సూర్యాపేట, వెలుగు: ‘ప్రతి కులానికీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వమే ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తుంది. జాగా ఇచ్చి నిధులు వారం రోజుల్లో విడుదల చేస్తం. వెంటనే పనులు మొదలు పెడ్తం. ఆరు నెలల్లోనే పూర్తి చేస్తం..’ అని 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లాలోని వివిధ కుల సంఘాలకు హామీలు ఇచ్చారు. కానీ నాలుగేండ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ హామీలు అమలు కాలేదు. పైగా ఇప్పుడు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లోనూ మంత్రి అవే హామీలు మళ్లీ ఇస్తున్నారు. ఈ తీరుపై గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ కుల సంఘాల పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హామీలు... అమలు తీరు..
జిల్లాలో రెడ్డి సంక్షేమ భవనం కోసం రెండెకరాల ప్రభుత్వ భూమి, యాదవ సంఘం కోసం రూ.2కోట్లతో రెండెకరాలలో యాదవ భవనం, గౌడ సంఘ భవనం కోసం రూ.2కోట్లు, రెండెకరాల స్థలం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే పెరక సంఘ భవనం కోసం రూ.60లక్షలు, ప్రభుత్వ స్థలం, మున్నూరు కాపు భవనం కోసం రూ.50లక్షలు, బ్రహ్మణ సంఘ భవనం రూ.1.50కోట్లతో నిర్మిస్తామని 2018లో ఆయన చెప్పారు. వీటిలో గౌడ సంఘ భవన నిర్మాణానికి కొత్త ఎస్పీ ఆఫీస్ సమీపంలో రెండెకరాలు కేటాయించారు. యాదవ సంఘ భవనం, రెడ్డి సంక్షేమ భవనం కోసం కుడకుడ వద్ద స్థలాన్ని పరిశీలించారు. పెరక సంఘ భవనం కోసం కేసారం వద్ద 9 గుంటల స్థలం కేటాయించారు. ఇక మిగతా పనులు, హామీలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారాయి.
ఎన్నికల వేళ.. మళ్లీ తెరపైకి..
అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో మరోసారి అవే హామీలను కొత్తగా ప్రకటించేందుకు చూస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మ గౌరవ భవనాలను కేటాయిస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి మళ్లీ హామీలు ఇస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ కార్యాక్రమంలో యాదవులకు రెండెకరాల స్థలంలో రూ.2కోట్లతో యాదవ భవనం నిర్మిస్తామని పాతహామీనే మళ్లీ కొత్తగా ఇచ్చారు. ఇటీవల ఆత్మీయ సమ్మేళనంలో రెడ్డి సంక్షేమ భవనం విషయమే అదే హామీని రిపిట్ చేశారు. శనివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్థంతి సందర్భంగా వారం రోజుల వ్యవధిలోనే రూ.2 కోట్లతో రెండెకరాల స్థలంలో గౌడ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని మళ్లీ హామీ ఇస్తూ అందుకు ప్రభుత్వ భూమి స్థల సేకరణ చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. ఈ పరిస్థితితో అమలు చేయకుండా హామీలు ఇస్తూపోతే ఎలా అని పలు కుల సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నారు.