
- 9.1 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి కిందటి నెలలో రూ.1.84 లక్షల కోట్ల జీఎస్‌టీ ఆదాయం వచ్చింది. కిందటేడాది ఫిబ్రవరిలో వచ్చిన రూ.1.68 లక్షల కోట్లతో పోలిస్తే 9.1 శాతం గ్రోత్ నమోదయ్యింది. కానీ, ఈ ఏడాది జనవరిలో వచ్చిన రూ.1.96 లక్షల కోట్లతో పోలిస్తే తగ్గింది. దేశీయంగా వినియోగం ఊపందుకోవడంతో జీఎస్‌టీ రెవెన్యూ పెరిగింది.
ప్రభుత్వ డేటా ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంట్రల్ జీఎస్‌టీ కింద రూ.35,204 కోట్లు వసూలు కాగా, స్టేట్ జీఎస్‌టీ కింద రూ.43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ కింద రూ.90,870 కోట్లు, కాంపెన్సేషన్ సెస్ కింద రూ.13,868 కోట్లు వసూళ్లయ్యాయి. దేశీయంగా జరిగిన ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.1.42 లక్షల కోట్లు వచ్చాయి. ఏడాది లెక్కన 10.2 శాతం వృద్ధి నమోదైంది.
దిగుమతులపై వేసిన జీఎస్‌టీ ద్వారా రూ.41,702 కోట్లు వచ్చాయి. ప్రభుత్వం ఫిబ్రవరిలో రూ.20,889 కోట్ల విలువైన రిఫండ్స్ ఇచ్చింది. దీంతో నెట్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.63 లక్షల కోట్లుగా ఉన్నాయి.
2024 ఫిబ్రవరిలో వచ్చిన నెట్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1.50 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. హర్యానా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్నాటకలలో జీఎస్‌టీ వసూళ్లు 10–20 శాతం మేర పెరిగాయి. తెలంగాణ, గుజరాత్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సాల్లో 1–4 శాతం మేర పెరిగాయి.