అహ్మదాబాద్: టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా కొందరు ఇంకా మూఢ నమ్మకాలతో తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ లో ఓ దంపతులు.. తమకు తామే శిరచ్ఛేదం చేసుకున్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన రాజ్‌కోట్ జిల్లా వింఛియలో సంచలనం రేపింది. హెముభాయ్ మక్వానా (38), హంసబెన్ (35) భార్యాభర్తలు. శనివారం (ఏప్రిల్ 15వ తేదీ) అర్ధరాత్రి తమ గ్రామంలోని పొలం వద్ద ఉన్న గుడిసెలో బలిదానం చేసుకున్నారు.
తలలు తెగిపడేలా గిలెటిన్ లాంటి పరికరం తయారు చేసుకున్నారు. దానికి పెద్ద రంపాన్ని అమర్చి తాడు కట్టారు. పక్కనే మంటను ఏర్పాటు చేసుకున్నారు. పరికరం కింద దంపతులిద్దరూ పడుకొని తాడు వదిలారు. దాంతో రంపం వారి తలలను కోసేసింది. ఆ తర్వాత తెగిన తలలు ముందే ఏర్పాటు చేసుకున్న మంటలో పడ్డాయి. మూఢనమ్మకంతోనే దంపతులు తమను తాము బలి ఇచ్చుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి..అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
బంధువులకు లెటర్ రాసి..
గతేడాది నుంచి హెముభాయ్ మక్వానా దంపతులు.. తమ గుడిసెలో దేవుడికి పూజలు చేస్తున్నారని స్థానికులు చెప్పారు. స్వీయబలికి ముందు దంపతులు వారి బంధువులకు లేఖ రాశారు. తమ వృద్ధ తల్లిదండ్రులను, ఇద్దరు పిల్లలను బాగా చూసుకోవాలని బంధువులను అందులో కోరారు.