ఢిల్లీ : పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి జనవరి 1నుంచి ఆర్థికభారం మరింత పెరగనుంది. వచ్చే నెల నుంచి దుస్తులు, పాదరక్షలు మరింత ప్రియం కానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ వీటిపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.. జీఎస్టీని 5శాతం నుంచి 12 శాతానికి పెంచడమే ఇందుకు కారణం. మరోవైపు కేంద్రం సింథటిక్ ఫైబర్, నూలుపై జీఎస్టీని 18 నుంచి 12శాతానికి తగ్గించింది. సెప్టెంబర్ లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో టెక్స్ టైల్, ఫుట్ వేర్ పై విధించే వస్తు సేవల పన్నును సవరించారు. ఫలితంగా కాటన్ మినహా రెడీమేడ్ దుస్తులతో పాటు అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులపై 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ కామర్స్ సంస్థలు అందించే సేవలపై కూడా జనవరి 1 నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. క్యాబ్, ఆటో, బైక్ ల ద్వారా ఆన్ లైన్ లో ప్రయాణికులకు సేవలందించే ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు 5శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆఫ్ లైన్ లో క్యాబ్ లు బుక్ చేసుకునే వారికి మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం అయిన స్విగ్గీ, జొమాటోలు జనవరి 1 నుంచి కస్టమర్ నుంచి నేరుగా జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయనున్నాయి. గతంలో రెస్టారెంట్లు జీఎస్టీని వసూలు చేసేవి. దీంతో పాటు బిల్లులు సైతం జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రెస్టారెంట్లు ఈ బాధ్యతను నిర్వహించనుండగా.. ఇకపై ఫుడ్ డెలివరీ యాప్ లు చేయాల్సి ఉంటుంది.