గెస్ట్​ లెక్చరర్ల  గోస పట్టదా?

గెస్ట్‌‌‌‌ లెక్చరర్లను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోంది. వారికి ఎలాంటి ఉద్యోగ భద్రతా లేదు.. పనికి తగ్గ వేతనమూ అందడం లేదు. కరోనా వల్ల గత 16 నెలలుగా జీతాలు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఓర్పుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్​ లెక్చరర్లుగా పని చేస్తున్నారు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో గెస్ట్‌‌‌‌ లెక్చరర్ల వ్యవస్థను ప్రారంభించారు. ఒక్కో పీరియడ్‌‌‌‌కు రూ.150 చొప్పున నెలకు 72 పీరియడ్స్ చెబుతూ రూ.10,800 వేతనంతో గెస్ట్​ లెక్చరర్లు కొనసాగారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో సీఎం కేసీఆర్ పీరియడ్‌‌‌‌కు రూ.300కు పెంచడంతో నెలకు రూ.21,600 వేతనం పెరిగింది. అయితే, ఆ తర్వాత గెస్ట్​ లెక్చరర్లను పట్టించుకున్న నాథుడే లేడు. అదే జీతంతో ఐదేండ్లుగా పనిజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా రావడంతో గెస్ట్​ లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా మారింది. 16 నెలలుగా జీతాలు అందక వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం లేక దొరికిన పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది గెస్ట్​ లెక్చరర్లు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌‌‌‌‌‌‌‌ గా పనిచేస్తున్న గణేశ్​కి జీతం ఇవ్వలేదని, పనిలోకి తీసుకోలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఎంతో మంది ఇప్పటికీ పూటగడవని పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. అలాగే గణేశ్​​కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
                                                                                                                                                                           - రావుల రాజేశం, కరీంనగర్