జీఎస్‌‌ వరదాచారి తెలుగు పాత్రికేయ వనంలో ఓ తులసి చెట్టు

గోవర్దన సుందర(జీఎస్‌‌) వరదాచారి తెలుగు పాత్రికేయ వనంలో ఓ తులసి చెట్టు. జీవితమంతా విలువలకు కట్టుబడ్డ నిలువెత్తు విగ్రహం. నిరాడంబర జీవనం, వాస్తవిక పాత్రికేయం చిరునామాగా సాగిన ఆయన ఒక ప్రశాంత జ్ఞాన వరద. వర్కింగ్‌‌ జర్నలిస్టుగానే కాకుండా జర్నలిజం బోధకుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన ఆయన సమకాలీన(తన కాలికులు, తర్వాతి తరం) జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. వయసు శరీరానికే తప్ప మనసుకో, ఆలోచనకో, భావజాలానికో కాదని, తనకు తాను ఉదాహరణగా చూపుతూ నిరూపించిన ధీశాలి. డెబ్బై, ఎనభయ్యో పడిలో కూడా ఆర్టీసీ బస్సుల్లో తిరిగిన శరీర పటిష్టత! నిజామాబాద్‌‌ జిల్లా ఆర్మూర్‌‌లో జన్మించి, 90 ఏళ్ల నిండు జీవితం గడిపి, పలు విషయాల్లో తెలుగు జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిపోయారు. ఆయనకు జర్నలిజం పట్ల మక్కువ చాలా చిన్నతనంలోనే ఏర్పడింది. విద్యార్థిగా ఉన్నప్పుడే ట్యూషన్లు చెప్పి, వచ్చే చిన్న మొత్తాలతో ఓ పత్రిక నడపడం ఆయన అభిరుచికి, ఉత్సుకతకి మచ్చుతునక. 

నేటి జర్నలిస్టులకు ఆదర్శం
నేటి తరం జర్నలిస్టులు, ఆ మాటకు వస్తే ఏ వృత్తిలోని వారైనా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన రెండు ఉత్తమోత్తమ లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఆధునిక సాంకేతికతను అత్యంత వేగంగా, ఒడుపుగా నేర్చుకొని ఆచరణలో పెట్టడం. రెండు, ఏదైనా వాస్తవిక దృష్టికోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం పీజీ డిప్లొమా పుచ్చుకొని హిందూ పత్రికలో ఇంటర్న్‌‌షిప్‌‌ చేస్తూ, అక్కడే ఉద్యోగావకాశం లభించినా, తెలుగుపై మక్కువతో ‘ఆంధ్రజనత’లో చేరి జర్నలిజం వృత్తిని ప్రారంభించారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ తదితర ప్రధాన స్రవంతి పత్రికల్లో పనిచేశారు. సినిమా రిపోర్టింగ్‌‌ను కొత్త పుంతలు తొక్కించడమే కాకుండా బిజినెస్‌‌, స్పోర్ట్స్‌‌, సైన్స్‌‌ వంటి ప్రత్యేక విభాగాల ఉనికిని బలోపేతం చేసిన ప్రయోగశీలి వరదాచారి. భాషపై ఎంతటి అనురక్తి, అభినివేషం అంటే... కొత్త పదాలు, పదబంధాల సృష్టి కూడా చేసేవారు. ఒకరోజున, ‘సర్‌‌ ‘రిలవెన్స్‌‌’ అనే ఆంగ్ల పదానికి మనవాళ్లు ‘ప్రాసంగికత’ అని వాడుతున్నారు, ‘ఇర్రిలవెంట్‌‌’ అసంబద్ధం అయినపుడు, రిలవెన్స్‌‌ ని ‘సంబద్దత’ అని నేను వాడాను, ఎలా ఉంది?’’ అంటే, ‘శెహబాష్‌‌’ అంటూ అభినందించి, ‘నీకూ వీరతాడు వేయాల్సిందే’ అని ఆశీర్వదించిన చమత్కారి. ఆరు దశాబ్దాల కింద జర్నలిస్టు యూనియన్లలో క్రియాశీలకంగా ఉండటమే కాకుండా వర్కింగ్‌‌ జర్నలిస్టు యూనియన్‌‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇప్పుడు బషీర్‌‌బాగ్‌‌లో జర్నలిస్టు సంఘం భవనంగా, ప్రెస్‌‌క్లబ్‌‌గా వినియోగంలో ఉన్న దేశోద్దారక భవన నిర్మాణానికి విరాళాలు సేకరించిన కృషిలో ఆయన పాత్ర ఉంది. 

బోధకుడిగా..
తెలుగు విశ్వవిద్యాలయం తొలి జర్నలిజం విభాగాధిపతిగా పనిచేస్తూ, పాఠం చెప్పడానికి వచ్చే ముందు, ఆ రోజు వివిధ దినపత్రికల్లోని తప్పొప్పులు, విశేషాంశాలు ఓ కాగితంపై రాసుకొని వచ్చి, విద్యార్థులకు వివరించే అసలు సిసలు గురువాయన. ‘ఆంధ్రభూమి లో ‘దిద్దుబాటు’ అని ఓ కాలమ్‌‌ నడుపుతూ జర్నలిజంలో, ముఖ్యంగా భాషా ప్రయోగంలో తప్పొప్పుల్ని ఎత్తి చూపేవారు. జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరంగా ఉండిన ఆ వ్యాస సంపుటి, తర్వాత పుస్తక రూపంలోనూ వచ్చింది. ‘ఇలాగేనా రాయడం’ ‘ఎలా రాయడం’ ‘మనపాత్రికేయ వెలుగులు’ ‘వరద స్వరాక్షరి’ ‘జ్ఞాపకాల వరద’(బయోగ్రఫీ) వంటి పలు పుస్తకాలను వెలువరించారు. వయోధిక జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా పలు పుస్తకాల ప్రచురణలో, ఇతర వ్యవహారాల్లో ఆయన ఎంతో కృషి చేశారు. తెలుగునాట ఉన్న జర్నలిస్టులందరి ఫొటో, సంక్షిప్త సమాచారంతో ఆయన నేతృత్వంలో సదరు సంఘం తెచ్చిన ‘డైరెక్టరీ’  ఓ గొప్ప యజ్ఞ సమాన కృషి. నోటీసులు, సోదాలంటూ సీబీఐ ఓ పత్రికపై జరిపిన దాడులను వ్యతిరేకిస్తూ, మీడియా గవర్నర్‌‌కు సమర్పించిన వినతిపత్రంపై సంతకం కావాలని కోరగానే వెంటనే స్పందించిన వృత్తి నిబద్ధుడు ఆయన. 80లోనూ లెదర్‌‌ బ్యాగ్‌‌ ఒకటి పట్టుకొని ప్రెస్‌‌ క్లబ్‌‌ వద్దో, మరో చోటో ముఖ్యమైన గ్యాదరింగ్స్‌‌ లో దర్శనమిచ్చే వారు. నిగర్వి, నిండైన, నిఖార్సైన మనిషి. జర్నలిస్టులకు తను చెప్పే పాఠాల్లో తరచూ ప్రస్తావించి, వివరించే పద బంధాలు ‘సత్యనిష్ట’కు ప్రతిబింబం, ‘న్యూస్‌‌ నోస్‌‌’కు ఉదాహరణ.. మన వరదాచారి. బుధవారం ఆయన నేలకొరగడంతో తెలుగు జర్నలిస్టు సమాజానికి ఓ దృశ్యం గోచరమైంది, అది.. ‘కలం వాల్చిన విలువల చెట్టు’ ఆ మహా మనిషికి ఇదే అక్షర నివాళి!.
- సవ్యసాచి