అర్హులకే రైతు భరోసా..అభిప్రాయ సేకరణ తర్వాతే తుది నిర్ణయం : మంత్రి తుమ్మల

  •  అభిప్రాయ సేకరణ తర్వాతే తుది నిర్ణయం 
  • ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని వెల్లడి
  • రైతును రాజును చేస్తాం: పొంగులేటి
  • రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా: జూపల్లి
  • ఉమ్మడి మహబూబ్​నగర్​లో అభిప్రాయ సేకరణ

వనపర్తి, వెలుగు: రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే.. రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అర్హులైన రైతులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని చెప్పారు. క్వింటాలుకు వెయ్యి రూపాయలు నష్టం వచ్చినా.. పప్పు దినుసులతో పాటు అన్ని రకాల పంటలు కొన్నామని అన్నారు. 

అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపరిహారం ఇస్తున్నామని చెప్పారు. రైతు భరోసా అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా రైతులతో వనపర్తి కలెక్టరేట్​లో వర్క్​షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు. 

ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. వ్యవసాయ రంగాన్ని, చిన్న, సన్నకారు రైతులను కాపాడుకుంటున్నదన్నారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నదని తెలిపారు. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి? కౌలు రైతులకు ఏవిధంగా న్యాయం చేయాలి? అనే విషయాలపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. 

ప్రత్యేక కార్యాచరణతో ముందుకు

రైతును రాజును చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నా.. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వివరించారు. నాలుగు గోడల మధ్య కూర్చొని పథకాలను అమలు చేయకుండా.. రైతుల మధ్యకొచ్చి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. 

గతంలో కొండలు, గుట్టలు, వెంచర్లు, ఫామ్ హౌస్​లకు రైతు బంధు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.8లక్షల కోట్ల అప్పు ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు, అన్ని విధాలుగా ఆదుకునేందుకు నిర్ధిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా అమలు చేస్తామన్నారు. 

మహబూబ్​నగర్ జిల్లాలో పది ఎకరాలకంటే తక్కువ ఉన్న రైతులు 90శాతం ఉన్నారని, వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. తనకు 80 ఎకరాలు ఉన్నాయని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 సార్లు రైతు బంధు ఇస్తే.. తాను ఒక్కసారి కూడా తీసుకోలేదని చెప్పారు. తర్వాత రైతుల అభిప్రాయాలను మండలాలు, జిల్లాల వారీగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.