SRH vs KKR: భయపెడుతున్న క్వాలిఫయర్ 1.. అహ్మదాబాద్‌లో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

SRH vs KKR: భయపెడుతున్న క్వాలిఫయర్ 1.. అహ్మదాబాద్‌లో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ మ్యాచ్ లకు ముందు క్రికెట్ ఫ్యాన్స్ లో ఉగ్రవాద భయం పట్టుకుంది. మంగళవారం (మే 21) క్వాలిఫయర్ 1 కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ కు సరిగా ఒక్క రోజు ముందు న‌లుగురు ఐసిస్  టెర్రరిస్టులను గుజ‌రాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌ ఎయిర్​పోర్టులో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర ఏజెన్సీల నుంచి వచ్చిన ఇన్‌పుట్‌ల ఆధారంగా గుజరాత్ ఏటీఎస్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. విమానాశ్రయంలో పట్టుబడిన నలుగురు నిందితులు శ్రీలంక జాతీయతను కలిగి ఉండడంతో పాటు.. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం కలిగి ఉన్నారని సంక్షిప్త ప్రకటనలో ATS వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి చెన్నైకి.. అక్కడ నుంచి అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. టెర్రరిస్టుల పేర్లు మహ్మద్ నుస్రత్, మహ్మద్ నుఫ్రాన్, మహ్మద్ ఫారిస్, మహ్మద్ రజ్దీన్ అని పోలీసులు తెలిపారు. 

ఐపీఎల్ లో రానున్న రెండు మ్యాచ్ లు అహ్మదాబాద్ లోనే జరగనున్నాయి. మంగళవారం (మే 21) కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్ 1 మ్యాచ్ తో పాటు.. బుధవారం (మే 22) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఈ భయంకర సంఘటన ఫ్యాన్స్ ను బయాందోళనకు గురి చేస్తుంది. నాకౌట్‌ మ్యాచ్‌లను చూడడానికి వేలాది మంది అభిమానులు తరలివస్తుండటంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.