నిఖార్సు పాఠాలివి!

ఒక సందర్భం.. మూడు ఎన్నికలు.. పలు పాఠాలు! ఇదీ దేశ రాజకీయాల్లో తాజా పరిస్థితి. పాఠాలు సరే, ఎవరు నేర్చుకుంటారు? అన్నది ప్రధాన ప్రశ్న. దేశం మొత్తం దృష్టినాకర్షిస్తూ జరిగిన గుజరాత్‌‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు సగటు ఊహలను మించి బీజేపీకి అనుకూలంగా వెలువడ్డాయి. అన్ని సర్వేలు, రాజకీయ అంచనాలు ఇక్కడ బీజేపీయే మళ్లీ గెలుస్తుందని, ఇదివరకటి కన్నా ఎక్కువ స్థానాలే వస్తాయని చెప్పినప్పటికీ వాళ్ల ‘మిషన్‌‌ గుజరాత్‌‌’ లక్ష్యాల్ని మించి గెలుపు సాధించడం, సంఖ్యాపరంగా అందరినీ విస్మయపరిచింది. ఇక హిమాచల్‌‌ప్రదేశ్‌‌ ఎన్నికల్లో ఫలితాలు అక్కడి సంప్రదాయం కొనసాగింపుగానే కాకుండా దాదాపు సర్వేల దారిలోనే ఉన్నాయి. ఢిల్లీ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌(ఎమ్సీడీ) ఎన్నికల్లో ఆమ్‌‌ ఆద్మీ పార్టీ(ఆప్‌‌) గెలుపు సర్వేల సగటు అంచనాల కన్నా అడుగునే ఉంది తప్ప, ఆ సంఖ్యను ఆప్‌‌ అధిగమించలేకపోయింది. ఊహించిన దానికన్నా ఇక్కడ బీజేపీ మెరుగైన ఫలితాలే సాధించినట్టు లెక్క. ఒక్క హిమాచల్‌‌ ప్రదేశ్‌‌లో తప్ప మిగతా రెండు చోట్లా కాంగ్రెస్‌‌ చతికిలపడ్డ తీరు భవిష్యత్‌‌ రాజకీయాలకు భాష్యం చెప్పినట్టుగానే కనిపిస్తున్నది. తుది ఫలితాలే సంకేతాలుగా అన్వయించి చూస్తే.. ఈ మూడు ఎన్నికల్లో ఓటర్లు వ్యక్తపరచిన అభిప్రాయాలు అనేక అంశాలను వెల్లడిస్తున్నాయి. ఇందులో అన్ని పార్టీలకూ తగినన్ని పాఠాలు, గుణపాఠాలున్నాయి. 

ప్రత్యామ్నాయమో, సందేశమో అవ్వాలి

నిత్యం అక్కడ మోడీని తిడుతూనో, ఇక్కడ కేసీఆర్‌‌ను తిడుతూనో రాజకీయాలు నెరపుతామంటే స్వీకరించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీడియా/సోషల్‌‌ మీడియాలో బతుకుతూ చేసే రాజకీయ ప్రకటనలే ప్రజాభిప్రాయాన్ని ఏర్పరుస్తాయనుకోవడం, వాటంతట అవే తమని గెలిపిస్తాయనుకోవడం ఒట్టి భ్రమ అని గుజరాత్‌‌ ఎన్నికలు తేల్చాయి. ఉప ఎన్నికల్లో మునుగోడుకైనా, సాధారణ ఎన్నికల్లో గుజరాత్‌‌కైనా అదే వర్తిస్తుంది. ఒక ప్రభుత్వం విఫలమైందనో, ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తోందనో విమర్శిస్తే దాన్ని నిరూపించడంతో పాటు ప్రత్యామ్నాయంగా తాము ఏం అందిస్తారో ప్రజలకు చెప్పాలి. సంక్షేమ – అభివృద్ధి పథకాలైనా, ప్రత్యామ్నాయ సామాజికార్థిక ఎజెండా అయినా ప్రజాక్షేత్రంలో పరీక్షకు నిలవాలి. అలా ఒప్పిస్తే తప్ప ఓటేయడానికి వారు సిద్ధంగా లేరు. ధరల పెరుగుదల, నిరుద్యోగిత, విద్యుత్‌‌ సమస్యలు.. ఇలా పలు అంశాల్లో ప్రజా వ్యతిరేకత ఉందని పీపుల్స్‌‌ పల్స్‌‌తో సహా పలు సర్వేల్లో వెల్లడైంది. కానీ, దాన్ని పరిష్కరించే పాలనను ఇస్తామని విపక్షం ప్రజలకు భరోసా కల్పించలేకపోయింది. గుజరాత్‌‌లో ఆప్‌‌ రాక వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిలువునా చీలి తాము ఓడిపోయామని, బీజేపీ గెలిచిందనే కాంగ్రెస్‌‌ వాదన.. తమను తాము ఓదార్చుకోవడానికి కూడా పనికి రాదేమో! ఎందుకంటే, అదే ఆప్‌‌ పోటీలో ఉన్నప్పటికీ, పాలక బీజేపీపైన హిమాచల్‌‌ ప్రదేశ్‌‌లో తమ విజయాన్ని అది ఆపలేకపోవడాన్ని ఎలా అన్వయిస్తారు? గుజరాత్‌‌లో బీజేపీ ప్రభుత్వాన్ని కాదంటే, తాము ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఇస్తారో ప్రజలకు కాంగ్రెస్​ చెప్పలేకపోయింది. కరెన్సీనోట్‌‌పై లక్ష్మీదేవి బొమ్మ ఉండాలన్న ‘ఎన్నికల ఎత్తుగడ’తో ఆప్‌‌ కూడా ‘తానూ ఆ తాను ముక్కే!’ అనిపించింది తప్ప, గుజరాత్‌‌ ప్రజలకు కొత్త సందేశంతో భరోసా ఇవ్వలేకపోయింది.

పనులనే చూస్తారు, మాటలను కాదు!

పనిచేస్తే ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు. ఇది తిరుగులేని నిజమని దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ (ఎమ్సీడీ) ఎన్నికల్లో మరోమారు స్పష్టమైంది. కిందటి ఎన్నికల్లో తామే ఘోరంగా ఓడించిన ఆప్‌‌ ను ఈ సారి ఢిల్లీ ఓటర్లు గెలిపించడం వెనుక మతలబు అదే! ఎలా పనిచేస్తారో ప్రజాక్షేత్రంలో విద్య, వైద్యం వంటి కీలకాంశాల్లో ప్రత్యక్షంగా చూస్తున్న దేశ రాజధాని పౌరులకు, ఆప్‌‌ ఇస్తామంటున్న ప్రత్యామ్నాయ పాలనపై గురి కుదిరింది. అందుకే ఎమ్సీడీ ఎన్నికల్లో ఆప్‌‌ కు బేషుగ్గా పట్టం కట్టారు. 3 శాతం ఓటుషేర్‌‌ వ్యత్యాసంతోనే 20 శాతం ఎక్కువ సీట్లతో విస్పష్టంగా అధికారం అప్పజెప్పారు. విజేత ఆప్‌‌, పరాజిత బీజేపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 3 శాతమే! గత ఎన్నికల్లో(36.08శాతం)కన్నా ఈ సారి సుమారు రెండున్నర శాతం అధికంగా(39.1శాతం) ఓట్లు 
తెచ్చుకొని కూడా, పాలనాధికారానికి బీజేపీ దూరమైందంటే ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా అని సర్వేల్లో చెప్పినట్టు ప్రజలు ఏకపక్షంగా ఆప్‌‌కు అనుకూల తీర్పును ఇవ్వలేదు. 250 స్థానాల్లో బీజేపీని వందకు పైగా స్థానాల్లో గెలిపించి, ఒక బలమైన ప్రతిపక్షాన్ని నగరపాలక సంస్థలో ఏర్పరచుకోవడాన్ని ప్రజావిజయంగా చూడాలి. హిమాచల్‌‌ ప్రదేశ్‌‌లో కాంగ్రెస్‌‌కు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా స్థానాలు లభించినా ఓటుషేర్‌‌ వ్యత్యాసం ఒక శాతం కన్నా తక్కువే!

విపక్షంగా విఫలమైనా ఉత్తదే..

తెలంగాణలో ఓ సామెత ఉంది. ‘మొదలు మొగురం కానిది, కొన దూలమౌతుందా?’ అన్న సందేహం సహజం. అంటే, కాలేదని అర్థం. విపక్షంగా సఫలం కాలేని ఏ పార్టీ పాలకపక్షం కాలేదని పలుమార్లు రుజువైంది. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా విపక్షంగా దిగజారుడు ప్రమాణాలు, దిగదుడుపు ఫలితాలు చూపిన పార్టీలు ఎన్ని ఎన్నికల్లో పోరినా, గెలుపు సాధించలేకపోయాయి. ఈ సూక్ష్మాన్ని ఇతరులెవరికన్నా కూడా కాంగ్రెస్‌‌ బాగా గ్రహించాలి. ఢిల్లీని ఇటీవలి కాలం వరకు నిరవధికంగా పదిహేనేండ్లు పాలించిన చరిత్ర కాంగ్రెస్‌‌కు ఉన్నా, అక్కడ ఇపుడు అసలు పోరు బీజేపీ, ఆప్‌‌ల మధ్యే ఉంది. విపక్షంగానైనా కాంగ్రెస్‌‌ ఢిల్లీ ప్రజల్ని గెలవాలి. కానీ, కిందటి సారి కార్పొరేషన్‌‌ ఎన్నికల్లో కన్నా ఈ సారి పది శాతం ఓట్లు తగ్గాయి. ప్రతిపక్షంగానే నిలువలేని వారు, పాలకపక్షం ఎలా కాగలరు? అని ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేదైనా ఆత్మవంచన – పరవంచనలా కాకుండా అసలు సిసలు గణాంకాలు, వాస్తవిక ఫలితాల ఆధారంగా జరగాలి. అలా జరక్కపోతే, ఎన్ని పాదయాత్రలైనా థ్రెడ్‌‌మిల్‌‌ మీద నడిచినట్టు, ఉన్నచోటే ఉంటారు తప్ప అడుగు ముందుకు పడదు. ప్రజాస్వామ్యంలో ఏ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ అయినా జనక్షేత్రంలోకి రావడానికి, ప్రచారం చేసుకోవడానికి, పోటీ పడటానికి అవకాశం ఉన్నపుడు ఫలానా వారు వచ్చి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం వల్లే తాము ఓడామన్న వాదన సానుభూతికి కూడా పనికిరాదు. ఎందుకంటే, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఇవ్వగలరని భరోసా కలిగినపుడు, బరిలో డజన్‌‌ పార్టీలున్నపుడు కూడా ఒకపార్టీకి పెద్ద మెజారిటీతో పట్టం కట్టిన చరిత్ర ప్రజలది.

జనమూ అప్రమత్తం కావాల్సిందే!

ఏకపక్షంగా పార్టీలకు పట్టం కట్టి, తర్వాత నాలుక కర్చుకునే దుస్థితి పౌరులకు రాకూడదు. పాలకులు నియంతృత్వంగా వ్యవహరించే ఆస్కారం ఇవ్వకూడదంటే బలమైన విపక్షాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలదే అని రాజకీయ నిపుణులంటారు. ఒక పార్టీకి వ్యతిరేకంగా, మరో పార్టీ జెండా, ఎజెండాపై ఎన్నుకున్న తర్వాత కూడా.. ప్రజాప్రతినిధులు నిస్సిగ్గుగా ఆయా పార్టీలను వీడి, పాలకపక్షాల చంకన చేరుతున్న పాడు కాలమిది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని సదా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత కూడా ప్రజలదే! ప్రజలే అంతిమంగా ప్రజాస్వామ్య పరిరక్షకులు!

స్థానికాంశాలకే పెద్ద పీట

పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రం అవడమే కాకుండా జాతీయ నాయకత్వం, కేంద్ర పాలనతో బీజేపీ ఊదరగొట్టినా, హిమాచల్‌‌ ప్రదేశ్‌‌లో ఆ పార్టీ 37 ఏళ్ల సంప్రదాయానికి గండి కొట్టలేకపోయింది.1985 నుంచి ఇప్పటివరకు, పాలకపక్షానికి ప్రజలు తిరిగి పట్టం కట్టింది లేదు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చి, మోడీ నాయకత్వాన్ని తెరపైకి తెచ్చి, డబుల్‌‌ ఇంజన్‌‌ పాలన ప్రచారంతో పొరుగునున్న ఉత్తరాఖండ్‌‌లో లాగానే రికార్డు బద్దలుకొట్టి ‘ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుందాం’ అనుకున్న బీజేపీ కలలు కల్లలయ్యాయి. విపక్షం సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా, ఎప్పటిలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావంతో గెలుపు కాంగ్రెస్‌‌ను వరించింది. ఇక్కడ కాంగ్రెస్‌‌ లోకల్‌‌ నాయకత్వం చేసిన తెలివైన పని, స్థానికాంశాలనే ఎన్నికల ప్రచారాంశాలు చేయడం! ప్రభుత్వ వైఫల్యం, సీఎంపై వ్యతిరేకత, పాలకపక్షంలో అంతర్గత కుమ్ములాటలు, ధరల పెరుగుదల, ఆపిల్‌‌ రైతు ఇక్కట్లు.. ఇలా స్థానికాంశాలకే కాంగ్రెస్‌‌ పెద్దపీట వేసింది. ఎన్నికల ప్రచారంలో జాతీయాంశాలు తెరపైకి వస్తే తమనేత రాహుల్‌‌ గాంధీ, ప్రధాని మోడీ ముందు తేలిపోతారని, తమకది ప్రతికూలమౌతుందని కాంగ్రెస్‌‌ నాయకత్వ శ్రేణులు గ్రహించాయి. ‘భారత్‌‌ జోడో’ అంటూ పాదయాత్ర చేస్తున్న రాహుల్‌‌ పైన కన్నా రాష్ట్రంలో విస్తృత ప్రచారానికి వచ్చిన ప్రియాంకా గాంధీపైనే స్థానిక నాయకత్వం ఎక్కువ ఆధారపడింది. ఓటు షేర్‌‌లో స్వల్ప వ్యత్యాసమే అయినా, మ్యాజిక్‌‌ నంబర్‌‌ 35ను దాటి, కాంగ్రెస్‌‌ విజయ ఢంకా మోగించింది. ఆప్‌‌ ఇక్కడ పూర్తిగా చతికిల పడటం కాంగ్రెస్‌‌కు లాభించింది.
- దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ