తగ్గుతున్న కేసుల గ్రోత్‌ రేట్‌

తగ్గుతున్న కేసుల గ్రోత్‌ రేట్‌
  • 22 % నుంచి 8% తగ్గుదల
  • లాక్‌డౌన్‌ విధించడమే కారణం

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ విధించడంతో మన దేశంలోని కేసుల గ్రోత్‌రేట్‌ తగ్గుముఖం పట్టిందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ ప్రకటించిన రోజున కేసుల సంఖ్య 500 ఉండగా.. ఇప్పుడు దాని సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ కేసుల గ్రోత్‌ రేట్‌ మాత్రం తగ్గిపోయింది. మార్చి 24న గ్రోత్‌ రేట్‌ 21.6 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 8.1 శాతానికి వచ్చింది. లాక్‌డౌన్‌ లేకుండా ఉండి ఉంటే.. ఆ గ్రోత్‌ రేట్‌ పెరిగేదని, ఇప్పటికి కేసుల సంఖ్య 2లక్షలు దాటేదని సర్వేల ద్వారా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ విధించిన ఐదో వారంలో మూడు రోజుల నుంచి 8.1 గ్రోత్‌ రేట్‌ ఉందని, వైరస్‌ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దేశాల గ్రోత్‌ రేట్‌ కంటే ఇది ఎక్కువగానే ఉంది. జర్మనీలో గ్రోత్‌ రేట్‌ 2 శాతం ఉండగా.. అమెరికాలో 4.8గా ఉంది. ప్రస్తుతం ఉన్న గ్రోత్‌ రేట్‌ కొనసాగితే ఈ నెలాఖరుకు మన దేశంలో 40వేలు కరోనా పాజిటివ్‌ కేసులు ఉంటాయని, మరో 15 రోజులు కొనసాగితే 70వేలకు చేరుకునే అవకాశం ఉంది. మే చివరి వరకు కొనసాగితే 2.5లక్షలు కేసులు వస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు వృద్ధి రేటును తగ్గించగలిగాయి. కేరళలో గ్రోత్‌రేట్‌1.8% పడిపోయింది. అంటే జర్మనీ కంటే తక్కువ. రానున్న రోజుల్లోగ్రోత్‌ రేట్‌ ఇంకా తగ్గిపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు.