
మెదక్/నర్సాపూర్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేసి కనీసం ఒక్క ఊరిలో కూడా ఇళ్లు ఇవ్వలేదని, పేదలకు గజం జాగా కూడా ఇవ్వలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విమర్శించారు. మెదక్ పట్టణం, నర్సాపూర్ మండలం రుస్తుంపేటలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం క్యాబినెట్లో తీర్మానం చేశామని, కచ్చితంగా అన్నింటినీ దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. ప్రజాపాలనలో ఇండ్లు, ఇండ్ల జాగాలు, పింఛన్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, ఐదేళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు.
గడచిన తొమ్మిదేళ్ల పాలనలో కుంటుపడ్డ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచి మళ్లీ జీవం పోశామన్నారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్లో కలపడం వల్ల జిల్లా ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు, పదవులు శాశ్వతం కాదని, వ్యవస్థ శాశ్వతం అన్నారు. వ్యవస్థను పటిష్ట పరిస్తే సమాజం బాగుపడుతుందని, ఆ దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ర్యక్రమంలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు రోహిత్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు.