాయి.