
- అనధికారిక ట్రాన్సాక్షన్ జరిగిందని యూజర్‌కు ఫేక్ మెసేజ్
- సీవీవీ, ఓటీపీ సేకరించి అకౌంట్లు లూటీ
- గుజరాత్‌కు చెందిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేసిన సీఎస్‌బీ పోలీసులు
హైదరాబాద్, వెలుగు: అమెరికాకు చెందిన పేమెంట్ గేట్ వే ‘పేపాల్’ కస్టమర్ల అకౌంట్లను కొల్లగొడ్తున్న గుజరాత్ గ్యాంగ్‌ను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా సిటిజన్లు, ఎన్ఐఆర్లే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు వందల కోట్లు దోచుకున్నారు. హైటెక్ సిటీలో ఏకంగా ఫేక్ కస్టమర్ కేర్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి మరీ ఈ దందా కొనసాగించారు.
కాల్ సెంటర్ ఎండీ సహా 60 మంది టెలీ కాలర్స్‌ను సీఎస్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 63 ల్యాప్‌టాప్‌లు, 53 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ గురువారం మీడియాకు వెల్లడించారు.
హైటెక్ సిటీలో కాల్ సెంటర్
గుజరాత్‌కు చెందిన కైవన్ పటేల్, రూపేశ్ కుమార్.. దుబాయ్‌లో నివాసం ఉంటున్న అతని సోదరులు విక్కీ, ఆజాద్‌తో కలిసి అమెరికా పేమెంట్ గేట్ వే ‘పే పాల్’ కస్టమర్లను టార్గెట్ చేశారు. అమెరికాలో మ్యూల్ అకౌంట్లు ఓపెన్ చేశారు. ఈ కామర్స్‌లో షాపింగ్ చేసిన అమెరికన్లతో పాటు ఎన్‌ఆర్‌ఐల ఫోన్ నంబర్లు, ప్రధానంగా పేపాల్ పేమెంట్ గేట్‌వే కస్టమర్ల డేటాను సేకరించారు.
ఇండియాలో వినియోగించే గూగుల్ పే, ఫోన్ పే తరహాలోనే అమెరికన్లు వినియోగిస్తున్న ‘పే పాల్’ పేరుతో నకిలీ కస్టమర్ కేర్ సెంటర్ ను హైదరాబాద్ హైటెక్ సిటీ పత్రికా నగర్‌లోని హుడా టెక్నో ఎన్‌క్లేవ్‌లో ‘ఎక్సిటో సొల్యూషన్’ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కాల్ సెంటర్ గుజరాత్‌కు చెందిన జాదు భాయ్, రాహుల్ ఆధ్వర్యంలో చందా మనస్విని ఎండీగా వ్యవహరిస్తున్నది. టెలీకాలర్ ఉద్యోగం పేరుతో సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌పై ప్రచారం చేశారు.
ఇంగ్లీష్ మాట్లాడితే చాలు
విద్యార్హతలతో సంబంధం లేకుండా అమెరికన్ల తరహాలో స్పష్టంగా ఇంగ్లీష్ మాట్లాడే వారిని సెలెక్ట్ చేసుకున్నారు. నాగాలాండ్, మణిపూర్, మేఘాలయా, వెస్ట్ బెంగాల్ సహా నార్త్ ఇండియాకు చెందిన యువతను టెలీకాలర్స్‌గా నియమించారు. వీరికి రూ.30 వేలు జీతం, టార్గెట్స్ పూర్తి చేసిన వారికి కమీషన్లు, ఇన్సెంటీవ్స్ ఇస్తామని ఆశచూపారు. ఎలాంటి అనుమానం రాకుండా పే పాల్‌కు చెందిన కస్టమర్ కాల్‌సెంటర్‌గా నమ్మకం కలిగించారు. అమెరికన్లకు ఎలాంటి మెసేజ్‌లు పంపించాలి? వారి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టాలి? అనేదానిపై ట్రైనింగ్ ఇచ్చారు.
కాల్ సెంటర్ వివరాలు బయటకు తెలియకుండా ఓలా, ఉబర్ క్యాబ్స్‌లో ఆఫీస్‌కు ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం కల్పించారు. డిసెంబర్లో ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించారు. అమెరికా కాలమానానికి అనుగుణంగా రాత్రి టైమ్‌లోనే కాల్ సెంటర్ ఆపరేట్ చేసేవారు. దుబాయ్‌లో నివాసం ఉండే ఆజాద్ అందించిన డేటా ప్రకారం ఆయా నంబర్స్‌కి టెలీకాలర్స్ ఎస్ఎంఎస్లు పంపించేవారు. ప్రతి రోజు దాదాపు 600 మందికి కాల్స్ చేస్తుండేవారు.
‘ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్’ పేరుతో ఫేక్ కస్టమర్ కేర్
పేపాల్ ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్ పేరుతో ఎస్ఎంఎస్, ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. దీని కోసం ఐబీమ్, ఎక్స్ లైట్ అనే సాఫ్ట్‌వేర్లను వినియోగించారు. ‘‘మీ పేపాల్ నుంచి అనధికారిక అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. మీ ప్రమేయం లేకుండా జరిగితే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయండి’’ అని కాల్ సెంటర్ ఫోన్ నంబర్ ఇస్తున్నారు. ఇలా పే పాల్ కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ఆపరేట్ చేసేందుకు రెండు టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఓ టీమ్ కాల్స్ చేసే ‘డైలర్’ టీమ్ కాగా, మరో టీమ్ ‘క్లోజర్’ టీమ్‌గా పనిచేస్తున్నారు.
కాల్ చేసిన వారి నుంచి అకౌంట్‌కు రీఫండ్ చేస్తామని నమ్మించి వారి సీవీవీ, ఓటీపీ సహా బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించి, అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఇలా కొట్టేసిన డాలర్లను క్రిప్టోగా కన్వర్ట్ చేస్తున్నారు. దుబాయ్‌కి తరలించి విత్‌డ్రా చేస్తున్నారు. తర్వాత వివిధ మార్గాల్లో ఇండియాకు తరలించి వాటాలు పంచుకుంటున్నారు. ఫేక్ కాల్ సెంటర్ ద్వారా జరుగుతున్న మోసాల గురించి సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో సీఎస్‌బీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎండీ చందా మనస్విని సహా 62 మంది టెలీకాలర్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నారు. సీఎస్‌బీ ఎస్పీ దేవేందర్ సింగ్, సీఐడీ ఎస్పీ శ్రీనివాస్ రావు సహా సీఎస్‌బీ అధికారులతో కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు శిఖాగోయల్ తెలిపారు.