- ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇచ్చిన సీసీఎస్ పోలీసులు
- నేడు కేసు రిజిస్టర్ చేసే అవకాశం
- సీఐడీ చీఫ్ శిఖా గోయల్ నేతృత్వంలో స్పెషల్ టీమ్స్
హైదరాబాద్, వెలుగు: జీఎస్‌టీ స్కామ్ కేసు సీఐడీకి చేరింది. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ సహా జీఎస్టీ అధికారులు సేకరించిన డాక్యుమెంట్లను మంగళవారం సీఐడీకి అప్పగించారు. 35 రకాల డాక్యుమెంట్లతో పాటు ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్స్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ గ్రూప్ చాటింగ్ రికార్డులను సీల్డ్ కవర్‌లో ఇచ్చేశారు. కేసు రికార్డులు అందిన వెంటనే సీఐడీ పోలీసులు మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
రూ.1,400 కోట్లకు పైగా అవినీతి జరగడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో 75 కంపెనీలు ఈ స్కామ్ ముడిపడి ఉన్నందున డీజీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా సీఐడీ చీఫ్ శిఖా గోయల్ కేసు రికార్డులను పరిశీలించనున్నారు. మరికొన్ని సెక్షన్లను చేరుస్తూ బుధవారం సీఐడీ అధికారులు కేసు రిజిస్టర్ చేసే అవకాశాలున్నాయి. స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయనున్నారు.