వీగన్స్ ​కోసం స్పెషల్​ చికెన్ 65, సలాడ్స్​

వీగన్స్ ​కోసం స్పెషల్​ చికెన్ 65, సలాడ్స్​

 

  • సిటీలో పెరుగుతున్న నయా కల్చర్​
  • వెరైటీ ప్రొడక్ట్ ల కోసం కెఫేలు, ప్లాంటారియంలు
  • పాలు లేకుండా మిల్క్​షేక్స్​, పెరుగు తయారీ
  • వీగన్స్ ​కోసం స్పెషల్​ చికెన్ 65, సలాడ్స్​

హైదరాబాద్, వెలుగు: ఫుడ్​కల్చర్​కు పెట్టింది పేరైన హైదరాబాద్​లో వీగన్​కల్చర్ కు మస్తు డిమాండ్ వస్తోంది.  తందూరీ, రోస్టెడ్​, షవర్మా లాంటి నాన్​వెజ్​ వెరైటీలకు రాంరాం చెప్తున్న చాలామంది సిటిజన్లు మిల్క్ ప్రోడక్ట్స్​కు  దూరంగా ఉంటూ వీగన్ ( స్ట్రిక్ట్​ వెజిటేరియన్​) డైట్ వైపు మారిపోతున్నారు. వీరికి తగ్గట్టుగానే సిటీలో వీగన్​కెఫేలు పెరుగుతున్నాయి. కేవలం ప్లాంట్ బేస్డ్​ ఫుడ్​ను మాత్రమే అందించే ఈ కెఫేలకు ఆదరణ పెరుగుతోంది. ప్లాంటారియంలలో ప్రత్యేక వీగన్​ ప్రొడక్ట్స్​ దొరుకుతున్నాయి. వీగన్​ డైట్ ను ఫాలో అయ్యేవారికి కావాల్సిన హెల్దీ, ఎనర్జిటిక్ గైడ్​లైన్స్​ను కూడా డిస్​ప్లే చేస్తున్నారు. 

ఇవే​ వెరైటీలు...
వీగన్​ డైట్​లో మొత్తంగా ప్లాంట్స్​నుంచి తయారు ఫుడ్​ ఐటెమ్స్​మాత్రమే ఉంటాయి. నాన్​వెజ్​కు, డెయిరీ ప్రొడక్ట్స్​కు పూర్తిగా దూరంగా ఉంటారు వీగన్లు. అందుకే దీన్ని ఫాలో అయ్యే వాళ్లను ‘స్ట్రిక్ట్​వెజిటేరియన్స్​, నాన్​ డెయిరీ ఈటర్స్​’ అని కూడా పిలుస్తారు. మాంసానికి దూరంగా ఉన్నా కూడా బాడీకి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయని నిరూపిస్తున్నారు. అభిరుచికి తగ్గట్టు ఇంటి దగ్గరే వెరైటీలు చేసుకుంటున్నారు. చాయ్, కాఫీల నుంచి పిజ్జా, పాస్తా, సలాడ్ లు, సోయాతో చికెన్ 65, హలీమ్ లు కూడా వీగన్ల వెరైటీగా వచ్చేశాయి. సోయా, నట్స్, బాదాం లతో పాలు​, పెరుగు, మిల్క్​ షేక్​లను తయారు చేస్తున్నారు. సోయాతోనే బటర్​చికెన్​ 65, చికెన్​ సలాడ్లు ఆకట్టుకుంటున్నాయి. బిగ్ బాస్కెట్ వంటి ఈ కామర్స్​ స్టోర్లు కూడా వందల సంఖ్యలో వీగన్ ప్రొడక్ట్స్ ను సప్లయ్ చేస్తున్నాయి. సెలబ్రిటీలతో పాటు ఇటు కామన్ పీపుల్ కూడా ఈ వీగన్​ డైట్​ను ఫాలో అవుతున్నారు. 

తమలాంటి వాళ్లకోసం...
వెజ్, నాన్ వెజ్ హోటళ్లు, రెస్టారెంట్లు సిటీలో మస్తున్నయ్​. కానీ వీగన్​ రెస్టారెంట్లు తక్కువే. అందుకే కొంతమంది వీగన్స్ కలిసి కెఫేలు స్టార్ట్​ చేస్తున్నారు. తమలాంటి వారికోసం ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకురావడానికి స్టార్ట్ చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం సిటీలో ఐదారు ప్లాంటారియం వీగన్​ కెఫేలున్నాయి. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సైనిక్ పురి వంటి ప్రాంతాల్లో కొన్ని సెమీ వీగన్ కెఫేలు ఉన్నాయి. ఇక్కడ వెజిటేరియన్ ఐటమ్స్ తో పాటు వీగన్ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. 

ప్లాంట్ బేస్ ప్రొడక్ట్స్..
 వీగన్ డైట్​ను ఇంట్లో తయారు చేసుకుంటున్నప్పటికీ కెఫేల్లో రకరకాల వెరైటీలు ఉంటున్నాయి. బేక్డ్​ జాకెట్ పొటాటోస్, ఫ్రెష్ సమ్మర్ రోల్స్, క్రిస్పీ మోక్ చికెన్ 65, స్ట్రాబెరీ మౌజీ కేక్, ఓట్ పాన్ కేక్స్, వీగన్ బటర్, నాచో చీజీ సాస్, పీనట్ బటర్, పిజ్జాలు, కేక్స్ లాంటి ఎన్నో వెరైటీలు వీగన్​ డైట్​లో ఉన్నాయి. ప్రస్తుతం స్టోర్ లలో వీగన్​ పెరుగు, పాలు, కేక్స్, డిజర్ట్స్, ఐస్ క్రీమ్ కూడా వచ్చేశాయి. 

జాబ్​ వదిలేసి.. కెఫే పెట్టా. 
తొమ్మిదేళ్ల నుంచి వీగన్ డైట్​ను ఫాలో అవుతున్నా. యూఎస్ లో ఉన్నప్పుడు దీని గురించి తెలుసుకున్నా. చిన్నప్పుడు నేను నాన్ వెజిటేరియన్ ని. వీగన్​ గురించి తెలిశాక అదే ఫాలో అవుతున్నా. వీగన్ డైట్​లో పెరుగు మిస్​ అయ్యేదాన్ని. అందుకే ఇంట్లోనే సోయతో పాలు, పల్లీలతో పెరుగు రెడీ చేసేదాన్ని. మా ఇంటికి వీగన్​ ఫ్రెండ్స్​ వస్తే ఇవి చూసి ఆశ్చర్యపోయేవారు. 
అప్పుడే మాకు కెఫే పెట్టే ఆలోచన వచ్చింది. జాబ్ చేస్తూ ఒక వీగన్ స్టోర్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ ఆఫీస్, ఈవినింగ్స్ లో వీగన్​ ప్రొడక్ట్స్​ రెడీ చేసేదాన్ని. 
తర్వాత జాబ్ వదిలేసి ఫుల్ టైం స్టోర్ నడుపుతున్నాను. వీగన్ పెరుగు, పాలు, కేక్స్, డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్ రెడీ చేస్తున్నా. 
- దీపిక, ప్లాంటారియం, వీగన్ స్టోర్, గచ్చిబౌలి

యానిమల్స్​కు హాని చేయొద్దని..
పెట్స్, డాగ్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను నాన్​ వెజ్​ తినొద్దు అనుకుని  వీగన్ గా మారా. కొత్తలో బయట వీగన్ ఫుడ్​ దొరకడం కష్టం అయ్యింది. అందుకే మా ఇంట్లో నేనే సొంతంగా ఫుడ్​ రెడీ చేసేదాన్ని. అలా చాలా వెరైటీలు నేర్చుకున్నా. 2017లో వీగన్ కెఫే స్టార్ట్ చేశాం. కెఫే కిచెన్ లో లాబోరేటరీ కూడా సెట్​ చేశాం.  
- సంధ్య, వీగన్​ కెఫే ఓనర్, హైటెక్ సిటీ

ఏడాది కాలంగా..
చిన్నప్పుడు నాన్ వెజ్ బాగానే తినేవాణ్ని.  జాబ్ కోసం సిటీకి  వచ్చాక వీగన్ కెఫే చూశాను. అప్పటి నుంచి పాల ప్రొడక్ట్స్​ కూడా దూరం పెట్టేశాను. కాఫీ, టీలకు అంతగా అడిక్ట్ కాలేదు కాబట్టి వాటిని మానేశాను. ఇంటికెళ్లినప్పుడు కూడా అదే మెయింటెయిన్ చేస్తున్నా. 
- శేఖర్, సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్, వీగన్