బీఆర్​ఎస్​లో పెరుగుతున్న అసమ్మతివాదులు 

  • తీవ్ర అసంతృప్తిలో సెకండ్​క్యాడర్​ లీడర్లు  
  • ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు ఎదురుచూపులు  
  • మరికొందరు లీడర్ల పక్కచూపులు

మంచిర్యాల, వెలుగు:  వచ్చే ఎన్నికల్లో టికెట్ రెన్యువల్ పై ఆందోళన చెందుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్ లీడర్లు పక్కలో బల్లెంగా మారారు. ఎమ్మెల్యేలు కొంతమందికే ప్రాధాన్యతనిస్తూ మరికొందరిని పక్కనపెట్టడం, తొక్కేయడం వల్ల పలువురు నాయకులు పగతో రగిలిపోతున్నారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులతో పాటు మండల స్థాయి, ఇతర కీలక నాయకులు అధికార పార్టీలోనే ఉంటూ పక్క పార్టీ లీడర్లతో దోస్తానా చేస్తున్నారు. అంతేగాకుండా ఎమ్మెల్యేలతోనే తిరుగుతూ వారికి తెలియకుండానే గోతులు తవ్వుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యే టికెట్లపై కన్నేసి ఈసారి తాము సైతం పోటీలో ఉంటామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది.    

దివాకర్ రావు వ్యవహార శైలితో విసిగిపోయి..

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు వ్యవహార శైలిపై విసిగిపోయిన పలువురు నాయకులు ఈ ఎన్నికల్లో ఆయనను దెబ్బకొట్టేందుకు పథకాలు రచిస్తున్నారు. దివాకర్ రావుకు వ్యతిరేకంగా లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బియ్యాల తిరుపతి అసమ్మతివాదులను కూడగడుతున్నారు. ఫిలిం డెవలప్​మెంట్​కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూస్కూరు రామ్మోహన్ రావుకు ఆయన మద్దతిస్తున్నారు. హాజీపూర్  జడ్పీటీసీ శిల్ప భర్త పూస్కూరు శ్రీనివాసరావు సైతం రామ్మోహన్ రావును బలపరుస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేశ్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మాజీ మావోయిస్టు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దొమ్మటి అర్జున్  బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు..

బాల్క సుమన్​కు చెక్ పెట్టేందుకు..

బాల్క సుమన్ ఒంటెత్తు పోకడలను జీర్ణించుకోలేని పలువురు లీడర్లు ఈసారి ఆయనకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. తమను అన్నివిధాలా అణగదొక్కారనే ఆగ్రహం సుమన్​వర్గంలోని చాలా మంది లీడర్లలో కనిపిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో సుమన్ కు సెకండ్​క్యాడర్​లీడర్ల మధ్య గ్యాప్ పెరిగింది. గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో కొందరిపై వివక్ష చూపించడం వంటి కారణాలు చాలామందిలో అసంతృప్తి నెలకొంది. కోటపల్లి మండలంలో సిట్టింగ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సుమారు 20 మంది నివురు కప్పిన నిప్పులాగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితో పాటు చెన్నూర్​కు చెందిన పలువురు కీలక నేతలు, కౌన్సిలర్లు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు సుమన్ వ్యవహార శైలిపైన తీవ్ర అసంతృప్తితో ఇతర పార్టీల్లోకి వెళ్లాలనే ఆలోచనలు ఉన్నారు. రాజిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు పార్టీ మారాలనే యోచనలో  సీక్రెట్ గా సమావేశాలు జరిపినట్లు సమాచారం. జైపూర్​ఎంపీపీ చెరుకు దీపికారెడ్డి తండ్రి చెరుకు సరోత్తంరెడ్డితో పాటు ఆయన మద్దతుదారులైన ఎంపీటీసీలు, సర్పంచులు, ఓ జడ్పీటీసీ సుమన్​పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.

చిన్నయ్యను ఓడగొడతామని బహిరంగ ప్రకటనలు

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై నియోజకవర్గంలోని పలువురు నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆయన ప్రతి మండలంలో ఒకరిద్దరి మాత్రమే అక్కున చేర్చుకొని అన్ని వ్యవహారాలు వారితోనే నడిపిస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నెపల్లి ఎంపీపీ మాధవరపు సృజన భర్త నర్సింగరావుతో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు పక్కచూపులు చూస్తున్నారు. వేమనపల్లి జడ్పీటీసీ భర్త రుద్రభట్ల సంతోష్​ కుమార్ వర్గానికి సైతం చిన్నయ్యతో పొసగడం లేదు. బెల్లంపల్లి, కాసిసేట, తాండూర్, నెన్నెల మండలాలకు చెందిన మరికొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈసారి చిన్నయ్యకు టికెట్ ​రావద్దని బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ టికెట్​ఇచ్చినా ఆయనను ఓడగొడుతామని బహిరంగంగానే చెప్తున్నారు. 

ఖానాపూర్​లో..

ఖానాపూర్​నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జన్నారం మండలంలో ఎమ్మెల్యే రేఖానాయక్​వ్యవహరిస్తున్న తీరు నచ్చక చాలామంది లీడర్లు ఆమెకు దూరమవుతున్నారు. ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్​ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేఖానాయక్​ ఓ కాంట్రాక్టర్​ను చేరదీసి ప్రజాప్రతినిధులమైన తమను రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ ​ప్రకారం ఫ్లెక్సీల్లో కిందిస్థాయి లీడర్ల ఫొటోలను కూడా పెట్టడం లేదంటే వారి మధ్య ఎంత గ్యాప్​ పెరిగిందో తెలుస్తోంది. వీరిద్దరు ఎమ్మెల్యేపై నేరుగా విమర్శలు చేయనప్పటికీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

సెకండ్ క్యాడర్​ లీడర్లూ ప్రధానమే..

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకు ఆ నియోజకవర్గంలోని సెకండ్ క్యాడర్ లీడర్ల మద్దతు తప్పనిసరి. జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులతో పాటు ఆ స్థాయి నాయకులు ఓటర్లను ప్రభావితం చేస్తారు. చాలా మంది మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేకంగా గ్రూపులను తయారు చేసుకుని రాజకీయాలు నడిపిస్తున్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందుబాటులో ఉండి పరిష్కరించేది వారే. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైనా ప్రజలు లోకల్ లీడర్ల మాటను కాదనలేని పరిస్థితి. దీంతో అసమ్మతి నాయకులు తమను ఎక్కడ ముంచుతారోనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అందుకు తగినట్లే కొందరు లీడర్లు తమకు జరిగిన అన్యాయం, అవమానాలను తల్చుకుంటూ దానికి బదులు తీర్చుకుంటామని చెప్తుండటం గమనార్హం. తమ మద్దతు లేకుండా ఎట్ల గెలుస్తరో చూస్తామని శపథాలు చేస్తున్నారంటే ఎమ్మెల్యేలపై అసంతృప్తి, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.