న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ఈ ఏడాది నవంబర్‌లో రూ.1.82 లక్షల కోట్ల జీఎస్‌టీ ఆదాయం వచ్చింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్లు పెరగడంతో జీఎస్‌టీ వసూళ్లు కిందటేడాది నవంబర్‌తో పోలిస్తే 8.3 శాతం పెరిగాయి. సెంట్రల్ జీఎస్‌టీ కింద రూ.34,141 కోట్లు వసూలు కాగా, స్టేట్ జీఎస్‌టీ కింద రూ.43,047 కోట్లు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ కింద రూ.91,828 కోట్లు వసూళ్లయ్యాయి.
సెస్ రూపంలో ప్రభుత్వానికి మరో రూ.13,253 కోట్ల రెవెన్యూ వచ్చింది. గ్రాస్ జీఎస్‌టీ రెవెన్యూ కిందటేడాది నవంబర్‌లో రూ.1.68 లక్షల కోట్లు ఉంటే, ఈ ఏడాది నవంబర్‌లో 8.5 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లకు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 1.87 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లయ్యింది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్ లెవెల్లో జీఎస్‌టీ వసూళ్లయ్యింది. ప్రభుత్వానికి రూ.2.10 లక్షల కోట్ల రెవెన్యూ వచ్చింది. కిందటి నెలలో డొమెస్టిక్ ట్రాన్సాక్షన్లు 9.4 శాతం పెరగడంతో రూ.1.40 లక్షల కోట్ల జీఎస్‌టీ, ఇంపోర్ట్స్ నుంచి రూ.42,591 కోట్ల జీఎస్‌టీ వసూళ్లయ్యింది. ప్రభుత్వం రూ.19,259 కోట్ల రిఫండ్స్ జరిపింది. నెట్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లుగా ఉన్నాయి.