
హుస్నాబాద్, వెలుగు : ఒక్కగానొక్క తమ్ముడు సైన్యంలో చేరి వీరమరణం పొందాడు.. అతడు లేడు అన్న బాధ నుంచి కొంతైనా ఉపశమనం పొందాలని విగ్రహం తయారుచేయించుకున్నారు. ప్రతీ ఏడాది ఆ విగ్రహానికే రాఖీ కట్టి తమ అనుబంధాన్ని ఆ అక్కాచెళ్లెళ్లు గుర్తుచేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజుతండాకు చెందిన గుగులోత్ లింగయ్య, సత్తవ్వకు ముగ్గురు కూతుళ్లు రాజమ్మ, బూలమ్మ, శ్రీలత , కొడుకు నరసింహ.
సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేసిన నరసింహ 2014లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి వీరమరణం పొందాడు. తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు నరసింహ విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, దానిలోనే ఆయన ప్రతిరూపాన్ని చూసుకుంటున్నారు. గురువారం రాఖీ పండుగ సందర్భంగా నరసింహ అక్కలు రాజమ్మ, బూలమ్మ, చెల్లె శ్రీలత విగ్రహానికి రాఖీ కట్టి అక్కడే వంటలు చేసుకుని నరసింహను
స్మరించుకున్నారు.