ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వనపర్తి : దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండో అతిపెద్దదైన చేనేత రంగంపై కేంద్రం జీఎస్టీ  విధించటం బాధాకరమని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌లో ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారితో కలిసి  భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులపై  కేంద్రం జీఎస్టీ  వేయడంతో కోట్ల మంది కార్మికులతో పాటు  వస్ర్తాలు కొనే వారిపై కూడా  ప్రభావం పడుతుందని వాపోయారు.   వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలని, లేదంటే  రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.  చేనేత కార్మికులకు  మద్దతుగా  ప్రధాని నరేంద్రమోడీకి పోస్ట్ కార్డులు పంపించి నిరసన తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్  పాల్గొన్నారు.

బిజినేపల్లి ఎస్సైని సస్పెండ్ చేయాలి

నాగర్ కర్నూల్ టౌన్ :  జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి కొడుకు గణేశ్‌‌పై  చేయి చేసుకున్న బిజినేపల్లి ఎస్సై కృష్ణ ఓబుల్‌‌రెడ్డిని సస్పెండ్ చేయాలని  ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ ఉదయ్ కుమార్‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజినేపల్లి ఎస్సై ఉద్దేశపూర్వకంగా కులం పేరుతో దూషిస్తూ, పోలీస్ స్టేషన్‌‌లో  నిర్బంధించి దాడి చేయడం దారుణమన్నారు. రక్షణగా ఉండాల్సిన పోలీసులే వివక్ష చూపడం బాధాకరమన్నారు.  అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసు నమోదు చేసి.. విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌‌ జిల్లా అధ్యక్షుడు కాశన్న, బహుజన ముక్తి పార్టీ పార్లమెంట్ ఇన్‌‌చార్జి గడ్డం విజయ్, దండోరా పార్లమెంట్ ఇన్‌‌చార్జి మంతటి గోపి, ఎల్ హెచ్‌‌పీఎస్ జిల్లా కార్యదర్శి రాత్లవత్ హుస్సేన్ నాయక్, వెంకటయ్య, కుర్మయ్య  పాల్గొన్నారు.  

దాసుది ప్రమాదం కాదు హత్యే

లింగాల :  ఈనెల 23న పెద్దకొత్తపల్లి మండలం దేదినేనిపల్లి శివారులో రోటవేటర్‌‌‌‌లో పడి మృతి చెందిన లింగాల మండలం అంబటిపల్లికి చెందిన పడిగె దాసుది హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆదివారం జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం  అనంతరం శవాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఆందోళనకు దిగారు.   ట్రాక్టర్‌‌‌‌ ఓనర్‌‌‌‌తో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకునే వరకు అంత్యక్రియలు జరపమని తేల్చి చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్శింహ్మ,  తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నల్గొండ శ్రీనివాసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు కోళ్ల శివ మంగళవారం అంబటిపల్లికి వచ్చి కుటుంబసభ్యులకు మద్దతు తెలిపారు.  మృతదేహాన్ని ట్రాక్టర్ ఓనర్ ఊశన్న ఇంటిముందు ఉంచి దాసు మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని  డిమాండ్‌‌  చేశారు.  కాగా,  పోలీసులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  సర్పంచ్, సింగిల్ విండో చైర్మెన్, వైస్ ఎంపీపీ మృతుడి కుటుంబ సభ్యులు, కులసంఘాల నాయకులతో చర్చించి అంత్యక్రియలకు ఒప్పించారు.  ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు.  

స్టూడెంట్స్​ హాజరు శాతాన్ని పెంచాలి

మక్తల్: స్టూడెంట్స్ ​హాజరు శాతం పెంచకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ​శ్రీహర్ష హెచ్చరించారు. మంగళవారం ఊట్కూర్​ మండల పరిధిలోని పలు స్కూళ్లను పరిశీలించారు. తిప్రాస్‌‌ పల్లి ప్రైమరీ స్కూల్‌‌లో చాలామంది స్టూడెంట్స్​ గైర్హాజరు కావడంపై హెచ్​ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే 3, 4, 5 క్లాసుల స్టూడెంట్లకు అంకూర్ సంస్థ నిర్వహిస్తున్న ఇంగ్లిష్ క్లాస్‌‌లను పర్యవేక్షించారు.   అలాగే ఊట్కూర్ అప్పర్​ ప్రైమరీ స్కూల్​ అవరణలో ఉన్న  అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు.  పిల్లలు బరువు, ఎత్తుపై ఆరా తీశారు. చిన్నారులు, బాలింతలకు  బాలామృతం, కోడి గుడ్లను ప్రతి రోజూ  ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం బిజ్వార్ హైస్కూల్​ టెన్త్‌‌ స్టూడెంట్లకు వారానికోసారి టెస్టులు పెడుతున్నారా..?  ప్రతిరోజూ స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారా..?  అని అడిగి తెలుసుకున్నారు.   జిల్లా సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, డీఈ రాము, ఏఈ రఫీ, ఎంపీడీవో కాలప్ప, సర్పంచ్ ప్రకాశ్ రెడ్డి, జడ్పీటీసీ అశోక్, ఎంపీపీ లక్ష్మి పాల్గొన్నారు.

అర్ధరాత్రి యాక్సిడెంట్.. యువకుడి మృతి
గద్వాల, వెలుగు:  బైక్‌‌ అదుపు తప్పి కంప చెట్లలోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మరొకరు కోమాలోకి వెళ్లారు.  గద్వాల రూరల్ ఎస్సై ఆనంద్ వివరాల ప్రకారం... గద్వాల టౌన్ అంబేద్కర్ నగర్ కు చెందిన జాన్సన్ జూరాల డ్యాం దగ్గర మిషన్ భగీరథలో పనిచేస్తున్నాడు. ఈయన మిత్రుడు సుజిత్‌‌ (24) సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లాడు.   రాత్రి 11 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా వస్తున్నామని చెప్పారు.  అర్ధరాత్రి సమయంలో బైక్‌‌పై ఇంటికి బయల్దేరారు. మదనపల్లి స్టేజీ దగ్గర బైక్‌‌ కంపచెట్లలోకి దూసుకెళ్లింది ఎవరూ  గుర్తించకపోవడంతో అందులోనే ఉండిపోయారు. మంగళవారం ఉదయం గమనించిన రైతులు దగ్గరి వెళ్లి చూడగా.. సుజిత్ అప్పటికే మృతి చెందాడు. జాన్సన్ కోమాలోకి వెళ్లిపోయాడు. సమాచారం అదుకున్న పోలీసులు మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.  సుజిత్ శవానికి పోస్టుమార్టం చేసి పేరెంట్స్ కి అప్పజెప్పారు.  బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 

నేటి నుంచి కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

మహబూబ్​నగర్​ : మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట (సీసీకుంట) మండలం అమ్మాపూర్ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నారు. ఈ మేరకు అధికారులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక ఇతర రాష్ట్రాల  భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు  ఏర్పాట్లు చేశారు.  ఇప్పటికే తలనీలాల మండపం,  40 మరుగుదొడ్లతో పాటు మొబైల్ మరుగుదొడ్లు సిద్ధం చేశారు.  దాసంగాలు పెట్టేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు.  250 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. 300 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామని, 120 సీసీ కెమెరాలతో నిఘా పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు.   30 న స్వామివారి అలంకరణ ఉత్సవం,  31న  ఉద్దాల మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు చెప్పారు. 

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

అమ్రాబాద్: తాగునీటి కోసం అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామానికి చెందిన మహిళలు రోడ్డెక్కారు.   గ్రామంలో కొన్నిరోజులుగా భగీరథ నీళ్లు రాకపోవడంతో పాటు బోరు మోటార్లు కూడా కాలిపోవడంతో మంగళవారం ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. అంతకుముందు గ్రామ సర్పంచ్‌‌‌‌ ఇంటి ముందు నిరసన తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని,  బిందెకు రూ.10  చెల్లించి ఫిల్టర్ వాటర్ కొనాల్సి వస్తోందని వాపోయారు.  వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేదని, దీంతో రాత్రి సమయాల్లో బయటికి వెళ్లాలంటే భయం వేస్తోందన్నారు.  ట్రాన్స్‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌ కాలిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనపై గ్రామ సర్పంచ్,  కార్యదర్శిని వివరణ కోరగా  రెండు నెలలుగా ఫండ్స్‌‌‌‌ రావడం లేదని,  ఉన్న ఫండ్స్‌‌‌‌ ట్రాక్టర్ నిర్వహణ, కరెంట్ బిల్లులు,  సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయన్నారు.   ట్రాన్స్‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌ కోసం డీడీ తీసినా పట్టించుకోవడం లేదని,  అప్పుచేసి రెండు మోటార్లు తెచ్చామని బిగించి నీళ్లు సరఫరా చేస్తామని చెప్పారు.  

బుద్దారం భూకబ్జాపై హెచ్‌‌ఆర్సీలో  ఫిర్యాదు
వనపర్తి :  వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారంలో ఆలయ నిర్మాణం పేరుతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని  బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు  గ్రామస్తులతో కలిసి మంగళవారం హైదబాద్‌‌లోని హెచ్‌‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునగాల కృష్ణారావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి  గుడి నిర్మాణం పేరిట 10:32 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి  అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. మూడేళ్ల కింద అప్పటి కలెక్టర్  శ్వేతా మహంతికి దృష్టికి తేగాఅప్పటి  తహసీల్దార్ నరేందర్‌‌‌‌తో సర్వే నెంబర్ 237 లో సర్వే చేయించారని గుర్తుచేశారు.  ఉరగట్టు 16.32 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా..  1.10 ఎకరాలు అసైన్డ్ భూమి ,  2 ఎకరాల్లో శ్మశాన వాటిక, 10 గుంటల్లో చెట్లు, 2.30 ఎకరాల ఓపెన్ ల్యాండ్,  మిగిలిన 10.22 ఎకరాల్లో గుట్ట విస్తీర్ణం, బాట స్థలం ఉన్నట్లు  14/02/2020న  రిపోర్టు ఇచ్చారని వివరించారు.  గ్రామ పంచాయతీ తీర్మానం, కలెక్టర్ ఆదేశాలు  ధిక్కరించి మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. కృష్ణారావుతో పాటు అతనికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఆయన వెంట బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు అంజన్న యాదవ్, శేఖర్ గౌడ్, బుద్ధారం గ్రామస్తులు రాజు,  చంద్రయ్య, శ్రవణ్ కుమార్, మైబూసు, రాపోతుల లచ్చగౌడ్, శ్రీకాంత్ గౌడ్, వీరపాగ రాములు, చాకలి నాగరాజు, చిరంజీవి, ఎరుకలి యాదయ్య, షౌకుల తిరుపతి, ఉప్పరి రాజు,ఉప్పరి మన్నెం, మంగలి సహదేవుడు, ఎరుకలి అచ్చుతయ్య  తదిరులు పాల్గొన్నారు.

పెంచిన హమాలీ రేట్లను అమలు చేయాలి
నాగర్ కర్నూల్ టౌన్ : పెంచిన హమాలీ రేట్లను అమలు చేయాలని తెలంగాణ సివిల్ సప్లై వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బాలయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ సివిల్ సప్లై డీఎం  బాలరాజుకు వినతిపత్రం అందించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త రేట్లు ఆగస్టు నుంచి అమలు చేయాల్సి ఉన్నా.. నేటికీ  పట్టించుకోకపోవడం సరికాదన్నారు.    హమాలీలకు హెల్త్ ఇన్సూరెన్స్,  గిరిజన కార్పొరేషన్ గోదాంలో పనిచేస్తున్న హమాలీలకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.  సమస్యలు పరిష్కరించకుంటే  నవంబర్ 1  నుంచి  సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు  అశోక్, హుస్సేన్ సాయిలు, శంకరయ్య, వెంకటయ్య, జగన్నాథం, బొక్కలయ్య, రాములు పాల్గొన్నారు. 

పటాకులు పేలిస్తే పత్తి కాలిపోయింది
కల్వకుర్తి : పటాకుల నిప్పు రవ్వలు పడి పత్తి కాలిపోయింది.  గ్రామస్తుల వివరాల ప్రకారం  కల్వకుర్తి మండలం ఎల్లికట్ట చెందిన నక్క పోతు దేవరాజు తన ఇంట్లో పత్తిని నిల్వ చేశాడు. దీపావళి సందర్భంగా ఇంటి పక్కన పిల్లలు పటాకులు పేల్చడంతో వాటి మెరుపులు  పత్తిపై పడడంతో నిప్పంటుకుంది. రూ. 35 వేల  పత్తి కాలపోయిందని బాధిత రైతు వాపోయాడు. 

మహిళ మిస్సింగ్‌‌ ఘటనలో గుంపు మేస్ర్తీల  నిర్భంధం
నవాబుపేట :  వలస వెళ్లిన మహిళ గ్రామానికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు గుంపుమేస్త్రీలను  నిర్భంధించి  పోలీసులకు అప్పజెప్పారు.  వివరాల్లోకి వెళ్తే..  నవాబుపేట మండలం యన్మన్​గండ్లకు చెందిన కొందరు కూలీలను నిరుడు దేవరకద్ర మండలం పేరూరుకు చెందిన గుంపు మేస్త్రీ శ్రీనివాస్‌‌  మహారాష్ట్రకు తీసుకెళ్లారు.  ఇందులో అందరూ తిరిగి వచ్చినా చెన్నమ్మ (28) మాత్రం రాలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఇదివరకు పోలీస్​స్టేషన్‌‌లో  ఫిర్యాదు చేశారు.  కాగా, ఆమెను తీసుకెళ్లిన గుంపుమేస్త్రీతో పాటు మరొకరు మంగళవారం మహిళల దగ్గర బాకీ వసూళ్ల కోసం  యన్మన్​గండ్ల గ్రామానికి  వచ్చారు.  విషయం తెలుసుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు చెన్నమ్మ అడ్రస్‌‌ ఏమైందని ప్రశ్నించారు. వాళ్లు తమకు తెలిదని చెప్పడంతో  పోలీసులకు అప్పజెప్పారు.  కేసు నమోదు చేశామని,  దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై పురుషోత్తం తెలిపారు.

మేలో మహిళ మిస్సింగ్.. సంపులో డెడ్ బాడీ!

గద్వాల :  మే నెలలో అదృశ్యమైన మహిళ డెడ్ బాడీ( అస్తిపంజరం, చీర) ఐదు నెలల తర్వాత సోమవారం సంపులో దొరికింది.   వివరాల్లోకి వెళ్తే.. గద్వాల మండలం గుంటి పల్లెకు చెందిన కురువ బొజ్జన్న, కురువ గోవిందమ్మ(42) భార్యాభర్తలు. కొన్నేళ్ల కింద బతుకు తెరువు కోసం గద్వాల టౌన్ పిల్లిగుండ్ల కాలనీకి వచ్చి ఉంటున్నారు.   మే నెలలో తన భార్య మిస్సింగ్ అయ్యిందని భర్త టౌన్ పోలీస్ స్టేషన్ లో  కంప్లైంట్ చేశాడు. కొద్దిరోజులకే  పిల్లిగుంట్ల కాలనీలో నివాసం ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఇటీవల ఆ ఇంటిని ఓనర్‌‌‌‌ పట్టణానికి చెందిన కృష్ణయ్య గౌడ్‌‌కు అమ్మాడు. ఆయన వచ్చి సోమవారం ఇంటిని క్లీన్ చేస్తుండగా సంపు దగ్గర దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి పరిశీలించగా మహిళకు సంబంధించి పుర్రె, ఎముకలు చీర, జాకెట్ లభించాయి.  దర్యాప్తు చేస్తున్నామని తర్వలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

28న జాబ్ మేళా

మహబూబ్ నగర్ కలెక్టరేట్ : ఈ నెల 28న జిల్లా ఎంప్లాయ్‌‌మెంట్‌‌ ఆఫీసు ఆవరణలో ఉద్యోగ  మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లామెంట్ జిల్లా ఆఫీసర్ మహమ్మద్ జాని పాష తెలిపారు.  జడ్చర్ల, మహబూబ్ నగర్, హైదరాబాద్‌‌లోకి పలు కంపెనీల్లో పని చేసేందుకు  టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివి 18 నుండి 30 ఏళ్లలోపు నిరుద్యోగులు అర్హులన్నారు.  ఈ మేరకు  సర్టిఫికేట్స్, బయోడేటాతో ఉద్యోగ మేళాకు హాజరు కావాలని కోరారు. జాబ్ కు ఎంపికైన అభ్యర్థులకు వివిధ పోస్టుల వారీగా నెలకు రూ. 9వేల నుంచి రూ. 28 వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. వివరాలకు 9550205227,9948568830 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.       

బాల పురస్కార్  కోసం అప్లై చేసుకోండి

నాగర్ కర్నూల్ టౌన్ :   ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు కోసం అర్హులైన  విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో గోవిందరాజులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.   కొత్త ఆవిష్కరణలతో పాటు  స్పోర్ట్స్‌‌,  సామాజిక సేవ, కల్చరల్ యాక్టివిటీస్‌‌లో రాణిస్తున్న విద్యార్థులు  అర్హులని చెప్పారు.   ఆన్ లైన్‌‌లో ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని, జిల్లాలోని అన్ని స్కూళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 
......................................................................