
లక్నో: డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ దుమ్మురేపింది. టార్గెట్ ఛేజింగ్‌లో హర్లీన్ డియోల్ (49 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 70 నాటౌట్), బెత్ మూనీ (35 బాల్స్‌లో 6 ఫోర్లతో 44) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడిన ఢిల్లీ 20 ఓవర్లలో 177/5 స్కోరు చేసింది.
మెగ్ లానింగ్ (57 బాల్స్‌లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 92) దంచికొట్టగా.. షెఫాలీ వర్మ (27 బాల్స్‌లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) రాణించింది. మేఘనా సింగ్ (3/35) మూడు వికెట్లు పడగొట్టింది. ఛేజింగ్‌లో గుజరాత్ 19.3 ఓవర్లలో 178/5 స్కోరు చేసింది. రెండో ఓవర్‌లోనే హేమలత (1) ఔటైనా.. మూనీ, లానింగ్ రెండో వికెట్‌కు 85 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను కాపాడారు.
12వ ఓవర్‌లో మూనీ వెనుదిరిగినా.. హర్లీన్ ఒంటరిపోరాటంతో టీమ్‌ను గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. లీగ్‌లో నాలుగో విజయం సొంతం చేసుకున్న గుజరాత్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ, యూపీ వారియర్స్ తలపడాయి.