
- పైడి జయరాజ్, కాంతారావు పేర్లతో ప్రత్యేక పురస్కారాలు
- జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- 2014 నుంచి ఏడాదికో ఉత్తమ సినిమాకు అవార్డు ఇచ్చేందుకు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: గద్దర్ సినీ అవార్డులకు సంబంధించిన గైడ్‌లైన్స్ ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలు అందించిన పైడి జయరాజ్, కాంతా రావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ నటుడు ఎం.ప్రభాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని సర్కార్ డిసైడ్ అయింది.
2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. సినీ అవార్డులు అందజేయలేదు. ఈ మేరకు 2014 నుంచి ఏడాదికో ఉత్తమ సినిమాకు అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నది. మసాబ్‌ట్యాంక్‌లోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ఆఫీస్‌లో అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై సినిమా, బాలల సినిమా, పర్యావరణం/హెరిటేజ్/చరిత్రలపై సినిమా, డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిలిం కేటగిరీల్లో అవార్డులు అందజేయనున్నారు. అదేవిధంగా, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, తెలుగు సినిమాలపై బుక్స్/విశ్లేషణాత్మక వ్యాసాలు, ఆర్టిస్టులు/టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.