అహ్మదాబాద్ : ప్లే ఆఫ్స్ రేస్‌లో ముందుకెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ నిరాశపరిస్తే.. గుజరాత్ టైటాన్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శుభ్‌మన్ గిల్ (55 బాల్స్‌లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104), సాయి సుదర్శన్ (51 బాల్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 103) సెంచరీలతో హోరెత్తించడంతో జీటీ 35 రన్స్ తేడాతో సీఎస్కేపై నెగ్గింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 231/3 స్కోరు చేసింది. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసి ఓడింది. డారిల్ మిచెల్ (34 బాల్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 63), మొయిన్ అలీ (36 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 56) మాత్రమే ఆడారు. గిల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
ఓపెనర్ల విధ్వంసం..
ప్లే ఆఫ్స్ రేస్‌లో కీలక మ్యాచ్ కావడంతో గుజరాత్ ఓపెనర్లు గిల్, సుదర్శన్ ఒకర్నిమించి ఒకరు విధ్వంసం సృష్టించారు. 18 ఓవర్ల పాటు పవర్ హిట్టింగ్‌తో సీఎస్కే బౌలింగ్‌ను ఉతికి పారేశారు. ఫస్ట్ ఓవర్‌లో గిల్ 4, 6తో ఖాతా ఓపెన్ చేయగా, సాయి రెండు సిక్స్‌లతో టచ్‌లోకి వచ్చాడు. ఓవర్‌కు పదికి పైగా రన్స్ రావడంతో పవర్‌ప్లేలో జీటీ 58/0 స్కోరుతో నిలిచింది. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా గిల్, సుదర్శన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తర్వాతి 9 ఓవర్లు పవర్‌ప్లేను మించి ఆడారు. సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా సిక్స్‌లు బాదారు. 9వ ఓవర్‌లో సాయి 4, 6, ఆ వెంటనే గిల్ రెండు ఫోర్లతో 107/0తో ఫస్ట్ టెన్‌ను ముగించారు. 11వ ఓవర్‌లో గిల్ 6, 4 కొడితే, సాయి వరుస విరామాల్లో మూడు సిక్స్‌లు, రెండు ఫోర్లతో రెచ్చిపోయాడు. 14వ ఓవర్‌లో గిల్ హ్యాట్రిక్ సిక్స్‌లతో 15 ఓవర్లలో స్కోరు190/0కు పెరిగింది. 17వ ఓవర్‌లో సిమ్రన్‌జిత్ బాల్‌ను బౌండ్రీగా మలిచిన గిల్, ఆ వెంటనే సాయి సిక్స్‌తో చెరో 50 బాల్స్‌లో సెంచరీలు పూర్తి చేశారు. అయితే 18వ ఓవర్‌లో నాలుగు బాల్స్ తేడాలో తుషార్ (2/33) ఈ ఇద్దర్ని ఔట్ చేసి తొలి వికెట్‌కు 210 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. చివర్లో మిల్లర్ (16 నాటౌట్) కూడా వేగంగానే ఆడటంతో జీటీ భారీ స్కోరు చేసింది.
మిచెల్, అలీ మినహా..
ఛేజింగ్‌లో చెన్నై టాపార్డర్ తేలిపోయింది. మూడు ఓవర్లలోనే రహానె (1), రచిన్ రవీంద్ర (1), రుతురాజ్ (0) పెవిలియన్‌కు వచ్చారు. 10/3తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను మిచెల్, మొయిన్ అలీ ఆదుకున్నారు. పవర్‌ప్లేలో 43/3 స్కోరుతో బ్యాటింగ్ సాగించిన ఈ ఇద్దరు క్రమంగా బ్యాట్లు ఝుళిపించారు. ఏడో ఓవర్‌లో చెరో సిక్స్, తర్వాతి ఓవర్‌లో మిచెల్ మూడు ఫోర్లతో 27 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఫస్ట్ టెన్‌లో సీఎస్కే 86/3 స్కోరు చేసింది. 11వ ఓవర్‌లో అలీ హ్యాట్రిక్ సిక్స్‌లతో 20 రన్స్ దంచాడు. కానీ ఈ టైమ్‌లో మోహిత్ (3/31) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో మిచెల్, అలీని ఔట్ చేశాడు. నాలుగో వికెట్‌కు 109 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. శివమ్ దూబె (21), జడేజా (18) వేగంగా ఆడి ఆశలు రేకెత్తించారు. కానీ 17వ ఓవర్‌లో దూబె ఔట్‌కావడంతో ఆరో వికెట్‌కు 30 రన్స్ వచ్చాయి. 18వ ఓవర్‌లో రషీద్ (2/) దెబ్బకు జడేజా, శాంట్నర్ (0) పెవిలియన్‌కు చేరారు. లాస్ట్ ఓవర్‌లో ధోనీ (26 నాటౌట్) 6, 6, 4తో ఫ్యాన్స్‌ను మురిపించినా టీమ్‌ను గెలిపించలేకపోయాడు.
100 గిల్ కొట్టిన సెంచరీతో ఐపీఎల్‌లో మొత్తం సెంచరీల సంఖ్య వంద కు చేరింది.
210 గతంలో డికాక్, రాహుల్ తొలి వికెట్‌కు నెలకొల్పిన 210 రన్స్ రికార్డు భాగస్వామ్యాన్ని గిల్, సాయి సమం చేశారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 231/3 (గిల్ 104, సుదర్శన్ 103, తుషార్ 2/33).
చెన్నై: 20 ఓవర్లలో 196/8 (మిచెల్ 63, అలీ 56, మోహిత్ 3/31).