విజృంభిస్తోన్న గులియన్ బారే సిండ్రోమ్‌ .. 21 ఏళ్ల విద్యార్థిని మృతి

విజృంభిస్తోన్న గులియన్ బారే సిండ్రోమ్‌ .. 21 ఏళ్ల విద్యార్థిని మృతి

మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్‌ (Guillain Barre Syndrome) కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యాధి కారణంగా కిరణ్ దేశ్‌ముఖ్(21) అనే విద్యార్థిని చికిత్స పొందుతూ మరణించింది. అనారోగ్యంతో మూడు వారాల కిందట ఆస్పత్రిలో చేరిన కిరణ్.. చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచింది.

మృతురాలి స్వస్థలం.. బారామతి. పైచదువుల కోసం బంధువులతో కలిసి సింహగడ్ ప్రాంతంలో ఉంది. జనవరి మూడో వారంలో కిరణ్ ఈ వ్యాధి బారిన పడింది. ప్రారంభంలో విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. దాంతో, కుటుంబసభ్యులు ఆమెను బారామతిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పూణేకు తరలించారు. గత మూడు వారాలుగా ప్రాణాలతో పోరాడుతున్న ఈమె చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది.

మొదట మహారాష్ట్రను వణికించిం జీబీఎస్‌ నెమ్మదిగా దక్షిణాది రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. ఇటీవల ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్‌ కారణంగా మృతిచెందాడు. తొలుత శ్రీకాకుళం, విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన ఆ బాలుడిని ఆ తర్వాత రాగోలులోని జెమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడికి బ్రెయిన్‌డెడ్‌ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. 

ఏంటి ఈ గులియన్‌ బారే సిండ్రోమ్‌..?

గులియన్‌ బారే సిండ్రోమ్‌ అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్‌. అంటే, ఈ వ్యాధి బారినపడిన వ్యక్తిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ అతని నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే ఆటో ఇమ్యూన్‌ సిండ్రోమ్‌ అంటారు. అరుదైన వ్యాధిగా వైద్యులు చెప్తున్నారు. ముందుగా పాదాల దగ్గర మొదలై ఒక్కో అవయవాన్ని బలహీన పరుస్తూ పైవరకు చేరుకుంటుంది. దాంతో శరీర భాగాల్లో కదలికలేకుండా పోతుంది. కండరాలు బలహీనమవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. పక్షవాతం వచ్చిన రోగి ఉన్నట్టే.

ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో వ్యాధి బాగా ముదిరి రోగి కదల్లేని స్థితికి చేరుకుంటారు. మాట్లాడటం, నమలడం, మింగడం ఏదీ చేయలేరు. ఆపై రోజురోజుకు అత్యంత తీవ్రమైన అత్యవసర వైద్యపరిస్థితిగా మారుతుంది. దీని బారిన పడిన వారిలో డయేరియా, పొత్తికడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే అలసత్వం వద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.