రైతులకు పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా)ను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. నిధులను సర్దుబాటు చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. ఎప్పటి మాదిరిగానే ఒక ఎకరా నుంచి మొదలుపెట్టాలని.. డిసెంబర్ నెలఖారు వరకైనా సరే రైతుల ఖాతాలకు నిధుల జమ పూర్తిచేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి దసరా తర్వాత నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని తొలుత ప్రభుత్వం భావించింది.
దుబారాగా లేకుండా మార్గదర్శకాలు
రైతుబంధు స్కీమ్‌లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత సర్కార్ హయాంలో.. రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లు, భూసేకరణ కింద పోయిన భూములకు వేల కోట్ల రూపాయలు రైతుభరోసా కింద వృథాగా చెల్లించినట్లు తేల్చింది. 2018 నుంచి 2023 వరకు రాళ్లు రప్పలు, రోడ్లకు ఇతరత్రా వాటికి ఏకంగా రూ.25 వేల కోట్లు చెల్లించినట్లు గుర్తించింది. దీంతో రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి..
ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది. చాలామంది రైతులు 10 ఎకరాల వరకు పెట్టుబడి సాయం ఇస్తే సరిపోతుందని తెలిపారు. మరికొంతమంది రైతులు ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే లిమిట్ ఎంతవరకు పెట్టాలనే దానిపై మార్గదర్శకాలకు సంబంధించిన డ్రాప్ట్ నోట్‌ను రెడీ చేసింది. ఈ మార్గదర్శకాలపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం.
రైతులు, రైతు సంఘాలు, వివిధ పార్టీల అభిప్రాయాలు ఇప్పటికే తెలుసుకున్నందున.. అవసరమైతేనే అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ నెల మొదటి వారంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటంతో వారు తిరిగిరాగానే అసెంబ్లీ సమావేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దానికి తగ్గట్టు రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించే అవకాశం ఉంది.