కాలుష్యానికి మూల కారణం ఒక పరిశ్రమ కావచ్చు, లేదా వాహనం కావచ్చు, లేదా మనం వాడే అనేక రకాల వస్తువులు కావచ్చు. సాధారణంగా, కాలుష్యం మనం ఎంచుకున్న జీవన శైలి వల్ల కూడా పెరుగుతుంది. మనకు స్పష్టంగా కనపడేది నిత్యం పెరుగుతున్న జల కాలుష్యం. సాధారణంగా జల కాలుష్యంలో పరిశ్రమలదే ఎక్కువ పాత్ర ఉంటుంది. వ్యర్థ జలాల పరిమాణంలో కూడా పరిశ్రమల నుంచి వచ్చేవి ఎక్కువ. పారిశ్రామిక వ్యర్థ జలాలు లక్షల నుంచి వేల కోట్ల లీటర్లకు పెరిగాయి. కాలుష్య కారక పరిశ్రమల సంఖ్య పెరిగిన దరిమిలా వ్యర్థ జలాల పరిమాణం కూడా అదే రీతిలో పెరిగింది.
గత రెండు దశాబ్దాలుగా నగరాలు, పట్టణాలు కూడా వ్యర్థ జలాల ఉత్పత్తి కేంద్రాలుగా మారినాయి. నగరాల భౌగోళిక విస్తరణకు సమాంతరంగా వ్యర్థ జలాల విస్తృతి, పరిమాణం కూడా పెరుగుతున్నది. సాధారణంగా పారిశ్రామిక వ్యర్థ జలాలను effluents అంటారు. నగరాల నుంచి వచ్చే మురికి నీటిని sewage అంటారు. పరిశ్రమలు ఎక్కువగా నగరాలలో, చుట్టు పక్కల ఏర్పాటు అయిన దరిమిలా పారిశ్రామిక వ్యర్థ జలాలు కూడా నగర నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీటిలో కలుస్తున్నాయి. ప్రమాదకర పారిశ్రామిక వ్యర్థ జలాలను పలుచన చేయాలని కావాలని కలుపుతున్నారు కూడా. పటాన్ చెరు ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం నుంచి నేరుగా మూసీ నదికి ఒక పైపులైన్ వేసి, ఆ విధంగా జల కాలుష్యం అరికట్టామని చేతులు దులుపుకుంటున్నారు.
పెరిగిన భూగర్భ నీటి వినియోగం
నగర ఇంటి నుంచి వచ్చే సగటు మురికి నీరు సాధారణ గ్రామీణ గృహం కంటే ఎక్కువగా ఉంటుంది. అట్లే, ఒక అపార్ట్ మెంట్ నుంచి వచ్చే మురికి నీటి పరిమాణం ఒక ఇంటి కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పెద్ద భవంతుల సంఖ్య ఎక్కువ అయిన కొద్దీ నీటి సరఫరా మీద, మురుగు నీటి నిర్వహణ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అపార్ట్ మెంట్ జీవనానికి, బహుళ అంతస్తుల జీవనానికి సరిపోయినంత నీటి సరఫరా లేకపోవటంతో భూగర్భ నీటిని విపరీతంగా వాడుతున్నారు.
పర్యావరణం మీద తీవ్ర ప్రభావం కనపడుతుంది. నగరాలలో వర్షపు నీటిని ఆపే వ్యవస్థ లేక, కాంక్రీట్ వలన నీరు భూమిలోకి ఇంకకుండా నేరుగా అతి తక్కువ సమయంలో మూసీ నదిలోకి పారుతున్నాయి. దీని వలన తాగడానికి అవసరమయ్యే నీరు పరిమాణం తగ్గిపోతున్నది. నగరంలోని చెరువులను పూడ్చి వేసి, కబ్జా చేసి, చెరువుల్లోకి వచ్చే నీటి పాయలను దారి మరల్చి, చెరువుల్లోకి కలుషిత నీరు వదలడం వల్ల కూడా ఉన్న జల వనరులు కాలుష్యం అవుతున్నాయి.
మురికి నదుల్లో మూసీకి నాలుగోస్థానం
మన దేశంలోని అత్యంత మురికి నదులలో మూసీ నదికి నాలుగో స్థానం లభించింది. హైదరాబాద్ నగర మురికినీరు మొత్తంగా ఈ నదిలో కలవడం మనకు తెలిసిందే. మూసీ నది పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న వ్యవసాయం కూడా కలుషిత నీటితో వాడడం వల్ల, ఆయా పంటలలో ప్రమాదకర రసాయనాలు, వ్యర్థ పదార్థాల మోతాదు పెరుగుతున్నది. వీటిని ఆహారంగా తీసుకున్న ప్రజలు, అనేక రోగాలు రుగ్మతల బారిన పడుతున్నారు. కాన్సర్, చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు విస్తృతి పెరుగుతున్నాయి.
సార్వజనీన అవసరాల కోసం భూకొరత
నిర్మాణాల వేగం, విస్తృతి నేపథ్యంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు సమాంతర వేగంతో ఏర్పాటు కావడం లేదు. అంతే వేగంగా మురికి నీరు, మంచి నీరు, రోడ్లు, చెత్త నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పడడం లేదు. అనేక ప్రాంతాలలో 10 శాతం కూడా లేదు. ఈ లోపు బహుళ మౌలిక సదుపాయాలకు కావాల్సిన భూమి కూడా హరించుకుపోతున్నది. రోడ్డు తప్పితే మిగతా భూమి అంతా నిర్మాణాల క్రిందకు, లేదా నిర్మాణాల కొరకు ఉపయోగిస్తున్నారు. సార్వజనీన అవసరాల కొరకు భూమి ఉండడం లేదు. లేఔట్ అనుమతులలో ఉమ్మడి ఉపయోగం కోసం భూమి ఉండాలని నిబంధన ఉన్నా, అది పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అమలు కావడం లేదు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యం
ఒకప్పుడు మూసీ నదిలోకి మురికి నీరు వర్షపు నీటిని చేరవేసే గొట్టాల ద్వారా చేరేది. హుస్సేన్ సాగర్ నుంచి నీరు మూసీ నదిని కలిపే నాలా ఒక్కటే మురికి నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు చేరేవి. ఇప్పుడు అటువంటి నాలాల సంఖ్య పెరిగింది. గండిపేట్ కింద అక్రమంగా కట్టిన ఆకాశహర్మ్యాల మురికి నీరు అయితే నేరుగా మూసీ నదిలోకి వదిలివేస్తున్నారు. ఒకప్పుడు హైకోర్డు నుంచి అంబర్పేట్ వరకు మూసీలో మురికి నీరు కలిసేది. ఇప్పుడు జంట జలాశయాల దిగువ నుంచి మురికి నీరు మాత్రమే ప్రవహించే పరిస్థితి వచ్చింది.
మూసీ నది మురికి నీటి ప్రవాహంగా మారడానికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉన్నది. ఈ పరిస్థితి సరి చేయాలంటే మురికి వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు, మురికి నీటి శుద్ధి కేంద్రాలు రావాలి. ప్రభుత్వం పెట్టుబడులు పెరగాలి. ట్రాఫిక్ రద్దీ నివారణకు వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చి మరీ ఫ్లై ఓవర్లు కడుతున్న ప్రభుత్వం మురికి నీటి వ్యవస్థను సరి చేయటానికి వెనుకడుగు వేస్తున్నది. మూసీ నది ఈ నిర్లక్ష్యానికి బలి అవుతున్నది.
మూసీలో ప్రమాదకర రసాయనాలు
అత్యంత ఆధునిక నగరంగా చెప్పుకునే హైదరాబాదులో, హైటెక్ ప్రాంతంలో, కోట్ల విలువ గల అనేక అంతస్తుల పెద్ద భవంతులు ఉన్నా, భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదు. నగరంలో దాదాపు వంద ఏండ్ల కిందట కట్టిన వ్యవస్థనే ఇప్పటికీ వాడుతున్నారు. నగరంలో పారే మురుగు నీటిలో కేవలం ఇంటి నుంచి వచ్చే నీళ్లేకాక, పరిశ్రమల నుంచి, కుటీర పరిశ్రమల నుంచి, వాణిజ్య కార్యకలాపాల వల్ల కూడా కలుషిత జలాలు మూసీ నదిలో కలుస్తున్నాయి.
ఈ మురుగు నీటిలో అనేక ప్రమాదకర రసాయనాలు మిళితమై, పైపుల ద్వారా మూసీ నదిలో లేదా సమీప వరద కాల్వలో లేదా చెరువులో కలుస్తున్నాయి. మురుగు నీరు శుద్ధి పరచకుండా ఈ విధంగా వదలడం వల్ల, అనేక ప్రాంతాలలో భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులు కలుషితం అయిపోతున్నాయి. కలుషిత నీరు తాగడం వల్ల, వాటి ద్వారా పండించిన గడ్డి, ఆ గడ్డిని తిన్న పాడి పశువుల పాల నుంచి కాలుష్యం తిరిగి ప్రజల వద్దకు వస్తున్నది.
నీటి పొదుపుపై ప్రజలను చైతన్య పరచాలి
నగరంలోని నీటి కాలుష్యం తగ్గించి, నీటిని వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే వ్యవస్థ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మురుగు నీటి శుద్ధి కేంద్రాలు తగినన్ని ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి. ప్రతి రోజు ఉత్పన్నం అవుతున్న మొత్తం మురుగు నీటిని, శుద్ధి కేంద్రాల ద్వారానే విడుదల చేయాలి. మురుగు నీటి నుంచి విడదీసిన వ్యర్థ పదార్థాలను వాటి లక్షణాలను బట్టి తిరిగి ఉపయోగంలోకి తీసుకురావడమో లేదా ఒక నిర్దిష్ట ప్రదేశంలో శాస్త్రీయ పద్ధతుల ప్రకారం నిలువ చేయాలి.
చెరువులు, వాగులు, కాలువలు ఇతర నీటి వనరులు కలుషితం కాకుండా కాపాడుతూ వర్షం నీరు నిలువ చేసుకునేందుకు వాటిని ఉపయోగించాలి. నీటిని పొదుపుగా వాడడానికి ప్రజలను చైతన్య పరచాలి. పారిశ్రామిక వ్యర్థ జలాలు విధిగా ఆయా పరిశ్రమలు శుద్ధి పరచి, మరల ఆ నీటినే వినియోగించే మార్గాలు అనుసరించాలి.
-డా. దొంతి నర్సింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్