బీమాపై జీఎస్టీ  ఈసారీ తగ్గించలే

బీమాపై జీఎస్టీ  ఈసారీ తగ్గించలే
  • ఈవీలపై ఐదు శాతం జీఎస్టీ
  • పోషకాల బియ్యంపై ఐదు శాతం 
  • ఫుడ్ ​డెలివరీ ట్యాక్స్​పై నిర్ణయం వాయిదా

జైసల్మేర్​ : ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియాలపై జీఎస్టీ తగ్గించాలన్న ప్రతిపాదనపై జైసల్మేర్​లో శనివారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక 148 వస్తువులపై జీఎస్టీని మార్చాలన్న మంత్రుల బృందం (జీఓఎం) తన సిఫార్సులను కౌన్సిల్​ ముందుకు తీసుకురాలేదు. బీమాపై జీఎస్టీ తగ్గింపు విషయమై మరింత చర్చ జరిగిన తరువాత, తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ​నాయకత్వంలోని మండలి అభిప్రాయపడింది.

గ్రూపు, ఇండివిడ్యువల్​, సీనియర్ ​సిటిజన్ల పాలసీలపై రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవడానికి మరోసారి సమావేశం కావాల్సిన అవసరం ఉందని మంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్న బిహార్​ డిప్యూటీ సీఎం సామ్రాట్​ చౌదరి అన్నారు. సభ్యుల రిక్వెస్ట్​ మేరకు ఈ విషయమై వచ్చే నెల మరోసారి భేటీ అవుతామని ప్రకటించారు. విమానాల ఇంధనం ఏటీఎఫ్​ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే విషయంపైనా నిర్ణయం వాయిదా పడింది.  ఈ ప్రపోజల్​ను రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని మంత్రి నిర్మల వివరించారు. 

ఇవీ మార్పులు

పోషకాలు కలిపిన బియ్యంపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు. ఎలక్ట్రిక్​ వెహికల్స్​పై ఐదు శాతం జీఎస్టీ వేస్తారు. వ్యక్తులు పాత ఈవీలను అమ్మితే జీఎస్టీ ఉండదు. కంపెనీలు అమ్మితే మాత్రం 18 శాతం జీఎస్టీ ఉంటుంది. స్విగ్గీ వంటి ఫుడ్​ డెలివరీ ప్లాట్​ఫారాలపై జీఎస్టీని 18 నుంచి ఐదు శాతానికి తగ్గించాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోలేదు. భూఉపరితలం  నుంచి ఆకాశంలోకి పంపించే మిసైల్స్​పై,  బ్యాంకులు కస్టమర్లపై విధించే పీనల్​ చార్జీలపై, జీన్ ​థెరపీపై జీఎస్టీ ఉండదు.  

రెడీ టూ ఈట్​ పాప్​కార్న్​పై 12 శాతం, కారమలైజ్డ్​ పాప్​కార్న్​పై 18 శాతం జీఎస్టీ ఉంటుందని జీఓఎం వివరణ ఇచ్చింది.  ఆటోక్లేవ్డ్​ ఎరేటెడ్ ​కాంక్రీట్​బ్లాక్స్​పై జీఎస్టీ  18 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. పేమెంట్​ అగ్రిగేటర్లు రూ.2000 వరకు చేసే చెల్లింపులపై జీఎస్టీ ఉండదు.  ప్రకృతీ విపత్తుకు నిధులు సేకరించడానికి , లగ్జరీ వస్తువులపై ఒకశాతం సెస్​ విధించాలన్న ఆంధ్రప్రదేశ్​ ప్రతిపాదనపై స్టడీ చేయడానికి జీఎస్టీ మండలి మినిస్టర్స్​ గ్రూపును ఏర్పాటు చేసింది.