న్యూఢిల్లీ: జీఎస్టీ మోసాలను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో రూ.10 వేల కోట్లకుపైగా జీఎస్టీ ఎగవేతలను గుర్తించారు. దాదాపు 10,700 నకిలీ రిజిస్ట్రేషన్లను పన్ను అధికారులు కనిపెట్టారు. ఖజానాను మోసం చేసేందుకు నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీఐసీ) సభ్యుడు శశాంక్ ప్రియ మాట్లాడుతూ జీఎస్టీ రిజిస్ట్రేషన్, ఆధార్ అథెంటికేషన్ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో అమలులో ఉందని, అక్టోబర్ 4 నాటికి మరో నాలుగు రాష్ట్రాలు చేరుతాయని చెప్పారు.
ఈ ఏడాది చివరికి నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా సహా 20 రాష్ట్రాలు ఆధార్ అథెంటికేషన్‌ను ప్రారంభిస్తాయన్నారు. ఇక నుంచి పన్ను అధికారులు రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా కొత్త పన్ను చెల్లింపుదారులపై కొన్ని పరిమితులు విధించవచ్చని చెప్పారు. ఒక నెలలో జారీ చేసే ఇన్వాయిస్ల సంఖ్యపై పరిమితులు విధిస్తామని చెప్పారు. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను తనిఖీ చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఫిజికల్ వెరిఫికేషన్లను పెంచుతున్నామని శశాంక్ తెలిపారు.
ఆగస్టు నుంచి మొదలైన తనిఖీలు
నకిలీ రిజిస్ట్రేషన్‌కు వ్యతిరేకంగా రెండో ఆల్ ఇండియా డ్రైవ్ ఆగస్టు 16న ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. పన్ను అధికారులు 67,970 జీఎస్టీఐఎన్లను గుర్తించగా, వీటిలో 59 శాతం జీఎస్టీఐన్లను సెప్టెంబర్ 22 నాటికి వెరిఫై చేశారు. వీటిలో 27 శాతం కంపెనీలు ఉనికిలో లేవని తేలింది. గత డ్రైవ్‌తో పోలిస్తే ఈసారి కూడా మోసాలు సమానంగా ఉన్నాయి. ఈసారి రూ. 10,179 కోట్ల ఎగవేతను గుర్తించారు. రూ. 2,994 కోట్ల అక్రమ ఐటీసీని నిరోధించారు. అలాగే రూ. 28 కోట్ల రికవరీ కోటి పూర్తయింది.
మే 16, 2023 – జూలై 15, 2023 మధ్య తనిఖీ చేసి 21,791 ఎంటిటీలు ఉనికిలోనే లేవని కనిపెట్టారు. గతేడాది మొదటి స్పెషల్ డ్రైవ్‌లో రూ. 24,010 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అనుమానిస్తున్నారు. అక్రమాలకు పాల్పడారనే అనుమానంతో గత ఆర్థిక సంవత్సరంలో పన్ను అధికారులు లక్షకు పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2023–-24లో 1,12,852 షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.