PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్‌పై పంజాబ్ ఘనవిజయం

PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్‌పై పంజాబ్ ఘనవిజయం

గువాహటి వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌ 144 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని పంజాబ్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంజాబ్ ను.. సామ్ కరన్ (63*; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) గట్టెక్కించాడు. ఈ ఓటమితో అగ్రపీఠం చేజిక్కించుకోవాలనుకున్న రాజస్థాన్ కలలు ఆవిరయ్యాయి. వారికిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.

స్వల్ప లక్ష్య చేధనలో పంజాబ్‌ కింగ్స్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(6) వెనుదిరిగాడు. అనంతరం రిలీ రోసో(22), జానీ బెయిర్‌స్టో (14) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ జోడి మంచి దూకుడు మీద ఉండగా.. అవేష్ ఖాన్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో రోసో, శశాంక్ సింగ్‌(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో పంజాబ్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

ఆ సమయంలో సామ్ కరన్ (63*; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) నిలకడగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి జితేశ్‌ శర్మ(22), అశుతోష్‌ శర్మ (17 నాటౌట్) మంచి సహకారం అందించారు.

పరాగ్ ఒంటిరి పోరాటం

అంతకుముందు పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో రాజస్థాన్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(34 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అతని తరువాత అంతో ఇంతో రాణించిన బ్యాటరంటే.. రవిచంద్రన్ అశ్విన్(19 బంతుల్లో 28; 3 ఫోర్లు, ఒక సిక్స్). కింగ్స్ బౌలర్లందరూ చాలా ప్లాన్‌గా బంతులేశారు. వికెట్ల వేటలో పైచేయి సాధించకపోయినా.. పరుగులు రాకూండా కట్టడి చేశారు. సామ్ కర్రన్, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ త్రయం రెండేసి వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

 టేబుల్ టాపర్ కోల్‌కతా

ఈ ఓటమితో రాజస్థాన్ అగ్రపీఠం కలలు కల్లలయ్యాయి. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట విజయం సాధించిన శాంసన్ సైన్యం 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. లీగ్ దశలో వీరికి ఇంకో మ్యాచ్ ఉన్నప్పటికీ.. అందులో విజయం సాధించిన 18 పాయింట్లు మాత్రమే ఖాతాలో చేరతాయి. మరోవైపు, కోల్‌కతా ఖాతాలో ఇప్పటికే 19 పాయింట్లు ఉన్నాయి. దీంతో ప్రస్తుత సీజన్‌లో వారే టేబుల్ టాపర్‌గా నిలవనున్నారు.