ఊరు.. పల్లెటూరు.. దీని తీరే... అమ్మ తీరు..’ ఈ సినిమా పాట సరిగ్గా సరిపోతుంది ఈ ఊరికి. ఏ ఊళ్లోనైనా విపత్తులు వస్తే అక్కడి నుంచి వేరే ఊరికి వలస వెళ్లిపోతారు ప్రజలు. దాంతో ఊరంతా ఖాళీ అయిపోతుంది. కానీ, ఇక్కడ అలా జరగలేదు. విపత్తుకి ఎదురుతిరిగి నిల్చుంది ఈ గ్రామం. ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకునేలా కొత్త అందాలతో మళ్లీ పుట్టుకొచ్చింది. ఆ ఊరే గుజరాత్లో ఉన్న ధోర్డొ. ఇప్పుడు దేశ ప్రగతిని చాటే ఊరిగా ప్రఖ్యాతిగాంచింది. బెస్ట్ టూరిజం విలేజ్‌గా సెలక్ట్ అయ్యి మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను దశదిశలా చాటుతోంది. ఆ ఊరి ముచ్చట్లే ఇవి...
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భుజ్ అనే గ్రామానికి 80 కిలో మీటర్ల దూరంలో ఉంది ధోర్డొ. ఇది ‘ది గ్రేట్ రాన్ ఆఫ్ కచ్’కి గేట్ వే అని చెప్పొచ్చు. 2005లో ఈ ఊళ్లో ‘రాన్ ఉత్సవ్’ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా రాన్ ఉత్సవ్ ఘనంగా జరుగుతోంది అక్కడ. ధోర్డొ విలేజ్‌ని బెస్ట్ టూరిజం విలేజ్ 2023గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యుఎన్డబ్య్లూటిఒ) గుర్తించింది. బెస్ట్ టూరిజం విలేజ్ లిస్ట్‌లో 40 దేశాల నుంచి 70 గ్రామాలు ఎంపికయ్యాయి.
అందులో ధోర్డొ కూడా ఒకటి. ఈ గ్రామాలకు చారిత్రాత్మక ఊరైన ఉజ్బెకిస్తాన్‌లోని ‘సమర్కండ్’లో ఈ నెల19న అవార్డులు అందజేశారు. ఈ అవార్డు అందుకునే ఊరికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అవేంటంటే... గ్రామాభివృద్ధి, లాండ్స్కేప్ అందాలు, విలువలు కాపాడుకోవడం, కల్చరల్ హెరిటేజ్– రీసోర్సెస్, లోకల్ వాల్యూస్, ఫుడ్ ట్రెడిషన్స్, సహజ వనరులు, ఆర్థిక, సామాజిక, పర్యావరణం, టూరిజం. ఇవన్నీ మెండుగా ఉన్నాయి ధోర్డొలో.
అత్యున్నత సంస్కృతి
ఈ ఊరు సంస్కృతి, ఆతిథ్యానికి పెట్టింది పేరు. సింధ్ నాగరికతకు చెందిన ముత్వ కమ్యూనిటీకి పుట్టిల్లు ఈ ఊరు. అక్కడి ప్రజల జీవన విధానంలో హస్తకళలు చాలా కీలకం. వాటిలో సూది, దారంతో కుట్టే ‘ముత్వ ఎంబ్రాయిడరీ’ చాలా ఫేమస్. గొలుసు కుట్టు మధ్యలో అద్దాలు కూర్చి అందంగా కుడతారు. ఈ డ్రెస్సింగ్‌కి తగ్గట్టు వెండి ఆభరణాలు వేసుకుంటారు. ఈ ఊరికి వెళ్లిన టూరిస్ట్‌లు ముత్వ ఎంబ్రయిడరీ ఐటెమ్స్ కొనుక్కోకుండా ఉండరు. అంతేకాదు.. టూరిస్ట్‌లకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడున్న కళాకారుల దగ్గర హస్తకళలు కూడా నేర్చుకోవచ్చు. మట్టితో చేసిన క్రాఫ్ట్స్‌ని గుడిసెల్లోని గోడలకు అంటిస్తారు.
ఇక్కడి ఇళ్లు కూడా స్పెషల్‌గా ఉంటాయి. వాటిని భుంగస్ అని పిలుస్తారు. సంప్రదాయ రీతిలో మట్టితో గుండ్రంగా కడతారు ఈ ఇళ్లను. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడి ఎడారి వాతావరణానికి తగ్గట్టు ఉంటాయి. భూకంపాలను తట్టుకోవడమే కాకుండా తుఫాను గాలులు, ఇసుక తుఫాన్లను కూడా తట్టుకునేలా ఉంటుంది ఈ ఇళ్ల నిర్మాణం. ఇళ్లను ఇలా కట్టే ట్రెడిషన్ రెండు వందల ఏండ్ల నుంచి వస్తోంది.1819లో భూకంపం రావడంతో చాలా నష్టపోయారు ఇక్కడి వాళ్లు. దాంతో కచ్‌లో ప్రజలు భుంగస్ డిజైన్‌లో ఇళ్లు కట్టడం మొదలుపెట్టారు. అలాగే 2001 భూకంపం తర్వాత ఇంకాస్త గట్టిగా భుంగస్లు కడుతున్నారు. టూరిస్ట్‌లకు లాడ్జింగ్ సౌకర్యం కూడా ఈ ఇళ్లలో ఇస్తున్నారు. ఇవేకాకుండా... నేచర్, వైల్డ్ లైఫ్ ఇష్టపడేవాళ్లకు కూడా ధోర్డొ స్వాగతం పలుకుతుంది. ఇక్కడకు వలస వచ్చిన రకరకాల పక్షి జాతులు, ఫ్లెమింగోలు, కొంగలు, పెలికాన్స్ వంటివి కనిపిస్తాయి. పక్షి ప్రేమికులు ఈ ఊరిని ఇంకా బాగా ప్రేమిస్తారు.
ఉప్పు ఎడారి
రాన్ ఆఫ్ కచ్‌కి ఇండియాలోనే ప్రత్యేకమైన జియోగ్రఫికల్ లొకేషన్‌గా పేరు. ఆ ప్రాంతంలో 27 వేల 454 చదరపు కిలో మీటర్ల మేర విస్తీర్ణంలో ఉప్పుతో కప్పబడిన ఎడారి ఉంది. ఈ ఉప్పు ఎడారి ధోర్డొ గ్రామానికి సుమారు కిలో మీటర్ దూరంలో ఉంటుంది. ఈ ఊరు అరేబియా సముద్రానికి చాలా దగ్గరగా ఉంది. 2001లో ఇక్కడ భూకంపం వచ్చినప్పుడు ఉప్పు నీళ్లు ఇక్కడికి చేరాయి. అలా కిలోమీటర్ల మేర ఉప్పు పేరుకుపోయింది. చూడ్డానికి అది అచ్చం విదేశాల్లో కనిపించే తెల్లటి మంచు ప్రదేశంలా కనిపిస్తుంది. అందుకే దాన్ని ‘వైట్ డెజర్ట్’ అని పిలుస్తారు కూడా. వెన్నెల కాంతిలో భలే అందంగా కనిపిస్తుంది ఈ ప్లేస్. అలాంటి ఈ ఊరికి కొత్త కళ తీసుకొచ్చింది రాన్ ఉత్సవ్.
రాన్ ఉత్సవాల సంగతులు
ఈ ఉప్పు ఎడారి ప్రాంతంలోని ధోర్డొ గ్రామంలో రాన్ ఉత్సవ్ పేరుతో సంప్రదాయ పండుగ జరుగుతుంది. అందులో కల్చరల్ యాక్టివిటీస్‌కి ప్రాధాన్యం ఎక్కువ. ఈ పండుగలో పాలుపంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్‌లు వస్తుంటారు. ప్రతి ఏటా నవంబర్ 10 నుంచి మొదలయ్యే ఈ పండుగ ఈసారి అక్టోబర్ 26నే మొదలయ్యాయి. అప్పటి నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. నాలుగు నెలలపాటు ధోర్డొ గ్రామమంతా సందడిగా ఉంటుంది. ప్రత్యేకమైన టెంట్లు వేసి, టూరిస్ట్‌లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుతారు. ఈ నాలుగు నెలలు సహజసిద్ధమైన వనరుల్ని, తయారుచేసిన ప్రొడక్ట్స్‌ని అమ్ముతారు. దాంతో ఆ ప్రొడక్ట్స్‌కి నేషనల్, ఇంటర్నేషనల్‌గా గుర్తింపు వస్తుంది. అలా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు వీళ్లు.
సిటీ మాదిరే..
ధోర్డొ గురించి ఇన్ని ప్రత్యేకతలు తెలిశాక చూడాలి అనిపిస్తుంది ఎవరికైనా. కానీ అసలే ఎడారి ప్రాంతం, పైగా ఊరు. మరి అక్కడ డబ్బులకు ఇబ్బంది పడాల్సి వస్తుందేమో! అని ఆలోచిస్తున్నారా. అలాంటి ఇబ్బందులకు ఇక్కడ చోటు లేదు. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్‌లు, ఏటీఏంలు అన్నీ ఉన్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అంతెందుకు గూగుల్ పే, ఫోన్ పేలతో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి ఇక్కడ.
ఇలా వెళ్లాలి
ధోర్డొ వెళ్లాలంటే.. విమాన, రైలు, రోడ్డు మార్గాల్లో వెళ్లొచ్చు. విమానంలో అయితే భుజ్ ఎయిర్పోర్ట్ దగ్గర్లో ఉంటుంది. అక్కడి నుంచి డొమెస్టిక్ ఫ్లైట్‌లో వెళ్లొచ్చు. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్‌కి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర. రైల్లో వెళ్లాలనుకుంటే భుజ్ రైల్వే స్టేషన్లో దిగి, అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్లొచ్చు. రోడ్డు మార్గం అయితే గుజరాత్‌లోని భుజ్, అహ్మదాబాద్ వంటి ఊర్లు చూసుకుంటూ ధోర్డొ వెళ్లొచ్చు.
ప్రముఖుల ప్రశంసలు
ధోర్డొకి దక్కిన అరుదైన గౌరవంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘కచ్‌లోని ధోర్డొ గ్రామానికి ఈ గుర్తింపు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ గౌరవం కేవలం ఇండియన్ టూరిజాన్ని చూపించడమే కాదు.. ప్రత్యేకించి కచ్‌లో ఉన్న ప్రజల అంకితభావానికి ప్రతీక’’ అని కొనియాడారు. ఈ సందర్భంగా 2009, 2015 టైంలో ఆయన ధోర్డొ వెళ్లిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కి సీఏంగా ఉన్న టైంలోనే ఆ ఏరియాని వరల్డ్ క్లాస్ టూరిజంగా చేయాలని పట్టుబట్టారు. ఇప్పుడు అక్కడున్న రోడ్లు, నీళ్లు, ఇతర సదుపాయాలన్నీ ఆనాటి కృషి ఫలితమే. ఇప్పుడు లభించిన గౌరవం టూరిజం ఎంత బలంగా ఉందో తెలియజెప్పేందుకు నిదర్శనం’’ అని కేంద్ర మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు.
టూరిజం మినిస్టర్ బెరా ధోర్డొ గురించి చెప్తూ.. ‘‘టూరిజానికి మాత్రమే కాదు. నేషనల్ లెవల్ అడ్మినిస్ట్రేషన్‌కి కూడా ఇది కేంద్రమే’’ అన్నారు. అలాగే.. ఈ అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 230 గ్రామాల పేర్లు వచ్చాయి. అయితే, అందులో ఎనిమిది గ్రామాలు మనదేశానివే కావడం గమనార్హం. రాన్ ఉత్సవ్ ధోర్డొలో జరగడం వల్ల 2022–23లో జీఎస్టీగా 468 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆ టైంలో ఇండియన్ టూరిస్ట్‌లు 98 వేల మంది కాగా 7,400 మంది ఇంటర్నేషనల్ టూరిస్ట్‌లు’’ అని వివరించారు.