నాణానికి బొమ్మ, బొరుసు వలే ఆటలో గెలుపోటములు సహజం. ఒకరి ఓడితేనే మరొకరు గెలుస్తారు. ఇది అందరకి తెలిసిన విషయమే. మరి, గెలిచే జట్టు ఓడితే.. అనూహ్యంగా ఓటమిపాలైతే. అదే అభిమానుల్లో కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. హోరీహోరీగా సాగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లపై అభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ ప్రోగ్రామ్ వలే ఐపీఎల్ టోర్నీ ఒక స్క్రిప్ట్.. మ్యాచ్‌లన్నీ ఫిక్సింగ్.. అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వివాదం ఒక్క మ్యాచ్‌తో తెరపైకి వచ్చింది.
ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం(ఏప్రిల్ 8) గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 196 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో గుజరాత్ ఆఖరి బంతికి గెలుపొందింది. విజయానికి చివరి 12 బంతుల్లో 35 పరుగులు అవసరం కాగా, శుభ్‌మన్ గిల్ సేన దాన్ని చేధించింది. ఆఖరిలో రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22), రషీద్ ఖాన్(11 బంతుల్లో 24) జోడి నిలకడగా ఆడుతూ లక్ష్యాన్ని చేధించారు. ఇదే అభిమానుల్లో కొత్త అనుమానాలకు కారణం.
Also Read :వీడియో: కళ్లు దొబ్బాయా..! అంపైర్‌పైకి దూసుకెళ్లిన గిల్
గాయం లేదు..
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయిన ట్రెంట్ బౌల్ట్ ఈ మ్యాచ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇదే అర్థం కానీ ప్రశ్న. తొలి రెండు ఓవర్లలో ఎనిమిది పరుగులిచ్చిన కివీస్ పేసర్‌కు శాంసన్.. ఆఖరి ఓవర్లలో ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదనేది అంతుచిక్కడం లేదు. రాజస్థాన్ తొలుత ముగ్గురు విదేశీ ప్లేయర్లలతో బరిలోకి దిగింది కనుక ఇంపాక్ట్ ప్లేయర్‌గా కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చాడు. బౌల్ట్ బౌలింగ్ చేయకపోవడానికి ఇది కారణమే కాదు. అలా అని అతను గాయపడింది లేదు. ఆఖరి బంతి వరకూ మైదానంలోనే ఉన్నాడు.
చివరి ఓవర్లలో బౌల్ట్ ధారాళంగా పరుగులిస్తాడు అనుకున్నా.. మిడిల్ ఓవర్లలో ఇవ్వవచ్చు. కానీ శాంసన్ అలా కూడా చేయలేదు. స్పిన్నర్లపై నమ్మకం ఉంచి అతన్ని పక్కన పెట్టాడు. చివరలో అయినా బౌల్ట్ చేతికి బంతి అందించి పరుగులు కట్టడి చేస్తాడు అనుకుంటే.. అదీ లేదు. స్వదేశీ పేసర్లు అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ల చేతుల్లో బాల్ పెట్టి మ్యాచ్ ఓడేలా చేశాడు. ఇదే RR vs GT మ్యాచ్‌పై అభిమానుల్లో కొత్త అనుమానాలు కలిగిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్‌లు స్క్రిప్ట్ అని కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కుల్దీప్, అవేశ్
తొలి మూడు ఓవర్లలో 21 పరుగులిచ్చిన కుల్దీప్ సేన్.. నాలుగో ఓవర్లో ఏకంగా 20 పరుగులిచ్చాడు. యువ బౌలర్ కనుక ఒత్తిడిలోకి జారుకున్నాడు అనుకున్నా.. ఆఖరి ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ 15 పరుగులు డిఫెండ్ చేయకపోవడం కొసమెరుపు. బౌలింగ్ ఆల్‌రౌండరైన రషీద్ ఖాన్‌ను కట్టడి చేయలేకపోయాడు. తొలి మూడు బంతుల్లోనే 10 పరుగులిచ్చాడు. ఇలాంటి బౌలర్‌పై శాంసన్ ఎందుకు నమ్మకం ఉంచారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.