అహ్మదాబాద్: ఐపీఎల్–17లో గుజరాత్ జెయింట్స్ బౌలర్లు మెరిశారు. 12 బాల్స్‌లో నాలుగు కీలక వికెట్లు తీసి బలమైన ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేశారు. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ 6 రన్స్ తేడాతో ముంబైకి చెక్ పెట్టింది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (39 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), శుభ్‌మన్ గిల్ (22 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 31), రాహుల్ తెవాటియా (15 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 22) రాణించారు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 162/9 స్కోరుకే పరిమితమైంది. రోహిత్ (13), డేవ్లాడ్ బ్రేవిస్ (46), తిలక్ వర్మ (25) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. సుదర్శన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బుమ్రా కట్టడి..
గుజరాత్ ఓపెనర్లు గిల్, సాహా (19) తొలి ఓవర్‌లోనే చెరో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చారు. దాన్ని కంటిన్యూ చేస్తూ మూడో ఓవర్‌లో సాహా మరో రెండు ఫోర్లు బాదాడు. దీంతో పాండ్యా వెంటనే బుమ్రా (3/14)ను బౌలింగ్‌కు దించి ఫలితాన్ని సాధించాడు. 4వ ఓవర్‌లో సాహాను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 31 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. శామ్స్ ములానీ బౌలింగ్‌లో గిల్ 4, 6తో జోరు పెంచడంతో పవర్‌ప్లేలో జీటీ 47/1 స్కోరు చేసింది.
ఇక ఓకే అనుకుంటున్న టైమ్‌లో 8వ ఓవర్‌లో చావ్లా (1/31).. గిల్‌ను ఔట్ చేసి షాకిచ్చాడు. సాయి సుదర్శన్‌తో కలిసిన అజ్మతుల్లా (17) నిలకడగా ఆడటంతో ఫస్ట్ టెన్‌లో గుజరాత్ 82/2 స్కోరుతో మంచి స్థితిలో కనిపించింది. 11వ ఓవర్‌లో ఈ ఇద్దరు చెరో సిక్స్ కొట్టినా.. 12వ ఓవర్‌లో జీటీకి మళ్లీ షాక్ తగిలింది. కోయెట్జీ (2/27).. అజ్మతుల్లాను ఔట్ చేయడంతో స్కోరు 104/3గా మారింది. ఫించ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ (12)ను కట్టడి చేసేందుకు బుమ్రాను కొనసాగించిన పాండ్యా సక్సెస్ అయ్యాడు. సుదర్శన్, మిల్లర్ సింగిల్స్ తీయడంతో మూడు ఓవర్లలో 20 రన్సే వచ్చాయి.
దీంతో 15 ఓవర్లలో స్కోరు 124/3గానే ఉంది. 16వ ఓవర్‌లో కోయెట్జీ 9 రన్స్ ఇవ్వగా, 17వ ఓవర్‌లో బుమ్రా డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో మిల్లర్, సుదర్శన్‌ను పెవిలియన్‌కు పంపాడు. 18వ ఓవర్‌లో తెవాటియా 6, 4, 4తో 19 రన్స్ రాబట్టినా, 19వ ఓవర్‌లో 7 రన్సే వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో తెవాటియా ఔట్‌కావడంతో గుజరాత్ చిన్న టార్గెట్‌కే పరిమితమైంది.
బౌలింగ్ సూపర్..
ఛేజింగ్‌లో ఇన్నింగ్స్ 4వ బాల్‌కే ఇషాన్ కిషన్ (0) డకౌట్‌కాగా, రోహిత్ రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చాడు. థర్డ్ ఓవర్‌లో నమన్ ధీర్ (20) 4, 4, 4, 6 కొట్టి ఔటయ్యాడు. 4వ ఓవర్‌లో రోహిత్ 4, 6 కొడితే.. బ్రేవిస్ ఫోర్‌తో ఖాతా తెరిచాడు. దీంతో ముంబై 52/2తో పవర్‌ప్లేను ముగించింది. ఇక్కడి నుంచి సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన బ్రేవిస్ రెండు సిక్స్‌లతో జోరు పెంచాడు. రెండో ఎండ్‌లో రోహిత్ రెండు ఫోర్లు బాదడంతో తొలి 10 ఓవర్లలో ముంబై 88/2 స్కోరు చేసింది.
జోరు కంటిన్యూ చేసిన రోహిత్‌కు 13వ ఓవర్‌లో సాయి కిశోర్ (2/24) బ్రేక్ వేశాడు. దీంతో థర్డ్ వికెట్‌కు 77 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. మూడు ఓవర్ల తర్వాత బ్రేవిస్ కూడా ఔట్‌కావడంతో ముంబై 129/4తో ఎదురీత మొదలుపెట్టింది. ఇక్కడి నుంచి తిలక్ వర్మ నిలకడగా ఆడినా, భారీ షాట్లకు యత్నించి 18వ ఓవర్‌లో టిమ్ డేవిడ్ (11) వెనుదిరిగాడు. చివరి 12 బాల్స్‌లో 27 రన్స్ కావాల్సిన టైమ్‌లో నాలుగు బాల్స్ తేడాలో తిలక్, కోయెట్జీ (1) ఔటయ్యారు. ఓవరాల్‌గా ఏడు బాల్స్ తేడాలో మూడు వికెట్లు పడటంతో లాస్ట్ ఓవర్‌లో 19 రన్స్ అవసరమయ్యాయి. ఉమేశ్ (2/31) బౌలింగ్‌లో హార్దిక్ (11) 6, 4 కొట్టి ఔట్‌కాగా, తర్వాతి బాల్‌కు పీయూష్ చావ్లా (0) వికెట్ పడటంతో ముంబై టార్గెట్‌ను అందుకోలేకపోయింది. ఉమేశ్, జాన్సన్, అజ్మతుల్లా, మోహిత్ తలా రెండు వికెట్లు తీశారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 168/6 (సుదర్శన్ 45, గిల్ 31, బుమ్రా 3/14).
ముంబై: 20 ఓవర్లలో 162/9 (బ్రేవిస్ 46, రోహిత్ 43, ఉమేశ్ 2/31, జాన్సన్ 2/25)