రాజకీయ పార్టీలు సహకరించాలి: గుగులోత్​ రవి నాయక్

రాజకీయ పార్టీలు సహకరించాలి: గుగులోత్​ రవి నాయక్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మహబూబ్​నగర్​ కలెక్టర్  గుగులోత్​ రవి నాయక్  కోరారు. మంగళవారం కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌలతులు కల్పించామని తెలిపారు. సమావేశాలు, ర్యాలీల నిర్వహణకు తప్పనిసరిగా పర్మిషన్​ తీసుకోవాలని, ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ సంస్థల్లో  ప్రచారం నిర్వహించవద్దని సూచించారు. 

ఎస్పీ కె నరసింహ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలను చూపించాలన్నారు. ఆర్డీవో అనిల్ కుమార్, అడిషనల్  కలెక్టర్  ఎస్.మోహన్ రావు, స్పెషల్  కలెక్టర్  నటరాజ్, ఏఎస్పీ రాములు, రమణారెడ్డి, డీఆర్వో కేవీవీ రవికుమార్  పాల్గొన్నారు. అనంతరం రిటర్నింగ్, నోడల్, సెక్టోరల్​​ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఎన్నికల విధులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

డ్యూటీలు పక్కాగా చేయాలి

వనపర్తి, వెలుగు: ఎలక్షన్  డ్యూటీ చేస్తే ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పని చేయాలని  వనపర్తి  కలెక్టర్  తేజస్  నందలాల్ పవార్  ఆదేశించారు. కలెక్టరేట్​లో నోడల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్, సర్వే లెన్స్​ టీమ్​లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో అన్ని వైపులా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, డబ్బు, మద్యం అక్రమగా సప్లై కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్  హెచ్చరించారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు.

రూ.లక్ష లావాదేవీల వివరాలు అందించాలి

నాగర్ కర్నూల్ టౌన్: బ్యాంకుల్లో రూ.లక్షకు పైగా లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని కలెక్టర్  పి.ఉదయ్ కుమార్  ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో జిల్లాలోని బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. యూపీఐ లావాదేవీలపై నిఘా ఉంచాలన్నారు. గత నాలుగు నెలల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు జమ చేసిన అకౌంట్​ల వివరాలు సేకరించి, వాటి  లావాదేవీలపై దృష్టి పెట్టాలన్నారు. ఏటీఎం రీఫిలింగ్, బ్యాంకులకు డబ్బు రవాణా చేసే క్రమంలో ప్రైవేటు ఏజెన్సీలు, సిబ్బంది నిబంధనలు పాటించాలని సూచించారు. అడిషనల్  కలెక్టర్  కుమార్  దీపక్, లీడ్  బ్యాంకు  మేనేజర్  కౌశల్ కిశోర్  పాండే, నోడల్  ఆఫీసర్​ శ్రీనివాసు బాబు, తహసీల్దార్  జాకీర్ అలీ పాల్గొన్నారు.