
- కిందటేడాది మే నెలతో పోలిస్తే 10 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలలో రూ.1.73 లక్షల కోట్ల జీఎస్‌టీ రెవెన్యూ (గ్రాస్) వచ్చింది. కిందటేడాది మే నెలతో పోలిస్తే 10 శాతం పెరిగింది. రిఫండ్స్ చెల్లించాక మిగిలిన నెట్ జీఎస్‌టీ రెవెన్యూ రూ.1.44 లక్షల కోట్లుగా ఉంది. 6.9 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఈ ఏడాది మే నెలలో సెంట్రల్ జీఎస్‌టీ (సీజీఎస్‌టీ) కింద రూ.32,409 కోట్లు, స్టేట్ జీఎస్‌టీ కింద రూ.40,265 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ (ఐజీఎస్‌టీ) కింద రూ.87,781 కోట్లు వచ్చాయి.
ఐజీఎస్‌టీ వసూళ్లలో గూడ్స్ దిగుమతులపై సేకరించిన రూ.39,879 కోట్ల జీఎస్‌టీ కలిసి ఉంది. ప్రభుత్వానికి సెస్ కింద రూ.12,284 కోట్లు (గూడ్స్ దిగుమతులపై సేకరించిన సెస్ రూ.1,076 కోట్లు కలిసి ఉంది) వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే వరకు రూ. 3.83 లక్షల కోట్ల గ్రాస్ జీఎస్‌టీ రెవెన్యూని ప్రభుత్వం సాధించింది. రిఫండ్స్ తీసేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్–మేలో రూ.3.36 లక్షల నికర జీఎస్‌టీ వచ్చింది. ఇది 11.6 శాతం గ్రోత్‌కు సమానం. తెలంగాణ రాష్ట్రంలో కిందటి నెలలో రూ.4,986 కోట్ల జీఎస్‌టీ వసూళ్లయ్యింది. కిందటేడాది మేలో వచ్చిన రూ.4,507 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,890 కోట్లు వసూళ్లయ్యాయి.