
అహ్మదాబాద్: హోరాహోరీగా సాగుతున్న రంజీ ట్రోఫీలో సెమీఫైనల్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కేరళ జరిగే తొలి సెమీఫైనల్లో ఆతిథ్య గుజరాత్, నాగ్‌పూర్‌లో విదర్భతో జరిగే మరో పోరులో ముంబై ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. 2016–17 ఎడిషన్ విన్నర్ అయిన గుజరాత్.. 2019–20 సీజన్ తర్వాత తొలిసారి సెమీస్‌కు వచ్చింది.
క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రను ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో ఓడించి ఆత్మవిశ్వాసంలో ఉంది. క్వార్టర్స్‌లో సెంచరీలు కొట్టిన ఉర్విల్ పటేల్, జైమీత్ పటేల్‌తో పాటు మనన్ హింగ్రాజియా మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు సచిన్ బేబీ కెప్టెన్సీలోని కేరళ.. జమ్మూ కాశ్మీర్‌తో క్వార్టర్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు ఆధిక్యంతో గట్టెక్కి సెమీస్‌కు వచ్చింది.
గాయం కారణంగా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ సేవలు కోల్పోయిన కేరళ తొలిసారి ఫైనల్ చేరుకోవాలని ఆశిస్తోంది. ఇక, దేశవాళీ క్రికెట్‌లో అత్యంత బలమైన జట్టు, డిఫెండింగ్ చాంపియన్ ముంబై 43వ టైటిల్‌పై గురి పెట్టింది. గత సీజన్ ఫైనల్లో విదర్బను ఓడించిన ముంబై ఈసారి సెమీస్‌లో ఆ జట్టు పని పట్టాలని చూస్తోంది. టీమిండియా ప్లేయర్లు రహానె, సూర్యకుమార్, శివం దూబే, శార్దూల్ ఠాకూర్‌తో ముంబై అత్యంత బలంగా ఉంది. ఇంకోవైపు సూపర్ ఫామ్ చూపెడుతున్న కరుణ్ నాయర్ కెప్టెన్సీలోని విదర్భ కూడా ఈ సీజన్‌లో సత్తా చాటుతోంది.