- హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే, ప్రముఖులు
పాల్వంచ, వెలుగు : పట్టణంలోని గుడిపాడు మోక్ష వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ నల్ల సురేశ్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, పెద్దమ్మ తల్లి ఆలయ ఈవో సుదర్శన హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
నిర్వాహకులు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అరేం ప్రశాంత్ ఆధ్వర్యంలో ప్రముఖులను శాలువాలతో సత్కరించారు. రూ.కోటితో నిర్మిస్తున్న ఆలయం త్వరలోనే పూర్తి చేస్తామని నిర్మాణదాత సురేశ్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఏప్రిల్ 4న పట్టణంలోని శ్రీనివాసకాలనీ శ్రీనివాసగిరి వేంకటేశ్వర స్వామి కల్యాణ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే తెల్లం ఆవిష్కరించారు.
కారేపల్లిలో..
కారేపల్లి : మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో లక్ష్మీ పద్మావతి సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజారి ఈశ్వర శాస్త్రి, సాయిశర్మ, వేద పండితుల బృందం కల్యాణాన్ని వైభవంగా జరిపారు. అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కారేపల్లి వీధుల్లో ఊరేగించారు.
గరుడ ప్రసాదం..
అన్నపురెడ్డిపల్లి : మండలంలోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలో భాగంగా ఆదివారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, గరుడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంతానంలేని దంపతులు గరుడ పూజలో పాల్గొన్నారు. అర్చకులు గిరిధరాచార్యులు ప్రత్యేక పూజలు చేసి సంతానం లేని దంపతులకు గరుడ ముద్ద అందజేశారు.