ఈ బామ్మ 108 ఏండ్ల బార్బర్​ 

ఈ బామ్మ 108 ఏండ్ల బార్బర్​ 

షిట్సుయ్​ హకొయిషి అనే వృద్ధురాలి వయసు 108 ఏండ్లు. ఇదే ఒక రికార్డ్ అయితే.. ఈ బామ్మ మరో రికార్డ్​ సృష్టించింది. గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్​ సొంతం చేసుకుని మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ ఆ బామ్మ క్రియేట్ చేసిన రికార్డ్​ ఏంటి? 

సాధారణంగా ఎవరూ చేయలేని పని ఎవరైనా చేసి చూపిస్తే  గిన్నిస్​ వరల్డ్ రికార్డుల్లోకెక్కుతారు. అలానే హెయిర్​ కటింగ్​ చేసే పనిలో ప్రతిభ చూపిన కొందరికి గిన్నిస్​ రికార్డు సొంతమైంది. అయితే ఆ లిస్ట్​లో కేవలం మగవాళ్లే ఉన్నారు. చివరిగా 2018లో అమెరికాకు చెందిన107 ఏండ్ల వయసున్న బార్బర్​ ఆంథోని పేరు మీద రికార్డు నమోదైంది. ఆయన చనిపోయాక ఇంకెవరూ ఆ రికార్డును బ్రేక్ చేయలేదు. అలాంటి రికార్డును షిట్సుయ్​ బామ్మ కొల్లగొట్టింది. పైగా ఇప్పటివరకు మగవాళ్లకే అంకితమైన ఆ రికార్డు జాబితాలో ఈ ఘనత సాధించిన ఏకైక మహిళా బార్బర్​గా పేరు నమోదైంది. 

జపాన్​లోని నకగవ ప్రాంతంలో నివసించే రైతు కుటుంబంలో పుట్టింది షిట్సుయ్​. ఆమె14 ఏండ్ల వయసులోనే బార్బర్​ కావాలని నిర్ణయించుకుంది. తర్వాత టోక్యోకి వెళ్లి అక్కడే తను మొదటిసారిగా బార్బర్​ పనిలో అప్రెంటిస్​గా చేరి మెళకువలు నేర్చుకుంది. 20 ఏండ్ల వయసులో ఆమెకు బార్బర్ లైసెన్స్ లభించింది. అప్పుడు ఆమె తన భర్తతో కలిసి ఒక సెలూన్ ఏర్పాటు చేసింది.

ఆ తర్వాత జపాన్​‌‌–చైనా మధ్య జరిగిన యుద్ధంలో ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆ తర్వాత టోక్యోలో జరిగిన అగ్నిప్రమాదంలో తన సెలూన్​ కోల్పోయింది. ఎనిమిదేండ్ల తర్వాత ఆమె తన స్వగ్రామంలో మళ్లీ సెలూన్ ప్రారంభించింది. దాని పేరు రిహట్సు హకొయిషి. ఇప్పటివరకు తన వృత్తిని కొనసాగించడానికి కారణం ఏంటని అడిగితే ‘‘నా పనిముట్లను వదల్లేకపోయాను. నా కస్టమర్స్ కోసమే నేను ఈ పనిచేస్తున్నా. రికార్డుకెక్కడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది నాకు 109 ఏండ్లు వస్తాయి. 110 ఏండ్ల వరకు నేను ఈ పని కొనసాగిస్తా” అని కాన్ఫిడెంట్​గా నవ్వుతూ చెప్తోంది ఈ బామ్మ.