- బీమా ప్రీమియంలపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం వాయిదా
- కారు సీట్లపై 28 శాతానికి పెంపు
న్యూఢిల్లీ: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి తగ్గించడంపై జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం కుదిరిందని, తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్రం తెలిపింది. దీనిపై చర్చించడానికి ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించినట్టు ప్రకటించింది. నవంబరులో మరోసారి జీఎస్టీ మండలి భేటీ అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం ఢిల్లీలో సోమవారం జరిగింది. నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నందున చాలా రాష్ట్రాలు ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించడానికి ఒప్పుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
జీఎస్టీ రేట్లు తగ్గిస్తే ప్రీమియం తగ్గడం వల్ల కోట్లాది మంది పాలసీదారులకు మేలు జరుగుతుంది. జులై 1, 2017న ప్రవేశపెట్టిన వస్తువుల సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మొదటి సంవత్సరంలో రూ.90 వేల కోట్లతో పోలిస్తే ఇప్పుడు నెలవారీగా దాదాపు రూ.1.75 లక్షల కోట్ల వరకు ఉంటున్నాయి. 2023–-24లో, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ ద్వారా కేంద్రం రాష్ట్రాలు రూ. 8,262.94 కోట్లు వసూలు చేయగా, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్‌టీ ద్వారా రూ.1,484.36 కోట్లు వసూలు చేశారు. ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలను జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రతిపక్ష సభ్యులు పార్లమెంటులో డిమాండ్ చేశారు.
Also Read :- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌కు మరో 10 శాతం వాటా
కొన్నింటిపై తగ్గింపు, కొన్నింటిపై పెంపు
మతపరమైన ప్రయాణాల కోసం హెలికాప్టర్ సేవలపై పన్నును 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ తెలిపారు. డెబిట్ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2,000 వరకు జరిగే చిన్న డిజిటల్ లావాదేవీలపై అగ్రిగేటర్‌లకు జీఎస్టీ విధించడంపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టం ప్రకారం ఏర్పాటైన వర్సిటీలకు అందజేసే పరిశోధన నిధులకు ఐటీ ఉండబోదని, వీటికి జీఎస్టీని కూడా రద్దు చేశామని నిర్మల తెలిపారు.
క్యాన్సర్ డ్రగ్స్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి ఐదుశాతానికి, కొన్ని రకాల చిరుతిండ్లపై పన్నును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించామని చెప్పారు. కార్సీట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచామన్నారు. ఆన్లైన్గేమింగ్, క్యాసినోలపై రిపోర్టు జీఎస్టీ కౌన్సిల్‌కు అందిందని వివరించారు. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎంట్రీ లెవెల్బెట్స్పై 28 శాతం జీఎస్టీ చెల్లించాలని అన్నారు. ఈ నిర్ణయం 2023 అక్టోబరు నుంచి వర్తిస్తుందని నిర్మల చెప్పారు. 2026 మార్చి తరువాత పరిహార సెస్ కొనసాగించాలా.. వద్దా ? అనే విషయమై తేల్చడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు.