ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టు..ఊరికో వీధి పేరు కాదు గాంధీ. కరెన్సీ నోట్ మీద, నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మకాదు గాంధీ. భారతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ. తరతరాల యమ యాతన తీర్చిన వర దాత గాంధీ.
1948 జనవరి 30న బిర్లా హౌస్ వద్ద నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరిపాడు. హే రామ్ అంటూ ఆ మహనీయుడు ప్రాణాలు విడిచాడు. ఇవాళ ఆ మహాత్ముడి 77వ వర్ధంతి. గాంధీ వర్ధంతి రోజును దేశం మొత్తం షహీద్ దివస్‌గా జరుపుకుంటుంది.
గాంధీ చేసిన పోరాటం ప్రపంచమంతటినీ ఆకర్షించింది. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమైంది. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనను ఎదిరించిపోరాడిన ఘనత గాంధీజీది.
చిన్న పరిశ్రమలు స్వయం సమృద్ధి సాధించడానికి మూలాలుగా గాంధీజీ భావించాడు. మహాత్మా గాంధీ ప్రతిపాదించిన చిన్న, మధ్య తరహా కుటీర పరిశ్రమలు భారతదేశ అభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రతిపాదించాడు.
పెద్ద-స్థాయి పారిశ్రామికీకరణ శ్రమ దోపిడీకి దారితీస్తుందని, సంపదను కొందరి చేతుల్లోనే కేంద్రీకరిస్తుందని, చిన్న పరిశ్రమలు ఎక్కువ ఉపాధిని కల్పిస్తాయని గాంధీజీ విశ్వసించారు. గ్రామీణ ప్రజానీకానికి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన భావనకు ప్రధాన ఉదాహరణగా ‘ఖాదీ’ ఉద్యమాన్ని ప్రముఖంగా ప్రచారం చేశాడు. ఇక్కడ ప్రజలు ఇంట్లో స్పిన్నింగ్ వీల్ (చరఖా)ని ఉపయోగించి సొంతంగా వస్త్రాన్ని తయారు చేసుకునే విధానాన్ని ప్రజలకు నేర్పించాడు.
గాంధీజీ జీవితం మానవాళికి మార్గదర్శకం
విద్య యువతను నైతికంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా బాధ్యతాయుతమైన భావి పౌరులుగా తయారుచేస్తుందని గాంధీజీ విశ్వసించేవారు. యువతకు నైపుణ్యాన్ని అందించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు. శిక్షణ పిల్లల్లో అన్ని సామర్థ్యాలను పెంపొందించాలని, తద్వారా విద్యార్థులు సంపూర్ణ మానవులుగా మారాలని గాంధీజీ విశ్వసించారు.
అక్షరాస్యత అనేది విద్యకు ప్రారంభం లేదా ముగింపు కాదు. ఇది స్త్రీ లేదా పురుషుడు చేయగల సాధనం మాత్రమే. విద్య అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని అంశాలను సామరస్యపూర్వకంగా అభివృద్ధి చేయాలని గాంధీజీ స్వయంగా వివరించారు. విద్య ముఖ్యమైన లక్ష్యాలలో ఒకటి.
నైతిక వికాసం లేదా అభివృద్ధి అని కూడా ఆయన నమ్మాడు. ప్రతి ఒక్కరు తనలో దైవశక్తిని గ్రహించి దైవిక మానవునిగా ఎదగాలని గాంధీజీ ఆకాంక్షించారు. మాతృదేశమైన భారతదేశస్వాతంత్ర్యానికి గాంధీజీ చేసిన అహింసాయుత పోరాటం దేశప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. గాంధీజీ జీవితం, ఆదర్శాలు ప్రపంచ మానవాళికి మార్గదర్శకాలు.
గ్రామ స్వరాజ్యం
గాంధీజీ ప్రతిపాదించిన గ్రామ స్వరాజ్యం ఈరోజు మనం అమలుపరుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం. భారతదేశంలోని గ్రామాల మధ్య రాజకీయ అధికారం పంపిణీ చేయాలని గాంధీ కోరుకున్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అని పిలిచే దానిని వివరించడానికి గాంధీ 'స్వరాజ్' అనే పదానికి ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ ప్రజాస్వామ్యం స్వేచ్ఛపై ఆధారపడి ఉంది. గాంధీ దృష్టిలో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి కలిగిన, స్వయం-ఆధారమైన సంఘాలలో మాత్రమే నిర్వహించబడుతుంది, ఇది ప్రజలకు సంపూర్ణ భాగస్వామ్యం కోసం అవకాశాలను అందిస్తుంది.
గ్రామ పంచాయతీలు అట్టడుగు స్థాయిలో రాజకీయ, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ప్రారంభించడానికి అత్యంత ఆదర్శవంతమైన వ్యవస్థ పంచాయతీ రాజ్ వ్యవస్థ. మహాత్మా గాంధీ దేశవ్యాప్తంగా చేసిన పర్యటనలు గ్రామాలను గ్రామ పంచాయతీలే పరిపాలిస్తే భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందనే ఆయన నమ్మకాన్ని బలపరిచాయి.
- డా. ఎ. శంకర్, ఐలమ్మ మహిళా యూనివర్సిటీ