- వినర్డ్ ఆటో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ
- రీ ఫండ్‌కు హెల్ప్ చేసిన ఐదుగురు జీఎస్టీ అధికారులు
- ఉన్నతాధికారుల ఫిర్యాదుతో అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీలో రూ.45.81 కోట్ల గోల్‌మాల్‌కు పాల్పడిన ఐదుగురు అధికారులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఫేక్, ఫోర్జరీ డాక్యుమెంట్లతో జీఎస్టీ రీ ఫండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సీసీఎస్ డీసీపీ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నలగండ్లకు చెందిన వేమిరెడ్డి రాజా రమేశ్ రెడ్డి వినర్డ్ ఆటో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. ఎలక్ట్రిక్ బైక్స్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు. ఆటో మొబైల్‌కు సంబంధించిన స్పేర్ పార్ట్స్‌ను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. వీటికి సంబంధించి 2022, ఏప్రిల్ నుంచి 2023, ఆగస్టు దాకా 5 శాతం జీఎస్టీ చెల్లిస్తే.. 18 శాతం జీఎస్టీ పే చేశానంటూ నకిలీ బిల్లులు తయారు చేశాడు. ఇందుకు గాను 13 శాతం జీఎస్టీ రీ ఫండ్ చేయాలంటూ మాదాపూర్ జీఎస్టీ కార్యాలయంలో బిల్స్ ఫైల్ చేశాడు.
జీఎస్టీ అధికారుల చేతివాటం
ఏడు బోగస్ కంపెనీల పేరుతో రూ.45.81 కోట్లకు చెందిన బిల్స్‌ను రాజా రమేశ్ రెడ్డి రీ ఫండ్ చేసుకున్నాడు. ఇందుకుగాను నల్లగొండ డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ పీటల స్వర్ణ కుమార్, అబిడ్స్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ కెలం వేణుగోపాల్, మాధాపూర్ సర్కిల్ – 1, 2, 3 అసిస్టెంట్ కమిషనర్లు పొదిలి విశ్వకిరణ్, వేమవరపు వెంకటరమణ, మర్రి మహిత అక్రమాలకు పాల్పడ్డారు. నకిలీ బిల్స్, ఫోర్జరీ డాక్యుమెంట్లతో జీఎస్టీ రీ ఫండ్ చేశారు. ఎలక్ట్రిక్ బైక్స్‌ను మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేయనప్పటికీ వాటికి సంబంధించిన బిల్స్‌ను రీ ఫండ్ చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. జీఎస్టీ ఆడిట్ రిపోర్ట్‌తో ఇదంతా గుట్టురట్టైంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అవినీతికి పాల్పడిన స్వర్ణ కుమార్, వేణుగోపాల్, విశ్వకిరణ్, వేమవరపు వెంకటరమణ, మర్రి మహితను అరెస్ట్ చేశారు.