- 10 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రభుత్వం కిందటి నెలలో జీఎస్‌టీ కింద రూ. 1.75 లక్షల కోట్లు సేకరించింది. కిందటేడాది ఆగస్టులో వచ్చిన రూ.1.59 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం గ్రోత్‌కు సమానం. ఈ ఏడాది జులైలో రూ.1.82 లక్షల కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తం రూ.9.13 లక్షల కోట్ల జీఎస్‌టీ రెవెన్యూ వచ్చింది. కిందటేడాది ఇదే టైమ్‌లో వచ్చిన రూ.8.29 లక్షల కోట్లతో పోలిస్తే 10.1 శాతం వృద్ధి చెందింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్ లెవెల్లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లయ్యింది. రానున్న పండుగ నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్ట్రీ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది ఆగస్టులో దేశీయంగా సుమారు రూ.1.25 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లవ్వగా, ఇది 9.2 శాతం గ్రోత్ (ఏడాది ప్రాతిపదికన) కు సమానం. దిగుమతులపై వేసిన జీఎస్‌టీ ద్వారా రూ.49,976 కోట్లు వసూళ్లయ్యాయి. ఇది 12.1 శాతం పెరుగుదలకు సమానం. ప్రభుత్వం రూ.24,460 కోట్లను రిఫండ్ చేసింది.
రిఫండ్స్ కూడా కిందటేడాది ఆగస్టుతో పోలిస్తే 38 శాతం పెరిగాయి. గ్రాస్ జీఎస్‌టీ వసూళ్ల నుంచి రిఫండ్స్ తీసేయగా మిగిలిన నెట్ జీఎస్‌టీ వసూళ్లు ఆగస్టు నెలకు గాను రూ.1.5 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన 6.5 శాతం పెరిగాయి. ‘ఫెస్టివల్ సీజన్ మొదలుకాకముందే జీఎస్‌టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరగడం చూస్తుంటే వినియోగం స్ట్రాంగ్‌గా ఉందనే విషయం అర్థమవుతోంది’ అని డెలాయిట్ పార్టనర్ ఎంఎస్ మణి అన్నారు.