
- బేస్‍మెంట్ వరకు కట్టుకున్నాక ఆగిన పనులు
- మొదటి విడత రూ.లక్ష కోసం ఎదురుచూపులు
- ఎన్నికలు, సర్వర్ సమస్య అంటూ ప్రాసెస్ ఆపిన అధికారులు
- కిరాయి ఇండ్లల్లో ఉంటూ తిప్పలు పడుతున్న లబ్ధిదారులు
- ఓట్ల కోసం హడావుడి చేశారని ఫైర్
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో గృహలక్ష్మి పథకంలో ఇండ్లు దక్కించుకున్న లక్షలాది మంది లబ్ధిదారులు అరిగోస పడుతున్నారు. లీడర్లు చెప్పారని గ్రామాల్లోని ఇండ్లు కూలగొట్టుకుని కొత్త ఇండ్లకు ముగ్గు పోసుకున్నారు. ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఎంపీటీసీలతో కొబ్బరి కాయలు కొట్టించారు. గృహలక్ష్మి పథకం గైడ్లైన్స్ప్రకారం సొంత స్థలంలో బేస్మెంట్వరకు ఇల్లు నిర్మించుకుంటే మొదటి విడత రూ.లక్ష ఆర్థిక సాయం వస్తుందని ఎమ్మెల్యేలు, సర్పంచులు ఆశ చూపారు. దీంతో లీడర్లు చెప్పినట్లే బేస్‍మెంట్ వరకు కట్టుకుని రూ. లక్ష కోసం ఎదురుచూస్తున్నారు.
తీరాచూస్తే అధికారులు కోడ్ వచ్చిందని...సర్వర్ సమస్య ఉందని చెప్తూ తప్పించుకుంటున్నారు. దీంతో గతంలో ఉన్న ఇండ్లను కూల్చుకున్నోళ్లంతా ఏం చేసేదని బాధపడుతున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే గృహలక్ష్మి పథకం ప్రకటించడంతో మొదటి విడత డబ్బులు ఇవ్వడానికి అడ్డంకులు ఏమీ ఉండవని, కావాలనే కోడ్ పేరు చెప్పి తప్పించుకుంటున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
మొదటి విడతలో 4 లక్షల ఇండ్లు ఇస్తమని ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్‍రూం ఇండ్లు కట్టించడంలో ఫెయిలయ్యింది. ఇది ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించే అంశం కావడంతో దీన్నుంచి బయటపడడానికి సర్కారు గృహలక్ష్మి స్కీం తీసుకువచ్చింది. నియోజకవర్గాల్లో ఇల్లు లేని నిరుపేదలకు సొంత జాగా ఉంటే అందులో ఇండ్లు కట్టుకోవచ్చని, దీనికి రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించింది.
మొదటి విడతలో నియోజకవర్గానికి సుమారు 3 వేల ఇండ్ల చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 4 లక్షల ఇండ్ల నిర్మాణాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. గైడ్‍లైన్స్ కూడా విడుదల చేసింది. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 పర్సంటేజీ రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు తెలిపింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పథకం అమలు చేస్తామని చెప్పింది.
3 రోజుల్లో 17 లక్షల అప్లికేషన్లు
గృహలక్ష్మి కోసం అప్లై చేసుకోడానికి సర్కార్ కేవలం 3 రోజుల సమయమే ఇచ్చింది. తెల్ల రేషన్‌కార్డు ఉండడంతో పాటు ఇంకా కొన్ని కండీషన్లు పెట్టింది. ఒక్కో మహిళా లబ్ధిదారుకు రూ.లక్ష చొప్పున మూడు విడతల్లో ఇస్తామని ప్రకటించింది. ఉన్నది మూడు రోజులే అయినా దాదాపు 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి.
రాష్ట్రంలోని దాదాపు 600 మండలాల నుంచి సగటున 2 వేల దరఖాస్తుల చొప్పున 12 లక్షలు రాగా.. మున్సిపాలిటీ, సిటీల నుంచి మరో 5 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో యావరేజీగా13 వేల అప్లికేషన్లు వచ్చాయి. ప్రభుత్వం మాత్రం నియోజకవర్గంలో 3 వేల మందికి మాత్రమే పథకం వర్తింపజేస్తామని చెప్పింది.
ఊరురా..ఓట్ల రాజకీయం
రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని కలెక్టర్లతో పారదర్శకంగా అమలు చేయిస్తామని ప్రకటించినా.. ఇది కూడా మిగతా పథకాల్లాగే ఎమ్మెల్యేల చేతుల్లోకే వెళ్లింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ రానుందనే సంకేతంతో ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు అలర్టయ్యారు.
గ్రామ స్థాయిని బట్టి ఒక్కో గ్రామానికి 15 నుంచి 30 ఇండ్లు మంజూరవగా..ఎన్నికల షెడ్యూల్ రావడానికి వారం, పది రోజుల ముందు ఊరూరా తిరుగుతూ గృహలక్ష్మి అర్హుల జాబితాను రెడీ చేసి శాంక్షన్‍కు సంబంధించి ప్రొసిడింగ్ కాపీలు అందజేశారు. అర్హులతో పాటు లిస్టులో పేర్లు లేని మరో 20 నుంచి 30 మంది ఇండ్ల ముందు అడ్వాన్సుగా ముగ్గుపోసి హంగామా చేశారు.
సొంతిండ్లు కూల్చుకుని.. కిరాయి ఇండ్లలోకి
గృహలక్ష్మి గైడ్‍లైన్స్ ప్రకారం బెడ్‌లెవెల్ పనులయ్యాక వివరాలను ఆన్‍లైన్‍లో నమోదు చేయాలి. సంబంధిత ఏఈ ఫీల్డ్ విజిట్ చేసి ఇంటి వివరాలను జీపీఎస్ చేయాలి. ఎలక్షన్ షెడ్యూల్ వస్తే అధికారులు ఆ పనుల్లో బిజీగా మారి ప్రాసెస్ చేయలేరనే విషయం తెలిసినా జనాలతో ఆగమాగంగా ఇండ్లను కూలగొట్టించారు. అప్పో సప్పో చేసి పనులు త్వరగా చేసుకుంటే మొదటి దఫా బిల్లులు ఇస్తామని ఆశ పెట్టారు.
ఇప్పుడు మాత్రం చేతులెత్తేశారు. అధికారులను అడిగితే కోడ్ ఉందని చెప్తున్నారని, మరికొందరు సర్వర్ సమస్య అని చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో కొత్త ఇండ్లు వస్తాయని పాత ఇండ్లు కూల్చుకుని రూ.3 నుంచి 5 వేలు పెట్టి కిరాయి ఇండ్లల్లో ఉండాల్సి వస్తోందంటున్నారు. అప్పులు చేసి పిల్లర్ల వరకు కట్టుకున్నామని, ఇప్పుడు ఏం చేసేదని తలలు పట్టుకున్నారు.
కిరాయి ఇంట్లో ఉంటున్నం..
నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఓ కొడుకు. మా ఆయన చనిపోయిండు. మా ఇల్లు దెబ్బతినడంతో గృహలక్ష్మి ఇంటికి అప్లికేషన్పెట్టుకున్న. ఇప్పుడున్న ఇంటి స్థలంలో త్వరగా బెడ్డు, పిల్లర్ల వరకు పనులు చేసుకుంటే మొదటి విడత రూ.లక్ష వస్తాయని చెప్పడంతో కూలగొట్టించిన. సర్పంచ్, ఎంపీటీసీ ముగ్గు పోసిన్రు. తీరాచూస్తే.. డబ్బులు ఇస్తలేరు. అడిగితే కోడ్ అని చెప్తున్నరు. ఊళ్లనే రూ.3 వేలు పెట్టి చిన్న ఇంట్లో కిరాయికి ఉంటున్నం.
– గోనె యాదలక్ష్మి, పర్వతగిరి, వరంగల్
సర్వర్ సమస్య, కోడ్ అంటున్నరు
‘గృహలక్ష్మి’ కింద ఇల్లు శాంక్షన్ చేశారు. ప్రొసీడింగ్ కాపీ కూడా ఇచ్చారు. సొంత డబ్బులతో త్వరగా బేస్‍మెంట్ పూర్తి చేసుకుంటే ఫస్ట్ రూ.లక్ష ఇస్తామని చెప్పారు. అప్పు చేసి సిమెంట్, ఇసుక, సలాకా తీసుకొచ్చి పని చేయించిన. మేస్త్రీలు, కూలీలు డబ్బులడుగుతున్నారు. అధికారులు సర్వర్ సమస్య ఉందని ఇప్పుడేం చేయలేమని అంటున్నరు. కొత్త గవర్నమెంట్ వచ్చాక ఎట్లా చెప్తే అట్లా అంటున్నరు.
– ముత్యాల శివకుమార్, నల్లబెల్లి మండలం, నర్సంపేట