
- మక్తల్ సెగ్మెంట్కునీళ్లు ఇవ్వొచ్చనే ఆలోచన
- నియోజకవర్గంపై మంత్రి ఉత్తమ్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: గూడెందొడ్డి రిజర్వాయర్ విస్తరణకు సంబంధించి ల్యాండ్ సర్వే చేయాలని సర్కారు నిర్ణయించింది. 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న గూడెందొడ్డి రిజర్వాయర్ను 15 టీఎంసీల కెపాసిటీకి పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే మక్తల్ నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చేందుకు ఈ రిజర్వాయర్ ఉపయోగపడుతుందని సర్కారు భావిస్తున్నది. జలసౌధలో మక్తల్ నియోజకవర్గంలోని ప్రాజెక్టులు, సాగునీటి సమస్యలపై శుక్రవారం మంత్రి ఉత్తమ్, వాకిటి శ్రీహరి.. అధికారులతో సమావేశం నిర్వహించారు.
మక్తల్ నియోజకవర్గానికి నీళ్లు రాక లక్షలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతున్నదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పక్కపొంటి కృష్ణా నది పారుతున్నా.. జూరాల నుంచి లిఫ్ట్ సిస్టమ్లు, కాల్వలు రెడీగా ఉన్నా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పినట్టు సమాచారం. భూత్పూరు రిజర్వాయర్ ఉన్నా తమకు ప్రయోజనం కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తమ నియోజకవర్గంలో ఓ రిజర్వాయర్ను నిర్మించి కాల్వల ద్వారా నీటిని తరలిస్తే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని ఆయన మంత్రిని విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.
ఎమ్మెల్యే శ్రీహరి ప్రతిపాదనలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కాగా, నియోజకవర్గ పరిధిలో కాల్వల నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులో విపరీతమైన జాప్యం జరుగుతున్నదని, కొన్నేండ్ల నుంచి మొర పెట్టుకుంటున్నా పరిహారం రావడం లేదని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది.